సాక్షి, అమరావతి: సస్పెన్షన్‌లో ఉన్న న్యాయాధికారిని అరెస్ట్ చేసే ముందు లేదా అరెస్ట్ చేసినప్పుడు ఆ విషయాన్ని హైకోర్టుకు లేదా సంబంధిత జిల్లా జడ్జికి తెలపాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాల్సిందేనని చెప్పింది. ఇకపై న్యాయాధికారుల అరెస్ట్ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించేలా అన్ని జిల్లాల పోలీసులకు తగిన ఆదేశాలతో సర్క్యులర్ జారీచేస్తామన్న అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. భవిష్యత్తులో పొరపాటుకు ఆస్కారం లేకుండా నడుచుకోవాలని సూచించింది.
న్యాయాధికారి అరెస్ట్‌పై అతడి కుమారుడు రాసిన లేఖను సుమోటో పిటిషన్‌గా పరిగణించి విచారణ చేపట్టిన హైకోర్టు.. తదుపరి విచారణ జరపాల్సిన అవసరం లేదంటూ ఆ పిటిషన్‌ను మూసివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సస్పెన్షన్‌లో ఉన్న న్యాయాధికారి సంకు రామకృష్ణ ఒక న్యూస్ చానల్ చర్చాకార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి తల ఎప్పుడు తెగనరకాలా అని ఎదురు చూస్తున్నానంటూ మాట్లాడారు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు ఈ ఏడాది ఏప్రిల్ 15న చిత్తూరు జిల్లా పీలేరు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి రామకృష్ణను అరెస్ట్ చేశారు.
చిత్తూరు జిల్లా జైలులో ఉన్న తన తండ్రికి ప్రాణహాని ఉందంటూ రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ ఈ–మెయిల్ ద్వారా పంపిన లేఖను సుమోటో రిట్ పిటిషన్‌గా పరిగణించిన హైకోర్టు దీనిపై గురువారం మరోసారి విచారించింది. ఈ కేసులో కోర్టు సహాయకారి (అమికస్ క్యూరీ) అప్పారి సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. రామకృష్ణ అరెస్ట్ విషయాన్ని పోలీసులు హైకోర్టుకు తెలియజేయలేదన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. న్యాయాధికారిగా ఉంటూ వివాదాల్లోకి వెళ్లడం ఏంటని ప్రశ్నించింది.
న్యాయాధికారి అన్న విషయాన్ని మర్చిపోతే ఎలా అని అడిగింది. సత్యప్రసాద్ వాదనలు కొనసాగిస్తూ.. న్యాయాధికారుల అరెస్ట్ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించడానికి వీల్లేదన్నారు. న్యాయాధికారుల అరెస్ట్ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నడుచుకునేలా ఆదేశిస్తూ పోలీసులందరికీ సర్క్యులర్ ఇస్తామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ చెప్పారు. ఏజీ చాలా నిష్పక్షపాతంగా వాస్తవాలు చెప్పారని, ఈ వివరాలను పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణ అవసరం లేదని భావిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. పిటిషన్‌ను మూసివేస్తూ ఉత్తర్వులిచ్చింది.
న్యాయాధికారుల అరెస్ట్ సమాచారం ఇవ్వాల్సిందే..
Published Fri, Dec 3 2021 5:31 AM | Last Updated on Fri, Dec 3 2021 5:31 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment