
సాక్షి, అమరావతి: ఓ ఆస్తి వేలం వ్యవహారంలో కెనరా బ్యాంకు తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. బాకీదారుతో వన్‌టైం సెటిల్‌మెంట్‌కు అంగీకరించి, అతని రుణ ఖాతాను మూసివేసిన కెనరా బ్యాంకు.., మరో వైపు అదే ఆస్తిని బ్యాంకు వేలంలో కొన్న వ్యక్తి నుంచి ముందస్తుగా కొంత వసూలు చేసి, గడువు తేదీకి ముందే దానిని జప్తు/సర్దుబాటు చేయడాన్ని తప్పుపట్టింది. చెల్లింపు చివరి తేదీ వరకు మొత్తం డబ్బు చెల్లించేందుకు వేలంలో విజేతకు అవకాశం ఉంటుందని తెలిపింది.
చివరి తేదీన మొత్తం డబ్బు చెల్లించని పక్షంలో మాత్రమే అతని ముందస్తు చెల్లింపులను జప్తు చేసే అధికారం బ్యాంకుకు ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ కేసులో కెనరా బ్యాంకు హద్దుమీరడమే కాక, చట్ట విరుద్ధంగా కూడా వ్యవహరించిందని స్పష్టం చేసింది. వేలం వేసిన స్థలం విషయంలో బ్యాంకు నిష్పాక్షికంగా వ్యవహరించలేదంది. ఆ స్థలానికి రెండు భారీ భవంతుల మధ్య సన్నని తోవ గుండా వెళ్లాలన్న విషయాన్ని వేలం ప్రకటనలో తెలియజేయకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది.
జాతీయ బ్యాంకుగా దాని చర్యలు నిష్పాక్షికంగా, పారదర్శకంగా ఉండాలని తేల్చి చెప్పింది. పిటిషనర్ ముందుగా చెల్లించిన రూ.22.50 లక్షలు, గడువు తేదీ రోజు చెల్లించిన రూ.15 లక్షలను కూడా వాపసు చేయాలని బ్యాంకును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు, జస్టిస్ ఊటుకూరు శ్రీనివాస్ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.
జరిగిందిదీ..
పెరుమాళ్లు ఆగ్రో ఇండస్ట్రీస్ గుంటూరు విద్యానగర్‌లోని 302.50 చదరపు గజాల స్థలాన్ని తనఖా పెట్టి కెనరా బ్యాంకు నుంచి రుణం తీసుకుంది. ఆ రుణం తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు ఆ స్థలాన్ని వేలం వేసింది. వేలంలో చిలకలూరిపేటకు చెందిన సయ్యద్ హిదయతుల్లా బిడ్‌ను 2019 ఆగస్టు 26న ఆమోదించారు. నిబంధనల ప్రకారం బిడ్ మొత్తంలో 25 శాతం కింద రూ.22.50 లక్షలు ఆయన చెల్లించారు.
మిగిలిన మొత్తం చెల్లించేందుకు 2019 అక్టోబరు 25 చివరి తేదీగా నిర్ణయించారు. ఆ తేదీన హిదయతుల్లా రూ.15 లక్షలు మాత్రమే చెల్లించారు. కెనరా బ్యాంకు 2019 సెప్టెంబరు 9న రూ.22.50 లక్షలను పెరుమాళ్లు ఆగ్రో ఇండస్ట్రీస్ రుణ ఖాతా కింద సర్దుబాటు చేసింది. హిదయతుల్లా స్థలం లింకు డాక్యుమెంట్లు, ఇతర వివరాలను కోరినా బ్యాంకు ఇవ్వలేదు.
స్థలం ఎల్ ఆకారంలో ఉండటం, రెండు భారీ భవంతుల మధ్య నుంచి సన్నని తోవ గుండా వెళ్లాల్సి రావడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. తాను చెల్లించిన మొత్తాన్ని వాపసు ఇవ్వాలని బ్యాంకు అధికారులను కోరారు. వారు స్పందించకపోవడంతో 2019లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ సోమయాజులు ధర్మాసనం ఇటీవల తుది విచారణ జరిపి, తీర్పు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment