రాష్ట్ర మంత్రులుగా ప్రమాణం చేస్తున్న తానేటి వనిత, ఆర్కే రోజా, ఉషశ్రీ చరణ్, విడదల రజని, మంత్రులతో ప్రమాణం చేయిస్తున్న గవర్నర్ విశ్వభూషణ్. చిత్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: పునర్ వ్యవస్థీకరణ ద్వారా సామాజిక మహా విప్లవాన్ని ఆవిష్కరిస్తూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన నూతన మంత్రివర్గం సోమవారం కొలువుదీరింది. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తాత్కాలిక సచివాలయం మొదటి బ్లాకు పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై 25 మందితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత గవర్నర్, కొత్త, పాత మంత్రులు, అతిథులకు సీఎం వైఎస్ జగన్ తేనీటి విందు (హైటీ) ఇచ్చారు. రాష్ట్రంలో సామాజిక మహావిప్లవాన్ని ఆవిష్కరిస్తూ ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నలుగురిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారినే నియమించాలన్న సీఎం జగన్ సూచన మేరకు కె.నారాయణస్వామి, పీడిక రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, అంజాద్ బాషాలకు డిప్యూటీ సీఎంల హోదాను గవర్నర్ కల్పించారు.
గత మంత్రివర్గంలోనూ ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే సీఎం జగన్ కేటాయించడం తెలిసిందే. ఇక ఓసీ (కాపు) సామాజిక వర్గం నుంచి కొట్టు సత్యనారాయణను ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. హోంశాఖ మంత్రిగా తానేటి వనితకు అవకాశం కల్పించి మరోసారి ఎస్సీ వర్గానికి చెందిన మహిళనే నియమించారు. 2019 జూన్ 8న ఏర్పాటు చేసిన తొలి మంత్రివర్గంలో దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన మేకతోటి సుచరితను హోంశాఖ మంత్రిగా సీఎం జగన్ నియమించడం తెలిసిందే.
వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం మొదటి బ్లాక్ పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మంత్రుల గ్రూప్ ఫొటో
ప్రధాన శాఖలన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే..
పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దఎత్తున భాగస్వామ్యం కల్పించడం ద్వారా ఆయా వర్గాల్లో అట్టడుగు ప్రజానీకానికి సంక్షేమాభివృద్ధి ఫలాలను చేరవేసి ప్రగతి పథంలో సాగాలన్నది సీఎం జగన్ ఆశయం. అందులో భాగంగా గత మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 14 మందికి చోటు కల్పిస్తే తాజా మంత్రివర్గంలో అంతకు మించి 17 మందికి స్థానం కల్పించారు. అంతేకాకుండా అత్యంత ప్రధానమైన రెవెన్యూ, విద్య, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధి, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య, పౌరసరఫరాలు, రవాణా, గృహ నిర్మాణం, మహిళా శిశు సంక్షేమం తదితర కీలక శాఖలన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే కేటాయించడం గమనార్హం.
ఎస్సీలకు సమున్నత స్థానం..
సామాజిక న్యాయాన్ని చేతల్లో ఆచరిస్తూ పునర్‌వ్యవస్థీకరణ ద్వారా ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఎస్సీ వర్గానికి చెందిన ఐదుగురికి సీఎం వైఎస్ జగన్ చోటు కల్పించారు. శాఖల కేటాయింపులోనూ ఎస్సీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. గత మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా ఉన్న కె.నారాయణస్వామిని మళ్లీ అదే పదవిలో నియమించి ఎక్సైజ్ శాఖ కేటాయించారు. కొత్త మంత్రివర్గంలోనూ మళ్లీ ఎస్సీ వర్గానికి చెందిన మహిళ తానేటి వనితను హోంమంత్రి పదవిలో నియమించారు. అత్యంత కీలకమైన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను ఆదిమూలపు సురేష్‌కు కేటాయించారు. రవాణాతోపాటు సాంఘిక సంక్షేమ శాఖలను ఎస్సీ వర్గాలకే కేటాయించి ఆయా వర్గాలను సమున్నతంగా గౌరవించారు.
గిరిజనులకు గౌరవం..
మంత్రివర్గంలో గిరిజనులకు సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారు. ఆ వర్గానికి చెందిన పీడిక రాజన్నదొరను ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. గిరిజన సంక్షేమ శాఖను రాజన్నదొరకు కేటాయించడం ద్వారా ఆ వర్గాల ప్రజల అభ్యున్నతికి బాటలు వేశారు.
బీసీలకు పెద్దపీట..
బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. దేశానికి బ్యాక్ బోన్ క్లాస్ అని ఆచరణలో చూపించిన సీఎం జగన్ మైనార్టీలతో కలిపి ఆ వర్గాలకు గత మంత్రివర్గంలో ఎనిమిది మందికి చోటు కల్పిస్తే కొత్త మంత్రివర్గంలో 11 మందికి అవకాశమిచ్చారు. బీసీ వర్గానికి చెందిన బూడి ముత్యాలనాయుడిని ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. మైనార్టీ వర్గానికి చెందిన అంజాద్‌బాషాను ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. అత్యంత కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు, విద్య, పశు సంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్, గృహ నిర్మాణం తదితర కీలక శాఖలను బీసీ వర్గాలకే అప్పగించారు.
చేతల్లో మహిళా సాధికారత..
మహిళా సాధికారతపై చిత్తశుద్ధిని సీఎం వైఎస్ జగన్ మరోసారి చాటుకున్నారు. గత మంత్రివర్గంలో ముగ్గురు మహిళలకు స్థానం కల్పిస్తే.. కొత్త మంత్రివర్గంలో నలుగురికి చోటు కల్పించారు. మహిళా మంత్రులకు అత్యంత కీలక శాఖలు కేటాయించారు. హోంశాఖ మంత్రిగా ఎస్సీ వర్గానికి చెందిన తానేటి వనితను నియమిస్తే.. కీలకమైన ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖను విడదల రజనీకి కేటాయించారు. ఉషా శ్రీచరణ్‌కు మహిళా శిశు సంక్షేమ శాఖను, ఆర్కే రోజాకు పర్యాటక, సాంస్కృతిక, యువజన వ్యవహారాలను శాఖను కేటాయించి మహిళా సాధికారతపై మరో అడుగు ముందుకేశారు.
కార్యక్రమం సాగిందిలా..
తాత్కాలిక సచివాలయం మొదటి బ్లాకు పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై 25 మందితో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఉదయం 11.26 నిమిషాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకార వేదిక ప్రాంగణానికి చేరుకోగా ఆ వెంటనే గవర్నర్ కూడా వచ్చారు. గవర్నర్‌కు సాదరంగా స్వాగతం పలికి ప్రమాణ స్వీకార వేదికపైకి ముఖ్యమంత్రి తోడ్కొని వచ్చారు. జాతీయ గీతాలాపన అనంతరం ముందుగా నిర్ణయించిన ముహూర్తం మేరకు ఉదయం 11.31 గంటలకు మంత్రులుగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభించారు. బిశ్వభూషణ్ హరిచందన్ ... అనే నేను అంటూ అచ్చ తెలుగులో గవర్నర్ మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంది.
అభినందించిన గవర్నర్
అక్షర క్రమంలో కొత్త మంత్రుల పేర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ చదవగా గవర్నర్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. మధ్యాహ్నం 12.29 గంటలకు జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది. అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రితో నూతన మంత్రులు గ్రూపు ఫొటో దిగారు. ఆ వెంటనే తేనేటి విందుకు హాజరయ్యారు. అక్షర క్రమంలో తొలుత అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా చివరిగా విడదల రజని ప్రమాణం చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆది మూలపు సురేష్, ఉష శ్రీచరణ్ ఇంగ్లీషులో ప్రమాణ స్వీకారం చేయగా మిగతా వారంతా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. అంజాద్‌బాషా తెలుగులో అల్లా సాక్షిగా ప్రమాణ స్వీకారం చేయడం అందరినీ ఆకర్షించింది. మిగతా వారంతా దైవ సాక్షిగా ప్రమాణం చేశారు.
అనంతరం పలువురు మంత్రులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దగ్గరకు వెళ్లి నమస్కరించి ఆశీస్సులు పొందారు. నూతన మంత్రులను గవర్నర్ అభినందించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మండలి చైర్మన్ మోషేన్ రాజు, డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం, కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాసరావు, కొడాలి నాని, ధర్మాన కృష్ణదాస్, వెలంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని, పుష్ప శ్రీవాణి, శంకర నారాయణ, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంతరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ అనుబంధ సంఘాల ఇన్‌చార్జ్, పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అధికారులు హాజరయ్యారు. వివిధ నియోజకవర్గాల నుంచి హాజరైన ప్రజలు, అనుచరులు మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రుల కుటుంబ సభ్యులు, బంధువులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు.
ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు..
అంబటి రాంబాబు (సత్తెనపల్లి), అంజద్ బాషా షేక్ బేపారి (కడప), ఆదిమూలపు సురేష్ (యర్రగొండపాలెం), బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి), బూడి ముత్యాలనాయుడు (మాడుగుల), బుగ్గన రాజేంద్రనాథ్ (డోన్), చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ (రామచంద్రాపురం), దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) (తుని), ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం), గుడివాడ అమరనాథ్ (అనకాపల్లి), గుమ్మనూరి జయరామ్ (ఆలూరు), జోగి రమేష్ (పెడన), కాకాని గోవర్ధన్‌రెడ్డి (సర్వేపల్లి), కారుమూరి వెంకట నాగేశ్వరరావు (తణుకు), కొట్టు సత్యన్నారాయణ (తాడేపల్లిగూడెం), కె. నారాయణస్వామి (గంగాధర నెల్లూరు), కేవీ ఉష శ్రీచరణ్ (కళ్యాణదుర్గం), మేరుగు నాగార్జున (వేమూరు), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు), పినిపే విశ్వరూప్ (అమలాపురం), పీడిక రాజన్నదొర (సాలూరు), ఆర్కే రోజా (నగరి), సీదిరి అప్పలరాజు (పలాస), తానేటి వనిత (కొవ్వూరు), విడదల రజని (చిలకలూరిపేట)
అనే నేను..
మంత్రులుగా పేర్ల అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారం చేసిన అంబటి రాంబాబు, అంజాద్ బాషా షేక్ బేపారి, ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, బుగ్గన రాజేంద్రనాథ్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా),
ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్‌నాథ్, గుమ్మనూరి జయరామ్, జోగి రమేష్, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, కె.నారాయణస్వామి, మేరుగ నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపే విశ్వరూప్, పీడిక రాజన్నదొర, సీదిరి అప్పలరాజు
Comments
Please login to add a commentAdd a comment