సమ్మె పరిష్కారం కాదు | Andhra Pradesh High Court On Employees Union About PRC | Sakshi
Sakshi News home page

సమ్మె పరిష్కారం కాదు

Published Wed, Feb 2 2022 2:18 AM | Last Updated on Wed, Feb 2 2022 2:18 AM

Andhra Pradesh High Court On Employees Union About PRC - Sakshi

సాక్షి, అమరావతి:  కొత్త వేతన సవరణకు సంబంధించిన పిటిషన్‌ న్యాయస్థానం ముందు పెండింగ్‌లో ఉండగా సమ్మెకు వెళ్లడమేమిటని ఉద్యోగ సంఘాలను రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. ప్రతీ సమస్యకూ సమ్మె పరిష్కారం కాదని చెబుతూ.. కోర్టు ముందు పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగానే సమ్మెకు వెళ్లడం అంటే కోర్టుపై ఒత్తిడి తీసుకురావడమేనని.. ఇలాంటి ఎత్తుగడలను తాము అనుమతించబోమని స్పష్టంచేసింది. చట్టానికి లోబడి ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ అందరికీ ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమ వినతుల ఆధారంగా మళ్లీ వేతనాలను సవరించి, ఆ మేర ఉత్తర్వులు జారీచేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ గెజిటెడ్‌ అధికారుల జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ వ్యాజ్యంపై సోమవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) తదితర అంశాల జోలికి తామిప్పుడు వెళ్లడంలేదని, ఈ దశలో వాటిపై విచారణ అవసరంలేదని ధర్మాసనం స్పష్టంచేసింది. అలాగే, ఏ ఒక్క ప్రభుత్వోద్యోగి జీతం నుంచి ఎలాంటి మొత్తాలను రికవరీ చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పీఆర్సీ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని కూడా తెలిపింది. ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వోద్యోగులు ఇక సమ్మెకు వెళ్లరనే భావిస్తున్నామని ధర్మాసనం అభిప్రాయపడింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. 
  
బెంచ్‌ హంటింగ్‌ను ప్రోత్సహించబోం 
ఈ సందర్భంగా సీజే స్పందిస్తూ.. ఈ వ్యాజ్యం ధర్మాసనం ముందుకే వస్తుందని మొదట ఈ వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్‌ అమానుల్లా ధర్మాసనం దృష్టికి ఎందుకు తీసుకురాలేదని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ)ను ప్రశ్నించారు. అలాగే, అధికరణ 309 కింద జారీచేసిన జీఓను సవాలు చేశామన్న సంగతి ఎందుకు ధర్మాసనానికి చెప్పలేదని అడిగారు. అనంతరం, ఏజీ శ్రీరామ్‌ సమాధానమిస్తూ.. ‘నిబంధనల గురించి నేను ఆ ధర్మాసనానికి చెప్పాను. దానిపై చర్చ కూడా జరిగింది. ఆ ధర్మాసనం సైతం ఈ వ్యాజ్యాన్ని మొదటి కోర్టే విచారించాలని అభిప్రాయపడింది. అయితే, పిటిషనర్‌ తరఫు న్యాయవాదే ఈ వ్యాజ్యం పునర్విభజన చట్ట నిబంధనల కిందకు వస్తుందని చెప్పారు. తరువాత సింగిల్‌ జడ్జి వద్ద కూడా నేను నిబంధనల గురించి వివరించాను’.. అని చెప్పారు. ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలపై తాము ఎంతమాత్రం సంతోషంగా లేమన్న ధర్మాసనం, బెంచ్‌ హంటింగ్‌ను తాము ప్రోత్సహించబోమని వ్యాఖ్యానించింది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తాను ఉన్నది ఉన్నట్లు మాట్లాడతానని, అది కూడా ఓపెన్‌ కోర్టులోనే మాట్లాడతానని, అది తనకున్న చెడ్డ అలవాటని సీజే జస్టిస్‌ మిశ్రా అన్నారు. 
 
ప్రతీ ఉద్యోగి వాదనను ప్రభుత్వం వినలేదు కదా? 

పిటిషనర్‌ తరఫు న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపిస్తూ.. వేతన సవరణ కోసం నియమించిన అశుతోష్‌ మిశ్రా కమిషన్‌  నివేదికను ప్రభుత్వం ఇప్పటివరకు బహిర్గతం చేయలేదని.. కొత్త వేతన సవరణ జీఓ ఏకపక్షంగా ఇచ్చారన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ‘ప్రభుత్వం ప్రతీ ఉద్యోగి వాదన వినలేదు కదా? అందుకే జాయింట్‌ యాక్షన్‌ కమిటీతో మాట్లాడింది. వివిధ తేదీల్లో చర్చలు జరిపారు కదా. జేఏసీతో మాట్లాడిందంటే ఉద్యోగులందరితో మాట్లాడినట్లే.’ అని స్పష్టంచేసింది. పిటిషనర్‌ను కొత్త వేతన సవరణ ఏ విధంగా ప్రభావితం చేస్తోందని ధర్మాసనం ప్రశ్నించింది. కొత్త వేతన సవరణవల్ల పిటిషనర్‌ జీతం తగ్గిందని, ఎలా తగ్గిందో వివరిస్తూ మెమో దాఖలు చేశానని రవితేజ తెలిపారు. జనవరిలో ఎంత వచ్చింది? ఫిబ్రవరిలో ఎంత వచ్చింది? అని ధర్మాసనం ప్రశ్నించింది. 
 
పిటిషనర్‌ జీతం రూ.22,432లు పెరిగింది 

ఈ సమయంలో అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ జోక్యం చేసుకుని.. పిటిషనర్‌ పే స్లిప్పుతో సహా అన్ని వివరాలతో తాము ఓ మెమో దాఖలు చేశామని చెప్పారు. పిటిషనర్‌ బేసిక్‌ పే డిసెంబర్‌లో రూ.51,230 ఉండగా, వేతన సవరణ తరువాత జనవరిలో అది రూ.78,820కి పెరిగిందన్నారు. మొత్తంగా అతని స్థూల జీతంలో రూ.22,432 పెరుగుదల ఉందని వివరించారు. ప్రభుత్వోద్యోగుల్లో వివిధ హోదాలకు గతంలో వచ్చిన జీతం, ఇప్పుడు పొందుతున్న జీతం వివరాలను ఆయన ధర్మాసనం ముందుంచారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ.. కరువు భత్యం, ఇంటి అద్దె భత్యం, సీసీఏ ఉపసంహరించారు కదా? అని ధర్మాసనం ప్రశ్నించింది.

వేతన సవరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాన్నే అనుసరించామని ఏజీ శ్రీరామ్‌ చెప్పారు. గతంలో ఇచ్చిన మధ్యంతర భృతి, తాజాగా నిర్ణయించిన ఫిట్‌మెంట్‌కు మధ్య ఎంత మొత్తం తేడా ఉందో దాన్ని రికవరీ చేస్తామని ప్రభుత్వం అంటోందని, దీనిపైనే ఉద్యోగులు ప్రధానంగా ఆందోళన చెందుతున్నారని, ఈ విషయంలో తాము తగిన ఆదేశాలిస్తామని ధర్మాసనం తెలిపింది. ఉద్యోగులకు నోటీసులు ఇవ్వకుండా ఎలా రివకరీ చేస్తారని ప్రశ్నించింది. తాము హెచ్‌ఆర్‌ఏ, డీఏల జోలికి వెళ్లడంలేదని, వాటిపై ప్రస్తుతానికి విచారణ అవసరంలేదంది. ఈ వ్యవహారంలో చాలా సున్నిత అంశాలున్నాయని, వాటన్నింటిపై తరువాత లోతుగా విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. 
 
జీతం తగ్గుదల లేదు.. రికవరీ లేదు.. 
ఇక 2021–2022 మధ్య జీతాల్లో తగ్గుదల లేనప్పుడు ప్రభుత్వోద్యోగులు ఎందుకు ఆందోళన చెందుతున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ఉద్యోగులు దురభిప్రాయంతో ఉన్నారని, అందువల్లే వారు అనవసర ఆందోళనకు గురవుతున్నారని ఏజీ చెప్పారు. 2021 డిసెంబర్‌లో తీసుకున్న జీతంతో పోలిస్తే ఏ ఒక్క ఉద్యోగి జీతం కూడా తగ్గడంలేదని ఆయన పునరుద్ఘాటించారు. ఏ ఒక్కరి జీతం నుంచి ఎలాంటి మొత్తం రికవరీ ఉండదన్నారు. ఈ వివరాలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీఓ–1 అమల్లో భాగంగా పిటిషనర్‌తో సహా ఏ ఉద్యోగి జీతం నుంచి ఎలాంటి మొత్తాలను రికవరీ చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేసింది. 
  
ఉద్యోగులూ.. చట్టం ఏం చెబుతుందో చూడండి.. 

ఈ సందర్భంగా జీతాల విషయంలో ఉద్యోగుల హక్కుల గురించి మాట్లాడటానికి  ధర్మాసనం సిద్ధమైంది. ఆన్‌లైన్‌లో చాలామంది ఉద్యోగులు ఈ కేసులో ఏం జరుగుతుందో చూస్తున్నారని, వారంతా కూడా జీతాలకు సంబంధించి చట్టం ఏం చెబుతుందో చూడాలని కోరింది. ఇంతకుమించి తాము ఈ విషయంలో మాట్లాడబోమంది. ఉద్యోగుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని జీతాల రికవరీ విషయంలో తాము మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చామని, ఈ ఉత్తర్వుల తరువాత కూడా ఉద్యోగులు సమ్మెకు వెళ్తారని తాము అనుకోవడంలేదని ధర్మాసనం తెలిపింది. అనంతరం ఏజీ స్పందిస్తూ.. కేసు మొదలు కావడానికి ముందు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. అవన్నీ మనస్సులో పెట్టుకోవద్దని, తనకు ఏదీ లోపల దాచుకోవడం అలవాటులేదని, ఉన్నది ఉన్నట్లు బయటకు మాట్లాడేస్తానని సీజే జస్టిస్‌ మిశ్రా చెప్పారు. రిజిస్ట్రీలో ఏమేం జరుగుతున్నాయో కూడా తనకు బాగా తెలుసునన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement