‘‘ఈరోజు ప్రతి బిడ్డకు జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు, ఆరోగ్య హక్కు, విద్య హక్కు, భద్రత హక్కు, గౌరవ హక్కు, సమానత్వం, శాంతి హక్కు ఉండాల్సిన సమయం ఇది’’ సామాజిక ఉద్యమకారుడు కైలాష్ సత్యార్థి చెప్పిన మాటలివి. ఈ స్ఫూర్తితోనే వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం కూడా చిన్నారుల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.
బడ్జెట్ ప్రసంగం సందర్భంగా బాలల సంక్షేమ పద్దును వివరిస్తూ నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి గురించి ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఓ ఆసక్తికరమైన కథ చెప్పారు. చిన్నతనంలో సత్యార్థికి ఎదురైన అనుభవం గురించి సందర్భోచితంగా ప్రసంగం మధ్యలో ప్రస్తావించారు ఆర్థిక మంత్రి బుగ్గన.
‘‘కైలాష్ సత్యార్థి వాస్తవానికి సంపన్న కుటుంబంలో పుట్టారు. చిన్నతనంలో ఆయనకు ఎదురైన ఓ సంఘటనే బాలల హక్కుల కోసం ఆయన పోరాడేలా చేసింది. ఓ రోజూ స్కూలుకు వెళుతూ బడి బయట ఓ చెప్పులు కుట్టే కుర్రాడిని చూశారు. తానెందుకు బడికి పోగలుగుతున్నాను.. ఆ కుర్రాడెందుకు చెప్పులు కుట్టుకుంటూ బతకున్నాడని ఆనాడు కైలాష్ సత్యార్థి ఆలోచించారు. దానిపై చాలా రోజుల మదన పడ్డారు. ఓ రోజు వర్షం పడుతుంటే.. చెప్పులు నానుతున్నాయంటూ ఆ చెప్పులు కుట్టే పిల్లాడిపై అతడి తండ్రి అరిచాడట. అది చూసి ఓ వైపు మనిషి తడవకుండా ఉండేందుకు గొడుగు పట్టుకుంటుంటే.. ఇక్కడ చెప్పులు తడవకూడదంటూ తండ్రి అరిచాడెందుకని కైలాష్ సత్యార్థి ఆవేదన చెందారు. ఆ పిల్లాడు బడికి ఎందుకు వెళ్లకూడదని అనుకున్నారు. అలాంటి పిల్లలకోసం ‘బచ్ పన్ బచావో’ అనే సంస్థను స్థాపించారు. ఆ సంస్థ ద్వారా దాదాపు 83 వేల మంది పిల్లలకు పని నుంచి విముక్తి కల్పించారు’’ అని కైలాష్ సత్యార్థి గురించి ఆయన చెప్పుకొచ్చారు.
ఇప్పుడు వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం కూడా కైలాష్ సత్యార్థిని స్ఫూర్తిగా తీసుకుని చిన్నారుల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. మహిళా శిశు సంక్షేమం రూ. 4,382 కోట్లు బడ్జెట్ కేటాయించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment