
నేను గాల్లోనే వచ్చి, గాల్లోనే పోతా నని.. ఎక్కడో ఒక చోట శాశ్వతంగా కనుమరుగు అవుతానని, తనను వ్యతిరేకించిన వైఎస్సార్ కాల గర్భంలో కలిసిపోయారని ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడారు. ఆయన అక్కడికి ఎందుకు వెళ్లారు? ఆయన మాట్లాడిన మాటలు ఏమిటి? నిజంగా ఆయన సంస్కారానికి నా నమస్కారాలు. – సీఎం జగన్
సాక్షి, అమరావతి: ‘కష్టకాలంలో బాధితులకు సాయం త్వరగా అందడం చాలా ముఖ్యం. రాయలసీమలో ప్రత్యేకించి వైఎస్సార్ జిల్లాలో వరద ముంచెత్తిన తరుణంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాము. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ అక్కడ మామూలు పరిస్థితులు నెలకొనేలా అడుగులు ముందుకు వేశాం. ఈ సహాయ కార్యక్రమాలకు అడ్డు కాకూడదనే నేను ఆ ప్రాంతాల్లో పర్యటించలేదు. వైఎస్సార్ కడప నా సొంత జిల్లా.
సహాయక చర్యలు పూర్తయ్యాక, పరిస్థితి కుదుట పడ్డాక తప్పకుండా వరద ప్రభావిత ప్రాంతాలకు వెళతాను. అయితే చంద్రబాబు ఈ వాస్తవాలను వక్రీకరించి, రాజకీయం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతుండటం దారుణం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గాలిలో వస్తాడు.. గాలిలోనే పోతాడు’ అంటూ చంద్రబాబు తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో భారీ వర్షాలు, వరదల పరిస్థితి, దెబ్బతిన్న జిల్లాల్లో చేపట్టిన సహాయక చర్యలపై శుక్రవారం సీఎం శాసనసభలో మాట్లాడారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
కనీవినీ ఎరుగని రీతిలో వరద
- చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా వైఎస్సార్, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో నవంబర్ 16, 17న వర్షాలు పడ్డాయి. నవంబరు 19 తెల్లవారుజామున రెండు చిన్న రిజర్వాయర్లు పింఛ, అన్నమయ్య కట్టలు తెగిపోయాయి. వరదల వల్ల కలిగిన ఆస్తి, ప్రాణ నష్టాన్ని ఎక్కడా దాచిపెట్టే పని చేయలేదు.
- శుక్రవారం తెల్లవారుజామున 3.20 లక్షల క్యూసెక్కుల నీరు 2, 3 గంటల్లోనే చెయ్యేరు నుంచి అన్నమయ్య ప్రాజెక్టులోకి వచ్చిందని టీడీపీ అధికార పత్రిక ఈనాడులోనే రాశారు.
- జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. ముంపు ప్రాంతాల్లో ఉన్న 1,250 కుటుంబాలను అప్రమత్తం చేశారు. లోతట్టులో ఉన్న 400 కుటుంబాలను ఎత్తు ప్రాంతాలకు తరలించారు. 900 మందిని సహాయ శిబిరాలకు తరలించారు.
ఏది ముఖ్యం? సాయమా.. నా పర్యటనా?
- శుక్రవారం మధ్యాహ్నానికే హెలికాప్టర్‌లను అక్కడకు చేర్చగలిగాం. ముంపు గ్రామాలకు తాగునీరు, ఆహారం అందించగలిగాం. ఆరోజే జరిగిన నష్టాన్ని నేను సమీక్షించి సహాయక చర్యలకు ఆదేశాలు ఇచ్చాను. శనివారం ఏరియల్ సర్వే ద్వారా ఆ ప్రాంతాలకు వెళ్లి చూశాను.
- ప్రతిరోజు కలెక్టర్లతో కాన్ఫరెన్స్‌లు, సమీక్షల ద్వారా జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ, సహాయక చర్యలను పురమాయిస్తూ, ముమ్మరంగా ఫాలో అప్ చేశాం. ప్రత్యేక అధికారులు, ఆ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలను పంపించాం. ‘నేను వెళ్లాలి కదా.. రాజకీయాల్లో ఉన్నాం.. చంద్రబాబు బురద జల్లుతాడు, బండలు వేస్తాడు’ అని చర్చించా. అలా చేస్తే సీఎం చుట్టూ యంత్రాంగం, మీడియా, హడావుడి తప్ప పనులు జరగవని అధికారులు చెప్పారు. ఇంత చేసినా దుర్మార్గంగా రాజకీయం చేస్తున్నం దుకు చంద్రబాబు సంస్కారానికి నమస్కారం.
డబ్బు కొరత లేకుండా చూశాం
- నాలుగు జిల్లాల్లో వరద వల్ల 44 మంది మరణించగా, 16 మంది గల్లంతయ్యారు. 1,169 ఇళ్లు పూర్తిగా, 5,434 ఇళ్లు పాక్షికంగా, 604 గుడిసెలు పాక్షికంగా దెబ్బ తిన్నాయి. 319 తాత్కాలిక క్యాంపులు ఏర్పాటు చేసి 79,590 మందికి ఆశ్రయం ఇచ్చాం.
- డబ్బు కొరత లేకుండా రూ.84 కోట్లను ఆయా జిల్లాలకు విడుదల చేశాం. కరెంటు సరఫరాను నిన్నటికే (గురువారం) నూటికి నూరు శాతం పునరుద్ధరించాం. ప్రతి బాధిత కుటుంబానికి బియ్యం, నూనె, ఇతర రేషన్ ఇవ్వడంతో పాటు వారు ఇంటికి వెళ్లినప్పుడు చేతిలో రూ.2 వేలు ఇచ్చి చిరునవ్వుతో పంపించే కార్యక్రమం చేశాం.
- బాబు ఇలా మానవత్వం చూపారా?
- చంద్రబాబు తన హయాంలో ఒక్కసారైనా ఇంత మానవత్వం చూపారా? 25 కేజీల బియ్యం ఇస్తే పెద్ద గొప్ప అని భావించే రకం ఆయన. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు శరవేగంగా అందించాం.
- గల్లంతైన వారి ఎఫ్‌ఐఆర్, స్థానిక విచారణ వేగంగా జరిపించి రూ.5 లక్షల పరిహారం అందించాం. గతంలో దీనికి కనీసం నెల పట్టేది. అంటువ్యాధులు ప్రబలకుండా 653 మెడికల్ క్యాంపులు నిర్వహించాం. 5,286 పశువులు చనిపోతే వాటికి ఈరోజు (శుక్రవారం) సాయంత్రానికి పరిహారం ఇచ్చే కార్యక్రమం పూర్తి చేస్తున్నాం. గతంలో ఇందుకు 6 నెలలు పట్టేది.
- పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.3,200, పక్కా ఇళ్లకు రూ.5,200, పూర్తిగా దెబ్బతింటే రూ.95,100 నష్ట పరిహారం పూర్తిగా చెల్లించాం. పూర్తిగా ఇళ్లు దెబ్బ తిన్న వారికి నష్ట పరిహారంతోపాటు రూ.1.80 లక్షలతో కొత్త ఇల్లు మంజూరు పత్రాలను చేతిలో పెట్టాం.
- పంట నష్ట పరిహారం, రోడ్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించాం. చెరువు గట్లకు 882 చోట్ల గండ్లు పడితే 267 గండ్లు పూడ్చివేయించాం.
- రిజర్వాయర్లలో ఆన్‌లైన్‌లో ఆటోమేటిక్‌గా రియల్‌టైంలో నీళ్లు, ప్రవాహాన్ని మానిటర్ చేసేలా చూస్తున్నాం. ఈఎన్‌సీ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ఆదేశించాం.
- చిన్నా, పెద్ద రిజర్వాయర్లపై అధ్యయనం చేసి, ప్రతి రిజర్వాయర్‌కు కాంక్రీట్ మెజర్స్ తీసుకునే దిశగా సీఎస్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. అన్నమయ్య రిజర్వాయర్ డిశ్చార్జ్ కెపాసిటీని పెంచాలని 2017లో నివేదికలు ఇచ్చినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఇది వక్రీకరణ కాదా?
చంద్రబాబునాయుడి కరపత్రం ఈనాడు తొలి పేజీలో ఒక ఫొటో వేశారు. చంద్రబాబుకు తన ఇంట్లో పరిస్థితి వివరిస్తున్న నెల్లూరు జిల్లా గంగపట్నం గ్రామం మహిళ అని రాశారు. ఇంటి ముందున్న పాకలో నిలబడి చంద్రబాబు ఫొటో దిగాడు. ఆ ఇంటికి చెందిన పాత్ర మన్నెమ్మది ఇందుకూరు పేట మండలం గంగపట్నం గ్రామం. ఈ నెల 24న ఆమెకు రూ.2 వేలు డబ్బు, 25న నిత్యావసరాలు, 26న పాక్షికంగా దెబ్బతిన్న ఇంటికి రూ.5,200 డబ్బు ఇచ్చాం.
పక్కా ఇల్లు ఇప్పటికే ఉంది కాబట్టి ఆమె దానికి అర్హురాలు కాదు. ఆమెకు రావాల్సిన ప్రతిదీ ఏ సిఫార్సు లేకుండా ఇచ్చాం. ఆమె గురించి ఎవరూ చెప్పిందీ లేదు. చంద్రబాబు ఇంతకు ముందు ఆవిడ దగ్గరకు పోయిందీ లేదు. ఆమె ఏ పార్టీ అని అడగలేదు. ప్రభుత్వం వలంటీర్లను పెట్టి ప్రతి ఒక్కరికీ సహాయం అందిస్తున్నామన్నదానికి ఇదే నిదర్శనం. ఇవన్నీ ఆమెకు అందాయని ఈనాడులో ఎక్కడా రాయరు. ప్రభుత్వాన్ని ఎలా డ్యామేజ్ చేయాలి.. అని మాత్రమే ఆలోచించి పతాక శీర్షికల్లో చంద్రబాబు ఫొటో పెట్టి రాస్తారు.
Comments
Please login to add a commentAdd a comment