గన్నవరం విమానాశ్రయంలో సుధేశ్‌కు స్వాగతం పలుకుతున్న తహసీల్దార్ తదితరులు
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి/గన్నవరం: రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో 25 మంది విద్యార్థులు సోమవారం ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. వీరిలో ఏపీకి చెందిన వారు 11మంది కాగా.. తెలంగాణకు చెందిన వారు 14 మంది ఉన్నారు. వీరికి ఏపీ, తెలంగాణ భవన్ ఉద్యోగులు వసతి, భోజన సదుపాయాలు కల్పించారు. స్వస్థలాలు చేరుకునేందుకు ఏర్పాట్లుచేశారు. రాత్రి ఏడుగంటల ప్రాంతంలో ఒంగోలుకు చెందిన నట్ల సుధేశ్ మోహన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.
తహసీల్దార్ నరసింహారావు తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుధేశ్ మాట్లాడుతూ.. యుద్ధం కారణంగా అక్కడే అన్నీ వదిలేసి రావల్సి వచ్చిందని, పరిస్థితులు చక్కబడ్డాక కోర్సుకు సంబంధించి యూనివర్సిటీ నిర్ణయం తీసుకునే వరకూ ఎదురుచూడాల్సిందేనన్నారు. తనను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుధేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీ విద్యార్థుల కోసం కేంద్రం హెల్ప్‌లైన్
ఇక ఉక్రెయిన్‌లో ఇప్పటికీ ఉండిపోయిన విద్యార్థుల వివరాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటుచేసిందని, ఏపీకి చెందిన ఆ విద్యార్థులు, ఇతర పౌరుల వివరాలు తెలియజేయాలని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జయశంకర్ సీఎం జగన్‌కు సోమవారం లేఖ రాశారు. ఉక్రెయిన్‌కు చుట్టూ ఉన్న దేశాల్లో కూడా సహాయ కేంద్రాలు ఏర్పాటుచేశామని, విద్యార్థులు ఆ దేశంలోని భారత ఎంబసీలను కూడా ఈ–మెయిల్ లేదా ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రం వద్ద నిర్ధిష్ట సమాచారం ఉంటే తన కార్యాలయంలో నేరుగా సంప్రదించవచ్చని ముఖ్యమంత్రిని కోరారు. తెలుగు విద్యార్థులు, పౌరుల పట్ల ఆందోళన చెందవద్దని, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. హెల్ప్‌లైన్ నంబర్లలో సంప్రదిస్తే వెంటనే తమ బృందాలు సహాయం చేస్తాయని జయశంకర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment