
ధ్రువీకరణ పత్రాలపై సీఎం ఫొటో, నవరత్నాల లోగో ఉంటే నష్టమేమిటి?
దీని వల్ల ప్రజల హక్కులు ఎలా ప్రభావితం అవుతాయి?
పిటిషనర్‌ను నిలదీసిన హైకోర్టు సీజే ధర్మాసనం
కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి మరింత గడువు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు జారీ చేసే కుల, స్థానికత, జనన ధ్రువీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటో, నవరత్నాల లోగో ముద్రించడం వల్ల ప్రజల హక్కులు ఎలా ప్రభావితం అవుతాయని హైకోర్టు ప్రశ్నించింది. వాటిపై సీఎం ఫొటో, నవరత్నాల లోగో ఉంటే పిటిషనర్ హక్కులు ఎలా ప్రభావితం అవుతాయని కూడా ప్రశ్నించింది. ముఖ్యమంత్రి ఫొటో ఉంటే వచ్చిన నష్టం ఏమిటని నిలదీసింది.
ఎన్నికల సమయంలో దాఖలు చేసే ఇలాంటి వ్యాజ్యాలన్నీ రాజకీయ ప్రయోజన వ్యాజ్యాలే అవుతాయని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి మరింత గడువునిచ్చింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎస్సీ, ఎస్టీల కుల, స్థానికత, జనన ధృవీకరణ పత్రాలపై సీఎం వైఎస్ జగన్ ఫొటో, నవరత్నాల లోగో ముద్రించడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించి, వాటిని ముద్రించకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ అమరావతి బహుజన సొసైటీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్ వాదనలు విపిస్తూ ధృవీకరణ పత్రాల మీద సీఎం ఫొటో, నవరత్నాల లోగో ముద్రిస్తున్నారని, వాటిని పరిశీలించాలని కోర్టును కోరారు.
వాటిని పరిశీలించిన ధర్మాసనం.. ధృవీకరణ పత్రాలపై సీఎం ఫొటో, నవరత్నాల లోగో ఉంటే నష్టం ఏముందని ప్రశ్నించింది. అసలు పిటిషనర్ ఎవరని ఆరా తీసింది. పిటిషనర్ ఎస్సీ, ఎస్టీ, సంఘం అధ్యక్షుడని రవిప్రసాద్ తెలిపారు. సీఎం ఫోటో, లోగో వల్ల ఎన్నికల సమయంలో ప్రజలు ప్రభావితం అవుతారని అన్నారు. ఎలా ప్రభావితం అవుతారన్న ధర్మాసనం.. ఎన్నికల సమయంలో దాఖలు చేసే ఇలాంటి వ్యాజ్యాలన్నీ రాజకీయ ప్రయోజన వ్యాజ్యాలే అవుతాయని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రభుత్వ న్యాయవాది జీఎల్ నరసింహారెడ్డి వినతి మేరకు కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి మరింత గడువునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment