అంగన్‌వాడీలతో చర్చలు జరుపుతున్న మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు సమ్మె విరమించారు. ప్రభుత్వంతో సోమవారం అర్ధరాత్రి వరకు జరిపిన చర్చలు ఫలించడంతో మంగళవారం నుంచి యథావిధిగా విధుల్లోకి వెళ్లనున్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో అంగన్‌వాడీల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సచివాలయంలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. అంగన్‌వాడీల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోందన్నారు.
సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు పెట్టిన 11 డిమాండ్లలో 10 అంగీకరించడంతో పాటు, చాలా వాటిని అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టామని చెప్పారు. ముఖ్యమైన వేతనాల పెంపుపై ఇటు ప్రభుత్వం.. అటు అంగన్‌వాడీ యూనియన్లు పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనిని జూలై నుంచి అమలు చేసే దిశగా పని చేస్తున్నామని తెలిపారు. ‘అంగన్‌వాడీల శ్రేయస్సు, సంక్షేమం దృష్ట్యా రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వర్కర్లకు రూ.50 వేల నుంచి ఏకంగా రూ.1.20 లక్షలకు, హెల్పర్లకు రూ.20 వేల నుంచి రూ.60 వేలకు పెంచుతున్నాం.
అందరి ఉద్యోగుల మాదిరిగానే పదవీ విరమణ వయసు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు.. ప్రమోషన్ల కోసం వయో పరిమితి 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతున్నాం. కేంద్ర నిబంధనల ప్రకారం మినీ అంగన్‌వాడీల అప్‌గ్రేడ్ చేస్తాం. అంగన్‌వాడీల్లో పని చేస్తూ చనిపోయిన వారికి మట్టి ఖర్చుల కింద రూ.20 వేలు ఇవ్వాలని నిర్ణయించాం. కేంద్ర ప్రభుత్వ దృష్టికి గ్రాట్యుటీ అంశం తీసుకెళ్లి.. వారిచ్చేది నేరుగా అమలు చేస్తాం. భవిష్యత్తులో అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ నియమిస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి సమ్మె కాలంలోని అంగన్‌వాడీల వేతనం, పోలీసు కేసుల అంశం తీసుకెళ్లి.. న్యాయం జరిగేలా చూస్తాం. ఇన్ని డిమాండ్లను అంగీకరించడం అంటే అంగన్‌వాడీ అక్కచెల్లెమ్మల సంక్షేమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం’ అని మంత్రి తెలిపారు.
ఇక విధుల్లోకి వెళ్తున్నాం..
తమ డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు సుహృద్భావ వాతావరణంలో విజయవంతం అయ్యాయని అంగన్‌వాడీ యూనియన్ నాయకులు ప్రకటించారు. ఇకపై తాము విధుల్లోకి వెళ్లనున్నట్టు తెలిపారు. వేతనాల పెంపు విషయంలో దీర్ఘకాలిక పోరాటానికి పరిష్కారం లభించిందన్నారు. సర్వీసులో ఉండి అంగన్‌వాడీలు చనిపోతే మట్టి ఖర్చులు, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారని తెలిపారు. అంగన్‌వాడీలకు ప్రత్యేకంగా వైఎస్సార్ బీమా, అంగన్‌వాడీల బీమా అమలు చేస్తామనడం సంతోషంగా ఉందన్నారు.
2017 నుంచి కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతో టీఏ బిల్లులు నిలిచిపోయాయని, ఆ బిల్లులు వచ్చిన వెంటనే విడుదల చేస్తామన్నారని తెలిపారు. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి నెలకు ఒక టీఏ బిల్లు ఇస్తామనడం సంతోషంగా ఉందన్నారు. యాప్‌ల భారాన్ని సైతం తగ్గిచేందుకు స్పష్టమైన హామీ లభించిందన్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ బిల్లులు, గ్యాస్ మెనూ పెంపు, చిన్నారుల మెనూ పెంచాలని కోరగా ప్రత్యేక కమిటీలో చర్చించి నిర్ణయిస్తామని చెప్పారన్నారు. అంగన్‌వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయడానికి చర్యలు చేపడతామనడం ఆనందాని్నస్తోందన్నారు. ఈ సమావేశంలో అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల రాష్ట్ర అధ్యక్షురాలు బేబీరాణి, గౌరవాధ్యక్షురాలు మంజుల, వీఆర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
‘ఛలో’ భగ్నం
ఇదిలా ఉండగా.. అంగన్‌వాడీల ఆందోళనను అడ్డు పెట్టుకుని పలుచోట్ల టీడీపీ నేతలు టెంట్లు, కుర్చీలు, భోజనాలు సమకూరుస్తూ కొన్ని శక్తులను ఆందోళనకు పురిగొల్పుతున్నారు. అంగన్‌వాడీల ముసుగులో అసాంఘిక శక్తులు ఉద్రిక్తతలు, హింసను ప్రేరేపించేలా అరాచకంగా వ్యవహరిస్తున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ‘ఛలో విజయవాడ’కు పిలుపునిచ్చాయి. నిఘా వర్గాలు హెచ్చరించడంతో పోలీసులు ఈ కార్యక్రమాన్ని భగ్నం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment