సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉభయసభల సమావేశాలను నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ మేరకు శుక్రవారం శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు వేర్వేరుగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ నెల 18న ప్రారంభమైన శాసనసభ, మండలి సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. మధ్యలో రెండు రోజులు మినహాయించి ఏడు రోజులపాటు జరిగిన సమావేశాల్లో అనేక అంశాలను చర్చించారు. రెండు సభల్లో ఆన్‌లైన్ టిక్కెట్ల నిర్వహణ కోసం సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు, రాజధాని వికేంద్రీకరణ రద్దు బిల్లు వంటి మొత్తం 26 బిల్లులను ఆమోదించారు.
34.50 గంటలపాటు శాసనసభ సమావేశాలు
శాసనసభ సమావేశాలు ఏడు రోజుల్లో మొత్తం 34.50 గంటలపాటు జరిగినట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడించారు. చర్చల్లో 96 మంది ప్రసంగించారన్నారు. 41 స్టార్ ప్రశ్నలకు సమాధానం చెప్పారని.. మరో 21 ప్రశ్నలకు సమాధానాలు సభ ముందుంచారని తెలిపారు. ఐదు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగిందన్నారు. కాగా, రాష్ట్ర ద్రవ్య జవాబుదారీ– బడ్జెట్ నిర్వహణ చట్ట సవరణ బిల్లును శాసనసభ శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
26 గంటలపాటు శాసనమండలి సమావేశాలు
కాగా, వారం రోజుల్లో మొత్తం 26 గంటలపాటు శాసనమండలి సమావేశాలు జరిగాయి. సభ్యులు స్టార్ ప్రశ్నలు 40, స్టార్ ప్రశ్నలు (ఆన్ టేబుల్) 12, అన్‌స్టార్ ప్రశ్నలు 6 అడిగారు. ఐదు ప్రధాన అంశాలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సభ్యులు పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఒక తీర్మానం చేశారు. మండలి సమావేశాల తొలిరోజునే సభ ప్రారంభమైన కొద్దిసేపటికే టీడీపీ వాకౌట్ చేసింది.
రెండో రోజు కూడా సభ ప్రారంభమైన కొద్దిసేపటికే బాయ్‌కాట్ చేసింది. అప్పటి నుంచి టీడీపీ సభ్యులు సమావేశాలకు హాజరు కాలేదు. అసెంబ్లీలో చంద్రబాబు తాను సీఎం అయ్యాకే సభకు వస్తానని ప్రకటించి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని సాకుగా చూపి మండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు కూడా సమావేశాలను బహిష్కరించారు. దీన్ని పలువురు అధికార పార్టీ సభ్యులు తప్పుబట్టారు.
బిల్లులకు ఉభయ సభల ఆమోదం
పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను ఉపసంహరిస్తూ తీసుకొచ్చిన బిల్లులు శాసనసభ, శాసన మండలి ఆమోదం పొందాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఇందుకు సంబంధించి శాసనసభ కార్యదర్శి నుంచి అందిన సమాచారం, చట్టాల రద్దుకు గల కారణాలను, బిల్లుల కాపీలను ఈ అఫిడవిట్‌తో జతచేశామని కోర్టుకు తెలిపింది. వాటిని పరిశీలించి ఈ వ్యవహారంలో తగిన ఉత్తర్వులు జారీచేయాలని కోర్టును కోరింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. గత వారం ఈ వ్యాజ్యాలపై విచారణ జరుగుతున్న సమయంలో పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను ఉపసంహరిస్తూ బిల్లులు ప్రవేశపెట్టినట్లు అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ధర్మాసనం ఈ బిల్లుల కాపీలను, చట్టాల ఉపసంహరణ కారణాలు తదితరాలను మెమో రూపంలో తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాల మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి.. ధర్మాసనం ఆదేశించిన వివరాలతో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై త్రిసభ్య ధర్మాసనం ఈ నెల 29న విచారణ జరపనుంది.
Comments
Please login to add a commentAdd a comment