
సాక్షి, అమరావతి: సచివాలయం పక్కన ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పలు ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి.
► ఉదయం 11.31 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండగా తొలిసారి మంత్రి పదవి దక్కిన పీడిక రాజన్న దొర రెండు గంటలు ముందుగానే వేదిక వద్దకు చేరుకున్నారు. అప్పటికి ఇంకా సహచర ఎమ్మెల్యేలు ఎవరూ రాకపోవడంతో
అధికారులు, విలేకరులతో కాసేపు ముచ్చటించారు.
► తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సంతకం చేయకుండా రావటాన్ని గమనించిన ముఖ్యమంత్రి జగన్ సైగ చేయడంతో సంతకం చేసి సీఎం, గవర్నర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
► బొత్స సత్యనారాయణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనవద్ద ఉన్న పెన్నుతో సంతకం చేస్తుండగా ప్రొటోకాల్ అధికారులు తమ పెన్నుతో సంతకం చేయాలని కోరారు.
► మొత్తం 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా 9మంది మంత్రులు సీఎంకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. వీరిలో బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, కె.నారాయణస్వామి, కేవీ ఉషశ్రీ చరణ్, ఆర్‌కే రోజా, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, విడదల రజని ఉన్నారు.
► ఆరేకే రోజా ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం కాళ్లకు నమస్కరించడమే కాకుండా చేతిపై ముద్దు పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు.
► దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజన్న దొర, రోజా, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, విడదల రజని ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో కార్యకర్తలు ఈలలతో హుషారెత్తించారు.
► ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో పలువురిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భుజం తట్టి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment