
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 175 స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా ఏ నియోజక వర్గానికి ఎవరిని పార్టీ సమన్వయకర్త(ఇన్‌ఛార్జ్)గా నియమించాలో శాస్త్రీయంగా అధ్యయనం చేసిన అనంతరం మార్పులు చేర్పులకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో సోమవారం 11 నియోజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలను నియమించారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వివరాలను ప్రకటించారు. మంగళవారం నుంచి 11 నియోజవర్గాల్లో పార్టీ వ్యవహారాలన్నీ కొత్తగా నియమితులైన సమన్వయకర్తలే పర్యవేక్షిస్తారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మెరుగైన ఫలితాల కోసమే ఈ మార్పులని, భవిష్యత్తులోనూ ఇలాంటి నిర్ణయాలు ఉండవచ్చని వారు స్పష్టం చేశారు.
బొత్స మాట్లాడుతూ.. ఏ ఒక్కరినీ పార్టీ వదులుకోదని, అందరి సేవలను వినియోగించుకుంటుందని స్పష్టం చేశారు. గత నాలుగున్నరేళ్లుగా సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సామాజిక న్యాయం చేస్తూ వారికి ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చారన్నారు. సామాజిక సాధికారతను చేతల్లో చూపించారన్నారు. అణగారిన వర్గాలకు మరింతగా మంచి చేయాలంటే పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలన్నారు. భవిష్యత్తులోనూ అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులను సమీక్షించుకుంటూ అవసరాన్ని బట్టి ఇన్‌ఛార్జ్‌ల మార్పు చేర్పులపై తగిన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు.
గంజి చిరంజీవిని పార్టీలో చేర్పించింది మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డేనని మంత్రి బొత్స గుర్తు చేశారు. మంగళగిరి నియోజకవర్గ పార్టీ సమన్వకర్తగా చిరంజీవిని సీఎం జగన్ నియమించారన్నారు. పార్టీలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి సముచిత స్థానం ఇస్తారని చెప్పారు. పార్టీ ఏ ఒక్కరినీ వదులుకోబోదని, ఎవరి సేవలు ఎక్కడ అవసరమో అక్కడ వినియోగించుకుంటుందని స్పష్టం చేశారు. ఈ మార్పుల వల్ల కొందరికి బాధ ఉండవచ్చని, అయితే అందరూ సీఎం జగన్ నిర్ణయాలను అర్థం చేసుకుని పార్టీకి సహకరిస్తారన్నారు.
సజ్జల మాట్లాడుతూ.. ‘‘సీఎం జగన్ వైఎస్సార్‌సీపీని స్థాపించిన నాటి నుంచి పార్టీని ప్రజలకు జవాబుదారీగా ఉంచారు. సీఎం జగన్ దృష్టిలో శాసనసభ్యుడికి ఎంత విలువ ఉంటుందో కార్యకర్తకూ అంతే విలువ ఉంటుంది. పార్టీకి కార్యకర్తలే ప్రాణం. ప్రజలకు మరింతగా సేవ చేయాలంటే మళ్లీ అధికారంలోకి రావాలి. ప్రజలతో మమేకమై వారి మనసులు చూరగొని ఆశీస్సులు పొంది ఎవరు రాణిస్తారో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్ణయాలు తీసుకుంటామని సీఎం జగన్ మొదటి నుంచి చెబుతున్నారు. ఈ క్రమంలోనే 11 నియోజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలను నియమించారు.
భారీ మెజార్టీతో గెలవాలన్న ఆలోచనతోనే మార్పులు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు ఉండవచ్చు.. ఉండకపోవచ్చు కూడా! పార్టీ ఒక వ్యక్తి కోసమో.. వ్యక్తుల కోసమో ఉండదు. ఎవరిౖకైనా ఇబ్బంది ఉంటే కూర్చోబెట్టి మాట్లాడతాం. ఎందుకు మార్పు చేశామనేది అంతర్గతంగా వారికి వివరిస్తాం’’ అని అన్నారు. ప్రతిపక్షాలు గాలి మాటలతో గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నాయని, పొత్తులపై ఒక దారీ తెన్నూ లేకుండా వ్యవహరిస్తున్నాయని అన్నారు.