
ఏపీటీఎఫ్ రాష్ట్ర మహాసభల ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న శ్రీకాకుళం జెడ్పీ చైర్‌పర్సన్ విజయ
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, నాడు–నేడు పథకంతో ప్రభుత్వ బడులు తలెత్తుకున్నాయని శ్రీకాకుళం జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ సాయిరాజ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) 75 వసంతాల (ప్లాటినం జూబ్లీ) ఉత్సవం, 19వ విద్యా వైజ్ఞానిక మహాసభలు గురువారం ప్రారంభమయ్యాయి. జెడ్పీ చైర్‌పర్సన్ ముఖ్య అతిథిగా హాజరై సభలను ప్రారంభించి మాట్లాడారు.
పిల్లల భవితకు బాటలు వేయడంలో తల్లిదండ్రుల కంటే గురువుల పాత్రే ఎక్కువగా ఉంటుందన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పి.రఘువర్మ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.భానుమూర్తి, పి.పాండురంగ వరప్రసాదరావు, శ్రీకాకుళం ఏపీటీఎఫ్ జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మదన్‌మోహన్, సుభాష్‌బాబులు 3 రోజుల రాష్ట్ర మహాసభల అజెండా, ఏర్పాట్లను వివరించారు. అనంతరం శ్రీకాకుళం నగరంలో ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ బీఆర్‌ఏయూ వీసీ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు, డీఈవో పగడాలమ్మ, ఏపీసీ జయప్రకాష్, ఏపీటీఎఫ్ పూర్వ అధ్యక్షుడు కె.వేణుగోపాల్, జిల్లాల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment