
గవర్నర్ ప్రసంగంతో మొదలయ్యే ఏపీ బడ్జెట్ 2023-24 అసెంబ్లీ సమావేశాలు..
సాక్షి, అమరావతి: శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసన మండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాక ఆయన పాల్గొంటున్న తొలి అధికారిక కార్యక్రమం ఇదే. నజీర్ ప్రసంగం తర్వాత రెండు సభలు వాయిదా పడనున్నాయి.
ఆ తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశం జరగనుంది. ఇందులో సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలి, రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీని నిర్ణయించనున్నారు. ఈ నెల 14 నుంచి 24 వరకు సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కనీసం 7, 8 రోజులు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కాగా మంగళవారం బీఏసీ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలోనే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులను కేబినెట్ ఆమోదించనుంది.
ఇక.. కీలకమైన 2023-24 వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 17వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టనున్నారు. ఇక ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24వ తేదీ వరకు జరిగే అవకాశాలున్నాయి.
ఈ ఏడాది రూ. 2లక్షల 60 వేల కోట్లకు పైగా బడ్జెట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. సంక్షేమంతో పాటు వ్యవసాయం, విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా బడ్జెట్ రూపకల్పన దిశగా ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. పైగా వచ్చే ఏడాదిలో ఎన్నికల నేపథ్యంలో ఇదే పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో దృష్టి సారించింది. మరోవైపు కీలక అంశాలపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది. నాలుగేళ్ల పాలనతో పాటు మూడు రాజధానులు, సంక్షేమం, వైజాగ్ గ్లోబల్ సమిట్ ముఖ్యమైన అంశాల ఎజెండాతో సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది.