అనకాపల్లిలో కనకమహాలక్ష్మి ఆలయ భూముల దురాక్రమణకు మళ్లీ యత్నం
జేసీబీతో చదునుకు యత్నించిన జనసేన ఎమ్మెల్యే కొణతాల కుటుంబీకులు
అడ్డుకున్న ఆలయ సిబ్బంది, సీపీఎం, సీఐటీయూ నేతలు
కోర్టులో ఉన్న భూముల్లోకి ప్రవేశించడంపై అభ్యంతరం
గతంలో దేవస్థానం బోర్డుల్ని పీకేసి కబ్జాకు యత్నం
అప్పటి దేవస్థానం ఈఓ శిరీష పోలీసులకు ఫిర్యాదు..
ఆరుగురిపై కేసు నమోదు
మళ్లీ దురాక్రమణకు బరితెగింపు
సాక్షి, అనకాపల్లి: దాదాపు రెండు నెలలుగా రాష్ట్రంలో చెలరేగిపోతున్న టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి నేతల బరితెగింపునకు ఈ ఘటన మరో ఉదాహరణ. ఎంతో ఉన్నతాశయంతో ఆరేడు దశాబ్దాల క్రితం దేవదాయ శాఖకు రాసిచ్చిన భూములపై కూటమి గద్దలు ఎప్పట్నుంచో కన్నేశాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చీరాగానే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడీ కబ్జా బాగోతాన్ని నడిపిస్తోంది అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కుటుంబీకులు. ఈ భూదాహం కథాకమామిషు ఏమిటంటే..
అనకాపల్లి పట్టణంలోని సర్వే నెంబరు 66లో 29.71 ఎకరాల భూమి (పూల్‌బాగ్ భూములు)ని చెముడు ఎస్టేట్ మహారాణి వైరిచర్ల చంద్రముఖి పట్టా మహాదేవి దేవదాయ శాఖకు 1957 జూలై 20న రిజిస్ట్రేషన్ చేసి మరీ అప్పగించారు. తన తదనంతరం దేవదాయ శాఖకు భూమిని అప్పగించాలని.. అప్పటివరకు ట్రస్టీలుగా తన పెద్ద అల్లుడు రాజూభీర్ ఉదిత్ ప్రతాప్ శంకర్ డియో, డాక్టర్ పేర్రాజు, న్యాయవాది రామచంద్రరావులను నియమించారు.
ఆమె మరణానంతరం భూములను తమకు అప్పగించాలని ట్రస్టీని దేవదాయ శాఖాధికారులు 1963లో కోరారు. దీనిపై ట్రస్టీ కోర్టును ఆశ్రయించింది. 1996లో దేవదాయ శాఖకే అనుకూలంగా కోర్టు తీర్పువచ్చింది. ఆ తర్వాత చోటుచేసుకున్న వివిధ పరిణామాల తర్వాత దేవదాయ శాఖాధికారులు భూములను స్వాధీనం చేసుకుని భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటుచేశారు. వాటి రక్షణకు సెక్యూరిటీని కూడా నియమించారు.
దేవస్థానం బోర్డులు పీకేసి..
నిజానికి.. జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కుటుంబ సభ్యులు అనకాపల్లిలోని కనకమహాలక్ష్మి అమ్మవారి దత్తత దేవాలయం అంబికాబాగ్ రామాలయానికి చెందిన ఈ భూములను హస్తగతం చేసుకోవడానికి ఎప్పటినుంచో కన్నేశారు. అందులో భాగంగా.. కోర్టు ఇంటెరిం ఆర్డర్ పేరిట 29.71 ఎకరాల ఈ భూమిని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి అక్కడున్న దేవస్థానం బోర్డుల్ని 2022 నవంబర్ 27నే పీకేశారు.
వాటి స్థానంలో ఆ భూములు తమవేనని, న్యాయస్థానం తీర్పు ఇచ్చిందంటూ కొణతాల రామకృష్ణ సోదరుడి మావయ్య అయిన బీవీఏఎస్ నాయుడు పేరిట బోర్డులు వెలిశాయి. దీంతో వీరిపై అనకాపల్లి టౌన్ పోలీస్‌స్టేషన్‌లో అప్పటి దేవదాయ శాఖ ఏసీపీ శిరీష ఫిర్యాదు చేయగా బోర్డులు పీకేసిన ఆరుగురిపై సీఐ దాడి మోహన్ కేసు నమోదుచేశారు.
ఈ నేపథ్యంలో.. శనివారం ఆ భూమిని మళ్లీ ఆక్రమించేందుకు కొణతాల రామకృష్ణ సోదరుడు రఘుబాబు భార్య రజనీ, ఆయన బావమరిది బొడ్డేటి శ్రీనివాసరావు అనుచరులు సిద్ధమయ్యారు. జేసీబీతో ఆ భూములను చదును చేసేందుకు యత్నించారు. కనకమహాలక్ష్మి దేవస్థానం ఏఈవో రాంబాబు, దేవదాయ ఏఈ కె.సూర్యనారాయణమూర్తి, సిబ్బంది, సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, సీఐటీయూ నాయకులు శ్రీరామ్, శ్రీనివాస్ అడ్డుకున్నారు. దీంతో వారు వెనుదిరిగారు. పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహించారు.
కోర్టులో కేసు నడుస్తుండగానే మళ్లీ కోర్టుకు
ఈ వ్యవహారం కోర్టులో నడుస్తుండగానే.. ఆ భూమిలో కొణతాల రామకృష్ణ, ఆయన సోదరులు రైతులతో సాగు చేయించడం ప్రారంభించారు. తద్వారా మొత్తం 30 మంది రైతుల నుంచి రూ.10వేల చొప్పున కౌలు వసూలుచేస్తున్నారు. అంతేకాక.. ఇవి తమ భూములేనంటూ వివిధ ఆక్రమణదారుల పేరుతో మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో.. హఠాత్తుగా శనివారం మరోసారి దేవదాయ శాఖ బోర్డుల్ని తొలగించి వాటి స్థానంలో బీవీఏఎస్ నాయుడు పేరిట బోర్డులు పెట్టారు. దీంతో ఆలయ బోర్డు చైర్మన్‌తో పాటు బోర్డు సభ్యులు నాయుడు పేరిట ఉన్న బోర్డులు తొలగించారు.
నాయుడుతో పాటు మరికొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.దేవదాయశాఖ భూములను కాపాడతాంగతంలో కోర్టు నాలుగు వారాలపాటు స్టే ఇస్తే.. దేవస్థానం బోర్డులు పీకేసీ బీవీఏఎస్ నాయుడు పేరిట బోర్డులు ఏర్పాటుచేశారు. అప్పుడు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆరుగురిపై కేసులు నమోదుచేశారు. మళ్లీ శనివారం ఉదయం జేసీబీలతో ఆక్రమించుకునే ప్రయత్నం చేయగా అడ్డుకున్నాం. దేవదాయశాఖ భూములను కాపాడడమే మా లక్ష్యం. – రాంబాబు, కనకమహాలక్ష్మి ఆలయ ఏఈఓ, అనకాపల్లి
Comments
Please login to add a commentAdd a comment