Breadcrumb
మూడేళ్లలో 95 శాతం హామీలు నెరవేర్చాం: సీఎం జగన్
Published Fri, Mar 25 2022 8:55 AM | Last Updated on Fri, Mar 25 2022 3:25 PM
Live Updates
శాసనసభ నిరవధిక వాయిదా
అసెంబ్లీ నిరవధిక వాయిదా
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2022-23ని రాష్ట్ర అసెంబ్లీ శుక్రవారం ఆమోదించింది. జనరంజకమైన బడ్జెట్‌ను తీసుకొచ్చిందుకు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. పలు రకాలైన ప్రజా సమస్యలను సభ్యులు లేవనెత్తగా... ప్రభుత్వం కూడా ఎంతో బాధ్యతగా సమాధానం చెప్పిందన్నారు.
ప్రజల కోసం పాటుపడుతున్న ప్రభుత్వం అనేక రకాలైన చట్టాలను తీసుకొచ్చిందని కొనియాడారు. అద్భుతమైన చట్టాలను ఆమోదించిండంలో భాగస్వామ్యులైనందుకు సంతోషంగా ఉందన్నారు. అనంతరం సభను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. శాసనమండలి కూడా నిరవధిక వాయిదా పడింది.
టీడీపీ పెగాసెస్ వ్యవహారంపై హౌస్ కమిటీ
టీడీపీ పెగాసెస్ వ్యవహారంపై స్పీకర్ తమ్మినేని సీతారం హౌస్ కమిటీ వేశారు. ఈ కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని నియమించారు. సభ్యులుగా భాగ్యలక్ష్మి, అబ్బయ్య చౌదరి, కొలుసు పార్థసారధి, అమర్నాథ్, మేరుగు నాగార్జున, మద్దాల గిరిధర్‌ను నియమించారు.
2022-23 సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను విడుదల చేసిన సీఎం జగన్
అసెంబ్లీలో ప్రజలకు అందే పథకాలపై సీఎం జగన్ క్యాలెండర్ విడుదల చేశారు. ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు సంక్షేమ క్యాలెండర్‌ను ప్రకటించారు.
► ఏప్రిల్‌లో వసతి దీవెన, వడ్డీలేని రుణాలు
► మేలో విద్యా దీవెన, అగ్రి కల్చర్ ఇన్సూరెన్స్, రైతు భరోసా, మత్య్సకార భరోసా
► జూన్‌లో అమ్మ ఒడి పథకం
► జూలైలో విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, జగనన్న తోడు.
► ఆగష్టులో విద్యా దీవెన, ఎంఎస్ఎంఈలకు ఇన్సెన్టివ్, నేతన్న నేస్తం.
► సెప్టెంబర్‌లో వైఎస్సార్ చేయూత
► అక్టోబర్‌లో వసతి దీవెన, రైతు భరోసా
► నవంబర్‌లో విద్యా దీవెన, రైతులకు వడ్డీలేని రుణాలు
► డిసెంబర్లో ఈబీసీ నేస్తం, లా నేస్తం పథకాలు
►జనవరిలో రైతు భరోసా, వైఎస్సార్ ఆసరా, జగనన్న తోడు పథకాలు
► ఫిబ్రవరిలో విద్యా దీవెన, జగనన్న చేదోడు పథకాలు
► మార్చిలో వసతి దీవెన అమలు
మూడేళ్లలో 95 శాతం హామీలు నెరవేర్చాం: సీఎం జగన్
ఈ ఏడాది(2022-23) రూ. 2.56 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి కోసం బడ్జెట్లో నిధులు కేటాయించామని వెల్లడించారు. ఈ మేరకు అసెంబ్లీలో బడ్జెట్ చర్చలో సీఎం సమాధానం చెబుతున్నారు. మూడేళ్లలో 95 శాతం హామీలు నెరవేర్చామని తెలిపారు. కరోనా వచ్చి ఆదాయం తగ్గినా తమ దీక్ష మారలేదని అన్నారు.
‘గతంలో టీడీపీకి ఓటు వేసిన వారు ఇప్పుడు మా వెంట ఉన్నారు. అందుకే ప్రతిపక్షం ఉనికి కోసం డ్రామాలు ఆడుతోంది. జరుగుతున్న మంచిన ప్రజలు గమనిస్తున్నారు. అందుకే ప్రతీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని అక్కున చేర్చుకున్నారు. చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్క మంచి పని చేయలేదు. అందరూ నా వాళ్లే అని ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మూడేళ్లుగా ప్రభుత్వ ఆచరణే మాట్లాడుతోంది.’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
జగనన్న సుపరిపాలన.. సూపర్ పాలన: ఆర్కే రోజా
జగనన్న మూడేళ్ల పాలనలో వేసిన ప్రతి అడుగుకు ఫలితం దక్కింది. అవినీతి లేకుండా ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు నేరుగా అందించాం. జగన్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం ఒక నూతన పంథా. గ్రామసచివాలయ వ్యవస్థ, వాలంటీర్లతో ప్రతి గడపకు పథకాలు అందించాం. జగనన్న సుపరిపాలన.. సూపర్ పాలన. బెస్ట్ సీఎంగా జగన్ అందరి మన్ననలు పొందారు. ప్రజలకిచ్చిన వాగ్దాలను సీఎం జగన్ అమలు పరిచారు. ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్‌దే అని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు.
ప్రజలను సీఎం తన సొంత బిడ్డల్లా చూసుకున్నారు: ఆర్కే రోజా
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ.. రాజన్నరాజ్యం జగనన్నతోనే సాధ్యమని ప్రజలు పట్టం కట్టారు. పేదరిక నిర్మూలనలో ఏపీ ఐదో స్థానంలో ఉంది. మౌలిక సదుపాయాల కల్పనలో ఏపీ ముందుందని నీతి ఆయోగ్ చెప్పింది. గుడ్ గవర్నెన్స్ ర్యాంకుల్లో కూడా ఏపీ అగ్రగామిగా నిలిచింది. కోవిడ్ పరిస్థితులను ఎదుర్కోవడంలో ఏపీ మూడోస్థానంలో నిలిచింది. కరోనా కష్టకాలంలో ప్రజలను సీఎం తన సొంత బిడ్డల్లా చూసుకున్నారు. గ్రామీణాభివృద్ధి, భద్రతా చర్యల్లో ఏపీ నంబర్ వన్‌గా నిలిచింది అని ఆర్కే రోజా అన్నారు.
ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ప్రారంభం
ఏపీ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ప్రారంభమైంది. నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చను ప్రారంభించారు.
వారిని చూసి ఆడ పిల్లలు బెంబేలెత్తుతున్నారు: మేరుగ నాగార్జున
అసెంబ్లీ ప్రాంగణంలో టిడిపి సభ్యుల ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని ఎమ్మెల్యే మేరుగు నాగార్జున అన్నారు. 'ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలసింది పోయి తాళి బొట్లు చూపడం చేస్తున్నారు. చంద్రబాబు సభ నుండి సిగ్గుతో పారిపోయాడు. లోకేష్ అచ్చోసిన ఆంబోతులా తాళి బొట్లతో తిరుగుతున్నారు. వాళ్లను చూసి ఆడ పిల్లలు బెంబేలెత్తుతున్నారు. నారా వల్ల వచ్చినా సారాతో మరణాలు జరిగితే టీడీపీ సభ్యులు సభలో ఆందోళన చేస్తున్నారు. సభలో వికృత చేష్టలు చేయడం ఇప్పటికైనా మానుకుని ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలి అని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు.
టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన మండలి ఛైర్మన్
సమావేశాల చివరి రోజు కూడా మండలిలో టీడీపీ సభ్యుల తీరుమారలేదు. సభా కార్యకలాపాలు సాగకుండా అడ్డుకోవడంతో మండలి ఛైర్మన్ మోషేన్ రాజు వారిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో అర్జునుడు, రాజనర్సింహులు, అశోక్‌బాబు, దీపక్‌రెడ్డి, ప్రభాకర్, రామ్మోహన్, రామారావు, రవీంద్రనాథ్ ఉన్నారు.
మహిళల ఆత్మాభిమానాన్ని కించపరిచిన టీడీపీ సభ్యులు
శాసనమండలిలో టీడీపీ సభ్యులు మహిళలను ఆత్మాభిమానాన్ని కించపరిచే విధంగా వ్యవహరించారు. టీడీపీ ఎమ్మెల్సీలు సభలోకి తాళిబొట్లు తీసుకుని వచ్చి ప్రదర్శన చేశారు. దీంతో మా ఆత్మాభిమానాన్ని అవమాన పరిచారంటూ వైఎస్సార్సీపీ మహిళా సభ్యులు పోతుల సునీత, వరుదు కళ్యాణి, కల్పలతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యడు దీపక్ రెడ్డి చేతిలో నుంచి పోతుల సునీత తాళిబొట్లు లాక్కున్నారు. ఆ సమయంలో సభలో గందరగోళం నెలకొంది. దీంతో మండలి ఛైర్మన్ మోషేన్‌రాజు సభని కొద్దిసేపు వాయిదా వేసి, మళ్లీ ప్రారంభించారు.
రామచంద్రయ్య రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
అసెంబ్లీ: మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య రచించిన సెలెక్టెడ్ స్పీచెస్ ఫ్రమ్ రాజ్యసభ పుస్తకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నపుడు మాట్లాడిన స్పీచ్‌లను రామచంద్రయ్య సంకలనంగా తెచ్చారు.
ఇదొక మహాయజ్ఞం.. ఎవరూ ఆపలేరు
దేశ చరిత్రలో 32 లక్షల పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దేనని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు. ఇదొక మహాయజ్ఞమని.. దీన్ని ఎవరూ ఆపలేరన్నారన్నారు. కావాలనే కొంతమంది కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారంటూ వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు.
మారని తీరు.. టీడీపీ సభ్యుల గొడవ
అసెంబ్లీ సమావేశాల చివరి రోజూ టీడీపీ సభ్యుల తీరు మారలేదు. సభా కార్యకలాపాలకు అడుగడుగునా అడ్డుతగులుతున్నారు. ప్రశ్నోత్తరాలు మొదలైన కాసేపటికే స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యులు గొడవకు దిగారు. పోడియాన్ని చరుస్తూ శబ్దాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.
లైవ్ వీడియో
కొనసాగుతోన్న ప్రశ్నోత్తరాలు
చివరి రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
సాక్షి, అమరావతి: 13వ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత ప్రశ్నోత్తరాలు.. అనంతరం అసెంబ్లీ పలుబిల్లులు, బడ్జెట్‌ను ఆమోదించనుంది. సమావేశాలు నేటితో ముగియనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment