సుగుణమ్మ, ఆమె అల్లుడి భూ దందాపై గత ఏడాది ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం
చిత్తూరు కలెక్టరేట్: తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎం.సుగుణమ్మకు హైకోర్టులో చుక్కెదురైంది. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరుకు సమీపంలో శ్రీనివాసపురం వద్ద చెరువు పోరంబోకు భూమిలో భవనం నిర్మాణాన్ని నిలిపివేయాలని హైకోర్టు ఇటీవల తాత్కాలిక ఉత్తర్వులిచ్చింది. సర్వే నంబర్ 241/3లోని 1.90 ఎకరాలు చెరువు పోరంబోకు భూములని, వాటిని ఆక్రమించి మాజీ ఎమ్మెల్యే ఎం.సుగుణమ్మ, బిల్డర్ ఆనందరావు అక్రమంగా భవనాలు నిర్మిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఈ భూమి విలువ దాదాపు రూ. 90 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఈ అక్రమ భూ బాగోతాన్ని గత ఏడాది నవంబర్ 9వ తేదీన ‘‘అల్లుడు.. గిల్లుడు.. ఎన్ని కోట్లు’’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ ఆక్రమణలపై ఈ ఏడాది ఫిబ్రవరి 10న కడప జిల్లాకు చెందిన బొల్ల రాజేష్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఇటీవల హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులిచ్చింది. తదుపరి ఆదేశాలిచ్చేంతవరకు ఆ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశించింది. అలాగే తుది తీర్పు ఇచ్చే వరకు జిల్లా యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఈ విషయంపై కలెక్టర్ హరినారాయణన్‌ను వివరణ కోరగా హైకోర్టు ఉత్తర్వులను పరిశీలిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment