
సాక్షి,అమరావతి: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో విశాఖపట్నానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇందుకోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(ఐటాప్), సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా(ఎస్‌టీపీఐ)తో కలిసి ‘ఇన్ఫినిటీ వైజాగ్’ పేరుతో విశాఖ వేదికగా 20, 21 తేదీల్లో సదస్సు నిర్వహిస్తోంది.
ముఖ్యంగా విశాఖను ఇండస్ట్రీ 4 టెక్నాలజీ రంగం, స్టార్టప్స్ హబ్‌గా తీర్చిదిద్దేలా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఐటాప్ ప్రెసిడెంట్ శ్రీధర్ కోసరాజు ‘సాక్షి’తో చెప్పారు. బీమా, లాజిస్టిక్స్, డేటా అనలిటిక్స్, వంటి రంగాల్లో పెట్టుబడులకు విశాఖ ఎంతటి అనువైన ప్రదేశమో ఈ సమ్మిట్ ద్వారా వివరిస్తామన్నారు. ఈ సదస్సు విజయవంతంపై రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు చెప్పారు.
మైక్రోసాఫ్ట్, టెక్‌మహీంద్రా, జాన్సన్ అండ్ జాన్సన్, ఇండియన్ సొసైటీ ఫర్ అసెంబ్లీ టెక్నాలజీ(ఐశాట్), విప్రో, బోష్, సీమెన్స్ వంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో పాటు, కేంద్ర ఐటీ శాఖ మంత్రి చంద్రశేఖరన్ ఈ సదస్సుకు హాజరవుతున్నారని శ్రీధర్ చెప్పారు. సదస్సు సందర్భంగా రాష్ట్రంలో ఐటీ రంగంలో విశేష ప్రతిభ కనబర్చిన కంపెనీలకు ఎస్‌టీపీఐ అవార్డులతో పాటు స్టార్టప్‌లకు అవార్డులు అందిస్తున్నట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment