సాక్షి, న్యూఢిల్లీ, అమరావతి: వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రజా మౌలిక వసతుల కల్పన, సౌకర్యాల విషయంలో మెరుగైన పనితీరు కనపరిచింది. సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్ షా శనివారం విడుదల చేసిన సుపరిపాలన సూచిక–2021 (గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్–జీజీఐ) ఈ విషయాన్ని స్పష్టం చేసింది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో రాష్ట్ర వార్షిక వృద్ధి రేటు జీజీఐ 2019లో 6.3 శాతం ఉండగా, 2020–21లో 11.3 శాతానికి పెరిగింది.
ఉద్యానవన పంటల రంగంలో రాష్ట్రం గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. రాష్ట్ర ఉద్యానవన పంటల ఉత్పత్తి వార్షిక వృద్ధి రేటు 4.7 శాతం నుంచి 12.3 శాతానికి చేరింది. పాల ఉత్పత్తిలో వృద్ధి రేటు 1.4 శాతం నుంచి 11.7 శాతానికి పెరిగింది. మాంసం ఉత్పత్తికి సంబంధించిన వృద్ధి రేటులో గణనీయమైన మార్పు నమోదైంది. 2019 ఇండెక్స్‌లో 6.7 శాతంగా ఉన్న వృద్ధిరేటు.. 2021 ఇండెక్స్‌లో 10.3 శాతానికి పెరిగినట్లు నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రంలో పంటల బీమా 20.2 శాతం నుంచి 26.1 శాతానికి చేరుకుందని వెల్లడించింది.
పెరిగిన వైద్యుల సంఖ్య
ప్రభుత్వ రంగ హాస్పిటల్స్‌లో అందుబాటులో ఉండే వైద్యుల సంఖ్య బాగా పెరిగినట్లు జీజీఐ నివేదిక స్పష్టం చేసింది. 2019లో 90.21 శాతంగా ఉన్న డాక్టర్ల సంఖ్య ఇప్పుడు 96.61 శాతానికి చేరింది. ప్రజల్లో రోగనిరోధక శక్తిలో కూడా గణనీయమైన వృద్ధి నమోదైందని స్పష్టం చేసింది. 2019లో ఉన్న 89.96 శాతం నుంచి 97.83 శాతానికి చేరింది. మాతృ, శిశు మరణాల సంఖ్య బాగా తగ్గడం రాష్ట్రంలో ప్రజా వైద్య సదుపాయాలు మెరుగైన విషయాన్ని స్పష్టం చేస్తోంది. మాతృ మరణాల సంఖ్య 74 నుంచి 65కి తగ్గితే, శిశుమరణాలు 32 నుంచి 29కి తగ్గాయి.
సొంత ఆదాయంలో పెరుగుదల
2019తో పోలిస్తే 2020–21లో రాష్ట్ర సొంత ఆదాయం పెరగడమే కాకుండా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల వాటా తగ్గిన విషయాన్ని నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్ర సొంత ఆదాయం 45.76 శాతం నుంచి 51.17 శాతానికి పెరిగినట్లు పేర్కొంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల వాటా 46.56 శాతం నుంచి 42.56 శాతానికి చేరింది. అందరికీ ఇళ్లు విషయంలో కూడా రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించింది. 2019లో 17.6 శాతంగా ఉన్న అందరికీ ఇళ్లు సంఖ్య 2021 నాటికి 24.10 శాతానికి చేరింది. 2019లో 42.5 శాతంగా ఉన్న మహిళా ఆర్థిక స్వావలంబన రేటు 2020–21 నాటికి 58.2 శాతానికి పెరిగింది.
2019లో ప్రతి వెయ్యి మంది బాలురులకు 946గా ఉన్న బాలికల సంఖ్య ఇప్పుడు 955కు పెరిగింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలపై నమోదైన కేసులు తగ్గాయి. 2019లో 26.96గా ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసుల సంఖ్య 2021 నాటికి 12.62 శాతానికి తగ్గాయి. ఇదిలా ఉండగా పది రంగాల్లో జరిగిన అభివృద్ధికి సంబంధించి 58 సూచికల ఆధారంగా ఈ నివేదిక సిద్ధం అయ్యింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హరియాణా, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పోర్టల్ స్కోర్‌లో 100 శాతం విజయాన్ని నమోదు చేస్తున్నాయి. 20 రాష్ట్రాలు తమ కాంపోజిట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ స్కోర్‌లను మెరుగు పరుచుకున్నాయి.
Andhra Pradesh: వ్యవసాయ వృద్ధి రేటులో ఏపీ టాప్
Published Sun, Dec 26 2021 5:32 AM | Last Updated on Sun, Dec 26 2021 1:56 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment