కర్నూలు జిల్లాలో డ్రై ల్యాండ్ హార్టీకల్చర్ కింద సాగు చేస్తున్న జామతోట
కర్నూలు (అగ్రికల్చర్): పండ్ల తోటల సాగులో రాష్ట్ర ప్రభుత్వం విప్లవం తీసుకొస్తోంది. బీడు భూముల్లోనూ ఉద్యాన పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తోంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వంద శాతం సబ్సిడీతో పండ్ల తోటల సాగుకు అవకాశం కల్పిస్తోంది. బావి, బోరు లేకున్నా పండ్ల తోటలు అభివృద్ధి చేసుకునేలా డ్రై ల్యాండ్ హార్టీకల్చర్ పథకం కింద బీడు భూమి సమీపంలోని చెరువు, కుంట, ఫారమ్ పాండ్ నుంచి నీళ్లు తెచ్చి మొక్కలను బతికించుకునే విధంగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. కరువు పీడిత జిల్లాల రైతులకు ఈ పథకం వరంగా మారుతోంది. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో చాలామంది రైతులు ఈ విధానం వైపు మొగ్గు చూపుతున్నారు.
ఈ ఏడాది లక్ష ఎకరాల్లో పండ్ల తోటలు
2021–22 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ విధానంపై ఆసక్తి ఉన్న 39,173 మంది రైతులను ఇప్పటివరకు అధికారులు గుర్తించారు. 60,495 ఎకరాల్లో సాగుకు అంచనాలు సిద్ధం చేశారు. వీరిలో 23,747 మంది రైతులకు 38,096 ఎకరాల్లో సాగు చేపట్టేలా ఇప్పటికే అనుమతులు ఇచ్చారు. పండ్ల తోటల అభివృద్ధిలో కర్నూలు జిల్లా రాష్ట్రంలో 6వ స్థానంలో ఉంది. ఉపాధి నిధులతో పండ్ల తోటల సాగులో అనంతపురం జిల్లా మొదటి స్థానంలో ఉండగా.. కృష్ణా జిల్లా అట్టడుగున ఉంది. అనంతపురం జిల్లాలో 15,001 ఎకరాల్లో పండ్ల తోటల సాగు చేపట్టాలనేది లక్ష్యం కాగా.. ఇప్పటికే 15,351 ఎకరాలకు సంబంధించి 5,652 మంది రైతులను గుర్తించడం విశేషం. విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోనూ పండ్ల తోటల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఉపాధి నిధులతో అన్ని రకాల పండ్ల తోటలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. రైతులు పండ్ల మొక్కలను ఎక్కడి నుంచైనా తెచ్చుకుని నాటుకోవచ్చు. వీటికి జిల్లాస్థాయి పర్చేజ్ కమిటీ నిర్ణయించిన ధరలను చెల్లిస్తారు. లేకపోతే ప్రభుత్వం టెండర్ ద్వారా ఎంపిక చేసిన నర్సరీల నుంచి తెచ్చుకోవచ్చు.
26 వేల కి.మీ. పొడవునా అవెన్యూ ప్లాంటేషన్
పండ్ల తోటలను అభివృద్ధి చేస్తూనే.. మరోవైపు పచ్చదనం పెంపుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 26,002 కి.మీ. రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు నిర్ణయించింది. కి.మీ.కు 200 మొక్కల చొప్పున నాటి పచ్చదనం అభివృద్ధికి గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు 15,027 కి.మీ. మేర అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టేందుకు అంచనాలు సిద్ధం చేశారు. ఇందులో ఇప్పటికే 6,600 కి.మీ. మేర మొక్కలు నాటేందుకు పరిపాలన అనుమతులొచ్చాయి. పచ్చదనం తరిగిపోయిన కొండల్లో అటవీ జాతి చెట్లకు సంబంధించి లక్షలాది సీడ్‌బాల్స్‌ను వెదజల్లనున్నారు. కర్నూలు జిల్లాలోనే 10 లక్షల సీడ్‌బాల్స్‌ను వేయనున్నారు.
డ్రై ల్యాండ్ హార్టీకల్చర్ రైతుల్ని ఆదుకుంటోంది
ఉపాధి హామీ పథకం కింద వంద శాతం సబ్సిడీతో చేపట్టిన డ్రై ల్యాండ్ హార్టీకల్చర్ పథకం రైతులను ఆదుకుంటోంది. ఉపాధి నిధులతో జిల్లాలో 35 వేల ఎకరాల్లో పండ్ల తోటల్ని అభివృద్ధి చేశాం. ఈ ఏడాది జిల్లాలో 8వేల ఎకరాల్లో పండ్ల తోటలు, 2 వేల కిలోమీటర్ల మేర అవెన్యూ ప్లాంటేషన్‌కు చర్యలు తీసుకున్నాం.
– అమరనాథరెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్, డ్వామా, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment