సాక్షి, అమరావతి: ఏపీ పోలీస్ మాన్యువల్, పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ (పీఎస్‌వో) ప్రకారం రౌడీ షీట్లు తెరవడం, కొనసాగించడం, రౌడీలుగా ప్రకటించడం, వ్యక్తులపై నిఘాకు వీల్లేదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును హైకోర్టు ధర్మాసనం నిలుపుదల చేసింది. ప్రాథమికంగా సింగిల్ జడ్జి ఉత్తర్వులు చెల్లవని ధర్మాసనం ప్రకటించింది. సింగిల్ జడ్జి తీర్పునకు అనుగుణంగా ఆయా వ్యక్తులపై మూసివేసిన రౌడీషీట్లు , హిస్టరీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు లాంటి వాటిని తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు తిరిగి తెరవడానికి వీల్లేదని పోలీసులకు తేల్చి చెప్పింది. అయితే ఆ వ్యక్తులపై తాజాగా ఏవైనా ఆధారాలుంటే వాటి ప్రకారం రౌడీషీట్లు, హిస్టరీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు తెరవొచ్చని స్పష్టం చేసింది.
అనుమానితుడిపై, నిందితుడిపై నిఘా వేయాలనుకుంటే పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారమే ఆ పని చేయాలని ఆదేశించింది. ఎవరైనా వ్యక్తి / నిందితుడిని పోలీస్‌స్టేషన్‌కు పిలవాలంటే చట్ట ప్రకారం, పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం ముందస్తు నోటీసు ఇవ్వాలని తేల్చి చెప్పింది. వేలిముద్రల సేకరణ చట్ట నిబంధనలకు అనుగుణంగానే చేయాలని పేర్కొంది. అరెస్ట్ ఉత్తర్వులను అమలు చేసేందుకు, ఏదైనా కేసులో అనుమానితుడు, నిందితుడు అవసరమైనప్పుడు మినహా రాత్రి వేళల్లో వారి ఇళ్లకు వెళ్లరాదని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, జస్టిస్ బండారు శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
సింగిల్ జడ్జి తీర్పుపై ప్రభుత్వం అప్పీల్...
పోలీసులు రౌడీషీట్లు తెరవడాన్ని, కేసులు కొట్టివేసినా వాటిని కొనసాగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాదాపు 57 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ సోమయాజులు ఇటీవల తీర్పు వెలువరిస్తూ అసలు పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్‌కు చట్టబద్ధతే లేదని తేల్చి చెప్పారు. చట్టం అనుమతి లేకుండా పీఎస్‌వో ప్రకారం వ్యక్తులపై రౌడీషీట్లు తెరవడం, కొనసాగించడం, వ్యక్తుల సమాచారాన్ని సేకరించడం లాంటి వాటిని చేయడానికి వీల్లేదన్నారు.
పీఎస్‌ఓ ప్రకారం ఏళ్ల తరబడి చేస్తూ వస్తున్న ఫోటోల సేకరణ, స్టేషన్లలో ప్రదర్శించడం, ఇళ్లను సందర్శించడం, స్టేషన్‌కు పిలిపించడం, స్టేషన్‌లో గంటల పాటు వేచి ఉండేలా చేయడం తదితరాలన్నీ వ్యక్తుల గోపత్య హక్కుకు విఘాతం కలిగించేవేనన్నారు. పోలీసులు ఇప్పటి నుంచి పోలీసు స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం ఇలాంటి పనులు చేయడానికి, వ్యక్తులపై అనుచిత నిఘా పెట్టడానికి వీల్లేదని ఆదేశిస్తూ ఈ ఏడాది జూలై 15న సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.
ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ ముఖ్య కార్యదర్శి ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి తీర్పు అమలును నిలుపుదల చేయాలని కోరుతూ ఓ అనుబంధ పిటిషన్ వేశారు. తాజాగా హైకోర్టు ధర్మాసనం దీనిపై తీర్పు వెలువరించింది.
60 ఏళ్లుగా రౌడీషీట్లు తెరుస్తూనే ఉన్నారు..
‘మద్రాసు నుంచి విడిపోయిన తరువాత 1954 వరకు అప్పటి మద్రాసు ఇన్‌స్పెక్టర్ జనరల్ జారీ చేసిన పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్‌ను ఆంధ్ర రాష్ట్రం యథాతథంగా అన్వయించుకుంది. ఆంధ్రప్రదేశ్ (ఆంధ్రా ప్రాంత) జిల్లా పోలీసు చట్టం 1859ని పూర్తి స్థాయిలో అమలు చేయడం మొదలైంది. ఇందులో పోలీసుల విధులు, బాధ్యతలు, నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, నేరస్తులను గుర్తించి చట్టం ముందు నిలబెట్టడం లాంటి వాటి గురించి స్పష్టంగా పేర్కొన్నారు.
నేరాలను నియంత్రించేందుకు గత 60 ఏళ్లుగా రౌడీషీట్లు తెరవడమన్న ఆచారం కొనసాగుతూనే ఉంది. గతంలో సుంకర సత్యనారాయణ కేసులో పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ కార్యనిర్వాహక మార్గదర్శకాలేనని హైకోర్టు పేర్కొంది. అయినా ఈ కారణంతో రౌడీషీట్లు తెరవడాన్ని మాత్రం కొట్టేయ లేదు. రౌడీషీట్లు తెరవడం, మూసివేయడాన్ని క్రమబదీ్ధకరించే విషయంలో పలు ఆదేశాలు ఇచ్చింది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని రౌడీషీట్ల విష యంలో సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది.
ప్రభుత్వ న్యాయవాది వాదనను తోసిపుచ్చలేం..
‘కేఎస్ పుట్టస్వామి కేసులో గోప్యత హక్కు ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సింగిల్ జడ్జి పరిగణలోకి తీసుకుంటూ రౌడీషీట్లు తెరవడం, నిందితులపై నిఘా ఉంచడం లాంటివి వ్యక్తి గోప్యతా హక్కుకు విఘాతం కలిగించేవని తేల్చారు. అయితే ప్రభుత్వ న్యాయవాది (హోం) మాత్రం పుట్టస్వామి కేసుకు ఈ కేసుతో ఎంతమాత్రం సంబంధం లేదని అంటున్నారు.
ఆధార్ కార్డు జారీ సమయంలో వ్యక్తుల వివరాలను అడగడం గోప్యత హక్కుకు విఘాతమని సుప్రీంకోర్టు చెప్పిందని ప్రభుత్వ న్యాయవాది ఈ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఆ వాదన ప్రకారం ఈ కేసు నేరాన్ని నియంత్రించేందుకు అనుమానితులు, నిందితులపై తెరిచిన రౌడీషీట్లకు సంబంధించింది మాత్రమే.
ప్రభుత్వ న్యాయవాది వాదనను ఈ దశలో ఏ రకంగానూ మేం తోసిపుచ్చలేం. ఒక వ్యక్తిపై రౌడీషీట్ తెరవడం అతడికి రాజ్యాంగం ప్రసాదించిన గోప్యత హక్కుకు భంగం కలిగించినట్లా? అన్నది ఇక్కడ ప్రశ్న. దీనిపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది’ అని ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుతం తమ ముందున్న ప్రాథమిక ఆధారాలను బట్టి సింగిల్ జడ్జి తీర్పు అమలును నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment