![Andhra Pradesh: What Happens After False Negative In Corona Test - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/14/covid-test.gif.webp?itok=pdySGumM)
సాక్షి, కాకినాడ: అందరినీ బెంబేలెత్తిస్తున్న కరోనా వైరస్ ఒక్కొక్కరిలో ఒక్కో తీరుగా ఉంటోంది. లక్షణాలున్నవారు, ఆరోగ్య పరిస్థితి దిగజారినవారు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకుంటే కొంతమందికి నెగిటివ్‌గా.. ఎటువంటి లక్షణాలు లేనివారికి పాజిటివ్‌గా ఫలితం వస్తోంది. ఇలాంటివి అరుదుగా ఎదురవుతున్నప్పటికీ ప్రమాదకరంగానే పరిగణించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా పరీక్షల ఆధారంగా వైద్యం అందించాల్సిన కీలక సమయాల్లో ఇదొక సమస్యగా పరిణమిస్తోందని అంటున్నారు.
కాకినాడ జీజీహెచ్ మైక్రోబయాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డీఎస్ మూర్తి. భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆయనను తూర్పుగోదావరి జిల్లాలో వీఆర్‌డీ ల్యాబ్‌కు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై డాక్టర్ మూర్తి తన అభిప్రాయాలను పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..
ఫాల్స్ నెగిటివ్ అంటే..
కరోనా లక్షణాలున్నప్పటికీ పరీక్షలో రిపోర్ట్ నెగిటివ్‌గా వస్తే దాన్ని వైద్య పరిభాషలో ఫాల్స్ నెగిటివ్ అంటారు. పరీక్షలు చేసేవారికి సరైన శిక్షణ లేకపోవడం, సరైన స్వాబ్‌ను వాడకపోవడం, శాంపిల్ పరిమాణం తక్కువగా సేకరించడం, సేకరించాక సరిగా భద్రపర్చకపోవడం, శాంపిళ్లను సరైన రీతిలో పరీక్ష కేంద్రాలకు తరలించకపోవడం ఫాల్స్ నెగిటివ్‌కు కారణాలవుతున్నాయి. ఫాల్స్ పాజిటివ్ కంటే ఫాల్స్ నెగిటివ్ ప్రమాదకరం. ఫాల్స్ నెగిటివ్ రిపోర్ట్ వల్ల బాధితుడు వైద్యానికి దూరమవుతాడు. తద్వారా తన ఆరోగ్యాన్ని ప్రమాదకరస్థితిలోకి నెట్టుకోవడమే కాకుండా వైరస్ వ్యాప్తికి కూడా కారకుడవుతాడు.
ఫాల్స్ పాజిటివ్ అంటే..
శాంపిల్స్ తారుమారైనా, వైరస్ తగ్గి 90 రోజులు గడవక ముందు మళ్లీ టెస్ట్ చేయించుకున్నా ఫాల్స్ పాజిటివ్ రావచ్చు. దీనివల్ల బాధితుడి మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. వ్యాధి లేకున్నా మందులు వేసుకోవాల్సిన దుస్థితి ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితి వైరస్ నుంచి కోలుకున్న వారిలో అధికంగా కనిపిస్తోంది. వైరస్ మృతకణాలు సైతం పరీక్షల్లో కనిపించడం వల్ల పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. అందుకే ప్రభుత్వం రీ టెస్ట్‌ను సిఫార్సు చేయడం లేదు.
మ్యుటేషన్ల వల్ల ఫలితాల్లో తేడా
పరీక్షకు సేకరించిన నమూనాల్లో మ్యుటేషన్లు (వైరస్ పరివర్తన) చోటు చేసుకుంటే ఫలితాల్లో తేడాలు కనిపిస్తాయి. పరీక్షకు ముందు ఆహారం తీసుకున్నా.. ద్రవాలు తాగినా పరీక్ష ఫలితాల ఖచ్చితత్వం ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. ఘన, ద్రవ ఆహారాలు శరీరంలో వివిధ క్రియలపై చూపే ప్రభావమే దీనికి కారణం.
నిర్లక్ష్యం వద్దు..
అరుదైన సందర్భాల్లోనే ఫాల్స్ పాజిటివ్, నెగిటివ్‌లకు అవకాశం ఉంది. అయితే వీటిపై ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దు. ఆర్‌టీపీసీఆర్ పరీక్షలో నెగిటివ్ వచ్చి లక్షణాలు కొనసాగుతుంటే మాత్రం నాలుగు నుంచి ఆరు రోజుల వ్యవధిలో తిరిగి మరోమారు ఆర్‌టీపీసీఆర్ పరీక్షే చేయించుకోవాలి. అప్పటికీ నెగిటివ్ వచ్చి లక్షణాలు కొనసాగుతుంటే తప్పకుండా సీటీ స్కాన్ చేయించుకోవాలి. హై రిజల్యూషన్ సీటీ స్కాన్ టెస్ట్ (హెచ్‌ఆర్‌సీటీ) రేడియేషన్ కారణంగా అందరికీ సురక్షితం కాదు. గర్భిణులు సీటీ స్కాన్ చేయించుకోవాల్సి వస్తే ఉదరంపై అబ్డామిన్ షీట్ ఉంచుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment