సాక్షి, అమరావతి: బీసీలే వెన్నెముక అనే నినాదంతో ఈ నెల 7న విజయవాడలో జరుగనున్న జయహో బీసీ మహాసభకు ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. విజయవాడలోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో జయహో బీసీ మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.మారేష్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటుతున్నా దేశంలో బీసీ ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో సైతం బీసీలకు జరగని మేలు ఏపీలో సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని చెప్పారు. ఏపీలో బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా సీఎం వైఎస్ జగన్ అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని కొనియాడారు. బడుగు బలహీనవర్గాలంతా జగన్‌కు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వేముల బేబీ రాణి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోర్ల మహీధర్ తదితర బీసీ సంఘం నేతలు మాట్లాడారు.
మారుమోగుతున్న జయహో బీసీ నినాదం
గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్
సాక్షి, అమరావతి: దేశచరిత్రలో ఎవరూ చేయలేని సామాజిక విప్లవాన్ని, జ్యోతిరావు పూలే ఆశయాలను నిజంచేసి చూపించిన సీఎం వైఎస్ జగన్ వెంటే బీసీలంతా నడుస్తున్నారని గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశచరిత్రలో 82 వేలమంది బీసీలను ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దిన ఒకే ఒక్కడు సీఎం జగన్ అని తెలిపారు. జయహో బీసీ నినాదం రాష్ట్రమంతా మారు మోగుతోందని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment