సాక్షి, అమరావతి: గ్రూప్–1 ఇంటర్వ్యూలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ నెల 17న జరగాల్సిన ఇంటర్వ్యూలతో సహా తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు నిలుపుదల చేసింది. ఆట మొదలైన తరువాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనల్ని మార్చిందని హైకోర్టు ఆక్షేపించింది. ఇంటర్య్వూలు జరిగితే సరైన అభ్యర్థులు ఇంటర్వ్యూలు/తదుపరి ఎంపికకు వెళ్లే హక్కును కోల్పోతారంది. ఇంటర్వ్యూలు జరిగితే వారికి తీరని నష్టం కలుగుతుందని అభిప్రాయపడింది. ఒక్క మార్కు తేడా కూడా అభ్యర్థి జీవితం మొత్తాన్ని మార్చేస్తుందని పేర్కొంది. ఈ దృష్ట్యా ఇంటర్వ్యూలు జరిగితే కలిగే నష్టాన్ని ‘తీరని నష్టం’గా చెప్పాల్సి వచ్చిందని తెలిపింది.
జవాబు పత్రాలను కోర్టు ముందుంచేలా ఆదేశాలు ఇవ్వాలన్న అభ్యర్థనలతో దాఖలైన వ్యాజ్యాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. గ్రూప్–1 ప్రధాన పరీక్షకు సంబంధించిన సమాధాన పత్రాలను డిజిటల్ పద్ధతిలో మూల్యాంకనం చేసే బాధ్యతలను థర్డ్ పార్టీకి అప్పగించడం సరికాదని, ఈ నెల 17న జరగాల్సిన ఇంటర్వ్యూలకు సంబంధించిన తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై మంగళవారం వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు బుధవారం సాయంత్రం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించారు.
న్యాయమూర్తి ఉత్తర్వుల్లో ఏమన్నారంటే..
‘సివిల్ సర్వెంట్లను భర్తీ చేసుకునే గొప్ప బాధ్యతను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు రాజ్యాంగం కట్టబెట్టింది. అందువల్ల పోస్టుల భర్తీ విషయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై రాజ్యాంగ బాధ్యత ఉంది. ఈ బాధ్యతను రొటీన్ కార్యనిర్వాహక బాధ్యతగా భావించడానికి వీల్లేదు. జవాబు పత్రాలను డిజిటల్ పద్ధతిలో మూల్యాంకనం చేసేందుకు థర్డ్ పార్టీని ఏర్పాటు చేయడం, ఆ థర్డ్ పార్టీని ఎంపిక చేసేందుకు వారు అనుసరించిన విధానం, మూల్యాంకనం విషయంలో వారికున్న అనుభవం ఏమిటన్నదే ఈ కేసులో ప్రధానంగా తలెత్తే విషయాలు. చ ట్టం నిర్దేశించిన విధంగా నడుచుకుని తీరాల్సిందే. డిజిటల్ మూల్యాంకనం బాధ్యతలను థర్డ్‌పార్టీకి అప్పగించే విషయంలో ఆ థర్డ్ పార్టీని ఎలా ఎంపిక చేశారన్న దానికి సంబంధించిన వివరాలు ఇప్పటివరకు వెల్లడి కాలేదు. ఓపెన్ టెండర్ ద్వారానా, మ రో చట్టబద్ధ పద్ధతి ద్వారా చేశారో స్పష్టత లేదు. థర్డ్‌పార్టీకి సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసే అర్హతలు, నైపుణ్యం ఉన్నాయా అన్నదే ఇక్కడ తలెత్తే ప్రధాన ప్రశ్న. కమిషన్ దాఖలు చేసిన కౌంటర్‌లో ఈ విషయంలో మౌనం దాల్చింది. నోటిఫికేషన్‌లోని నిబంధనలను మార్చినా, సవరించినా ఆ విషయాన్ని సంబంధీకులందరికీ తెలియజేయాలని నిబంధనలు చెబుతున్నాయి. ప్రస్తుత కేసులో ఎవరు మూల్యాంకనం చేశారన్న దానిపై స్పష్టత లేదు. డిజిటల్ మూల్యాంకనంలోనూ గతంలో తప్పులు జరిగాయి. ఈ మొత్తం వ్యవహారంలో లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది’ అని న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇంటర్వ్యూలు వాయిదా
గ్రూప్–1 ఇంటర్వ్యూలను 4 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ ఇంటర్వ్యూలు ఈ నెల 17 నుంచి జూలై 9వ తేదీ వరకు జరగాల్సి ఉంది. అయితే గ్రూప్–1పై దాఖలైన వ్యాజ్యాలపై విచారణ చేసిన హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇంటర్వ్యూలు నిలిచిపోయాయి. సవరించిన ఇంటర్వ్యూల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment