ఏపీలో రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం | Andhra Pradesh: Schools To Reopen From August 16th | Sakshi
Sakshi News home page

ఏపీలో రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం

Published Sun, Aug 15 2021 4:29 PM | Last Updated on Mon, Sep 20 2021 1:03 PM

Andhra Pradesh: Schools To Reopen From August 16th - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రేపటి (సోమవారం) నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. తరగతుల నిర్వహణపై విద్యాశాఖ పలు సూచనలు, మార్గదర్శకాలను విడుదల చేసింది. తరగతి గదికి 20 మంది విద్యార్ధులు మించకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. స్థానిక పరిస్థితుల ఆధారంగా ప్రతి స్కూల్‌కి ఎస్‌వోపీ ఉండాలని తెలిపింది. విద్యార్ధుల సంఖ్య ఆధారంగా రోజు విడిచి రోజు తరగతులను నిర్వహించాలని పేర్కొం‍ది. నాడు- నేడు కార్యక్రమంతో ఏపీలో ప్రభుత్వ పాఠశాలల దశ, దిశ సమూలంగా మారిపోయిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సర్వాంగ సుందరంగా రుపుదిద్దుకున్న పాఠశాలలు సోమవారం విద్యార్థులకు స్వాగతం పలకనున్నాయి. 

కాగా, రేపు (సోమవారం) సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘జగనన్న విద్యాకానుక’ను తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు విద్యా కానుక అందించనున్నారు. మొత్తం 47.32 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుక అందిస్తారు. జగనన్న విద్యాకానుక కిట్టులో బై లింగువల్ పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు, వర్క్ బుక్కులు, 3 జతల యూనిఫామ్ క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూల్ బాగ్ ఇవ్వనున్నారు. ఈసారి అదనంగా ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్-తెలుగు డిక్షనరీ అందించనున్నారు. గత ఏడాది విద్యాకానుక కింద 42.34 లక్షల మంది విద్యార్థులకు కిట్స్ అందించారు. విద్యారంగంలో సమూల మార్పుల కోసం అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, విద్యాకానుక, మనబడి నాడు నేడు కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement