సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంచి ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చెప్పారు. విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) నిర్వహించడం ద్వారా పెట్టుబడులను ఆకట్టుకోవడానికి కృషి చేశారన్నారు.
సోమవారం ఆయన విశాఖలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సమ్మిట్‌లో కుదుర్చుకున్న ఒప్పందాలు (ఎంవోయూలు) వాస్తవరూపం దాలిస్తే ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. తద్వారా రాష్ట్రంలో భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు వస్తాయని అభిప్రాయపడ్డారు.
జీఐఎస్ నిర్వహణ భేష్: విష్ణుకుమార్‌రాజు
విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను గొప్పగా నిర్వహించారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు విలేకరుల సమావేశంలో కొనియాడారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహించిన ఈ సదస్సులో రూ.13 లక్షల కోట్లకు పైగా విలువైన ఎంవోయూలు కుదుర్చుకోవడం, అంబానీ, కరణ్ అదానీ, జిందాల్ వంటి అతిరథులు పాల్గొనడం గొప్ప విషయమని చెప్పారు. రాష్ట్రానికి ఇంతమంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు వచ్చారంటే మారుతున్న పరిస్థితులకు అద్దం పడుతుందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే వేళ రాజకీయ విమర్శలు సరికాదని చెప్పారు. విశాఖలో రోడ్ల అభివృద్ధి, నగర సుందరీకరణ అభినందనీయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment