కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం 2016–22 వరకు ఏపీలో పెట్టిన స్టార్టప్‌లు
సాక్షి, అమరావతి: స్టార్టప్‌లను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో గత ఆరేళ్లలో 1,133 స్టార్టప్‌లు ఏర్పాటు కాగా అందులో 869 వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాకే ఏర్పాటు కావడం గమనార్హం. టీడీపీ హయాంలో 264 స్టార్టప్‌లు వచ్చాయి. కేంద్ర వాణిజ్య శాఖ సహాయమంత్రి సోంప్రకాష్ ఈ విషయాన్ని లోక్‌సభలో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో ఆంధ్రప్రదేశ్‌లో స్టార్టప్‌లు వేగంగా ఏర్పాటవుతున్నట్లు తెలిపారు. వీటి ద్వారా 11,243 మందికి ఉపాధి లభించినట్లు చెప్పారు.
రూ.100 కోట్లతో ఫండ్
గత మూడేళ్లుగా రాష్ట్రంలో ఏటా రెండు వందలకుపైగా స్టార్టప్‌లు ఏర్పాటు అవుతున్నాయి. ఈ ఏడాది మొదటి ఆర్నెల్లలోనే 164 ఏర్పాటు కావడం గమనార్హం. ‘యాక్సిలరేట్ స్టార్టప్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ ద్వారా అంకుర స్టార్టప్‌లను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని రూపొందించింది. స్టార్టప్స్‌కు నిధులను సమకూరుస్తూ రూ.100 కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, రోబోటిక్స్, 5జీ, సర్వ్‌లెస్ కంప్యూటింగ్ లాంటి అంశాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది.
స్టార్టప్స్ హబ్‌గా విశాఖ
రాష్ట్రంలో స్టార్టప్స్ బూమ్ మొదలైందని, రానున్న కాలంలో మరింత వేగంగా వృద్ధి చెందుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు. కొత్త స్టార్టప్‌లను ఆకర్షించడంతో రాష్ట్రం ముందంజలో ఉన్నట్లు కేంద్ర మంత్రే స్వయంగా ప్రకటించారన్నారు. స్టార్టప్స్‌లను ప్రోత్సాహంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారని, ఇందులో భాగంగా దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో స్టార్టప్ యూనికార్న్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారని గుర్తు చేశారు. ‘కల్పతరువు’ పేరుతో విశాఖ ఉక్కు కర్మాగారంలో ఇండస్ట్రీ–4 ఆవిష్కరణలను ప్రోత్సహించేలా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ, ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎస్‌టీపీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీల ఏర్పాటు ద్వారా స్టార్టప్స్ హబ్‌గా విశాఖపట్నం ఎదగనుంది.
Comments
Please login to add a commentAdd a comment