అక్రమ నిర్బంధాలపై ఎప్పుడు ఫుటేజీ అడిగినా కుంటిసాకులు చెబుతున్నారు
కోర్టు అడగ్గానే మిస్టీరియస్‌గా ఫుటేజీ మాయమైపోతుంటుంది
ఇలాంటి వాటికి ఫుల్‌స్టాప్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది
ఈ విషయంలో పోలీసులకు గట్టి సందేశం పంపుతాం
సీసీటీవీ ఫుటేజీ లేదన్న మాచవరం ఎస్‌హెచ్‌వోపై హైకోర్టు ధర్మాసనం సీరియస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పౌరుల అక్రమ నిర్బంధం విషయంలో పోలీసుల తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ‘అక్రమ నిర్బంధాల విషయంలో వాస్తవాలను రూఢీ చేసుకునేందుకు ఆయా పోలీస్స్టేషన్లలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను సమర్పించాలని మేం ఎప్పుడు ఆదేశించినా పోలీసులు ఏవో కుంటిసాకులు చెబుతున్నారు. సీసీటీవీ ఫుటేజీ సమర్పించకుండా కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి తమాషాలకు ఫుల్‌స్టాప్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషయంలో పోలీసులకు గట్టి సందేశం పంపుతాం. లేనిపక్షంలో ఇలాంటి తమాషాలు కొనసాగుతూనే ఉంటాయి.’ అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. సీసీటీవీ ఫుటేజీని తమ ముందు ఉంచాలంటూ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా, సీసీటీవీ కాలిపోయిందని, ఫుటేజీ లేదంటూ అఫిడవిట్ దాఖలు చేసిన పల్నాడు జిల్లా మాచవరం పోలీస్‌స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో)పై హైకోర్టు మండిపడింది.
అతనిపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే తమ ముందున్న వ్యాజ్యాల్లో అతన్ని సుమోటోగా ప్రతివాదిగా చేర్చి, కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమిస్తామని చెప్పింది. ఈ వ్యవహారంలో పోలీసులపై ఏం చర్యలు తీసుకోవాలో స్పష్టతనివ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
సీసీటీవీ ఫుటేజీ సమర్పణకు హైకోర్టు ఆదేశం...
తన సోదరుడు కటారి గోపీరాజును పోలీసులు అక్ర మంగా నిర్బంధించారని, ఆయనను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరు తూ కటారు నాగరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన సోదరుడిని నవంబర్ 3న అక్రమంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు, 7వ తేదీన అరెస్ట్ చేశామంటూ అబద్ధం చెబుతున్నారని, ఈ నేపథ్యంలో మాచవరం పోలీస్‌స్టేషన్‌లో నవంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు సీసీటీవీ ఫుటేజీని కోర్టుకు సమర్పించేలా ఆదేశాలివ్వాలని కూడా ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. నాగరాజు పిటిషన్‌పై గతంలో విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం, నంబవర్ 2 నుంచి 8వ తేదీ వరకు సీసీటీవీ ఫుటేజీని పెన్‌డ్రైవ్‌లో సంబంధిత మేజిస్ట్రేట్ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కూడా స్పష్టం చేసింది.
కాలిపోయింది.. ఫుటేజీ లేదు...
తాజాగా సోమవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా మాచవరం ఎస్‌హెచ్‌వో దాఖలు చేసిన కౌంటర్‌ను ధర్మాసనం పరిశీలించింది. తమ స్టేషన్‌లో యూపీఎస్‌తో సహా సీసీటీవీ మొత్తం కాలిపోయిందని, అందువల్ల ఫుటేజీ రికార్డ్ కాలేదని, దీంతో ఫుటేజీని కోర్టు ముందుంచలేకపోతున్నామని ఎస్‌హెచ్‌వో చెప్పడాన్ని తప్పుపట్టింది. ‘కోర్టు సీసీటీవీ ఫుటేజీని అడగ్గానే మిస్టీరియస్‌గా ఆ సీసీటీవీ ఫుటేజీ కనిపించకుండా పోతోంది. మీరు (పోలీసులు) చెబుతున్నంత సింపుల్ వ్యవహారం కాదిది. మేం కఠినంగా స్పందించకుంటే ఈ తమాషా ఆగేలా కనిపించడం లేదు.
ఎస్‌హెచ్‌వోపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. లేదా మా ఆదేశాల మేరకు సీసీటీవీ పుటేజీని కోర్టుకు సమర్పించనందుకు సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పోలీస్స్టేషన్లలో సీసీటీవీలను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎస్‌హెచ్‌వోపై ఉంది. సీసీటీవీ పని చేయకుంటే దానిని రిపేర్ చేయించాల్సిన బాద్యూత కూడా అతనిపైనే ఉంది. ఎస్‌హెచ్‌వోపై ఎందుకు చర్యలకు ఆదేశించరాదో చెప్పండి..’ అని ప్రభుత్వానికి ధర్మాసనం స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment