సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 66 డిప్యూటీ కలెక్టర్ పోస్టుల నియామకంపై రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. తమ శాఖలకు డిప్యూటీ కలెక్టర్ క్యాడర్ అధికారులు కావాలని వివిధ శాఖలు కోరడం, కొత్తగా 24 రెవెన్యూ డివిజన్ కేంద్రాలు ఏర్పాటవడంతో వారి అవసరం పెరిగింది.
ఈ నేపథ్యంలో నెల కిందట ప్రభుత్వం రెవెన్యూ శాఖలో 66 కొత్త డిప్యూటీ కలెక్టర్ పోస్టులను మంజూరు చేసింది. ప్రస్తుతం పనిచేస్తున్న తహసీల్దార్లకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకోసం 2022–23 సంవత్సరం అడ్‌హక్ ప్యానల్‌ను సిద్ధం చేశారు. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున 198 మందితో ప్యానల్‌ను రెడీ చేసి పరిశీలిస్తున్నారు. అంటే ఒక్కో పోస్టుకు ముగ్గురు తహసీల్దార్ల పేర్లను పరిశీలిస్తూ వారి పనితీరు, వారిపై ఉన్న కేసులు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు.
ఇందుకు అవసరమైన సమాచారాన్ని ఇప్పటికే రెవెన్యూ శాఖ సేకరించింది. త్వరలో జరిగే డిపార్టుమెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) సమావేశంలో ఈ 198 మంది నుంచి 66 మందిని ఎంపిక చేయనున్నారు. డీపీసీ సమావేశం ఎప్పుడు జరుగుతుందా అని ప్యానల్‌లో ఉన్న అధికారులు ఎదురు చూస్తున్నారు. తహసీల్దార్ల పదోన్నతులు కావడంతో రెవెన్యూ శాఖ మొత్తంలో దీనిపై ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment