సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి సమయంలో 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు (వయో వృద్ధులు) ఇల్లే సురక్షితమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది. వైరస్ వ్యాప్తి సమయంలో వీరు ఎక్కువ ప్రమాదాన్ని కలిగి ఉంటారని తెలిపింది. సీనియర్ సిటిజన్లు, వారి సంరక్షకులు పాటించాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు జారీచేసింది. శ్వాసకోశ, గుండె, కిడ్నీ, కాలేయ సంబంధిత, మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు అధిక ప్రమాదాన్ని కలిగి ఉంటారని మార్గద్శకాల్లో సూచించింది. వీరు అన్ని సమయాల్లో ఇంట్లోనే ఉండాలని తేల్చిచెప్పింది. ఒంటరిగా నివసిస్తున్నట్లయితే అవసరమైన వస్తువులు తెప్పించుకోవడానికి ఇరుగుపొరుగు వాళ్ల సాయం తీసుకోవాలని.. సమూహాలకు దూరంగా ఉండాలని సూచించింది.
ఇతర మార్గదర్శకాలివీ..
► చేతులు, తరచుగా తాకే కళ్లజోడు, చేతి కర్ర వంటి వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలి.
► గతంలో వాడుతున్న రోజు వారీ మందులను క్రమం తప్పకుండా వాడాలి.
► ఇంట్లో వండిన తాజా ఆహారాన్ని తీసుకోవాలి. రోగనిరోధకత పెంచుకోవడానికి పోషకాహారం తీసుకోవాలి. డీహైడ్రేషన్‌కు గురికాకుండా నీరు, పళ్ల రసాలు తీసుకోవాలి.
► సాధ్యమైనంత వరకూ టెలీ–కన్సల్టేషన్ ద్వారా వైద్యులను సంప్రదించాలి.
► సీనియర్ సిటిజన్లకు సాయంచేసే ముందు సహాయకులు చేతులు శుభ్రంచేసుకోవాలి. సాయం చేసేటప్పుడు నోరు, ముక్కు కప్పి ఉండేలా మాస్క్ ధరించాలి. ఒళ్లు నొప్పులు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
► మానసికంగా ఆరోగ్యంగా ఉండటంపై సీనియర్ సిటిజన్లు దృష్టిపెట్టాలి. బంధువులు, కుటుంబ సభ్యులతో సంభాషిస్తుండాలి. పెయింటింగ్, సంగీతం వినడం, చదవడం వంటి పాత అభిరుచులను పాటించాలి. సోషల్ మీడియాలో అనధికారికంగా వచ్చే సందేశాలను నమ్మొద్దు. ఒంటరితనం, విసుగును నివారించడానికి మద్యపానం, ధూమపానం, ఇతర మత్తు పదార్థాలను వినియోగించరాదు. మానసిక అనారోగ్యం, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నా 104 కాల్ సెంటర్‌ను సంప్రదించాలి.
వారికి ఇల్లే సురక్షితం.. మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ
Published Wed, Feb 2 2022 2:48 AM | Last Updated on Wed, Feb 2 2022 1:34 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment