సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి శుక్రవారం విశాఖలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో పాటు, మరికొన్నింటిని జాతికి అంకితం చేసేందుకు విశాఖకు చేరుకున్న ప్రధానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో రాత్రి 7.55కు ఐఎన్‌ఎస్ డేగా వద్దకు ప్రధాని చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్, సీఎం, స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె.సుభద్ర, తదితరులు స్వాగతం పలికారు. సీఎం జగన్ పలువురు మంత్రులను ప్రధానికి పరిచయం చేశారు.
అనంతరం మారుతి కూడలి నుంచి ఐఎన్‌ఎస్ చోళా వరకు బీజేపీ చేపట్టిన శోభాయాత్ర రోడ్ షోలో అడుగడుగునా ప్రధానికి ఆ పార్టీ శ్రేణులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఐఎన్‌ఎస్ చోళా సూటుకు చేరుకున్న ప్రధానితో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీకి చెందిన కోర్ కమిటీ సభ్యులు వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్టు తెలిసింది. మరోవైపు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పోర్టు గెస్ట్‌హౌస్‌కు రాత్రి 8.43కు చేరుకోగా, నోవాటెల్‌లో గవర్నర్ బస చేస్తున్నారు.
అంతకు ముందు ప్రధానికి స్వాగతం పలికేందుకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు కలెక్టర్, కమిషనర్‌తో పాటు ఎంపీలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. ప్రధానికి స్వాగతం పలికినవారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, విడదల రజని, గుడివాడ అమర్‌నాథ్, మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, భీశెట్టి సత్యవతి, గొడ్డేటి మాధవి, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్యేలు, కలెక్టర్ మల్లికార్జున, సీపీ సీహెచ్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
40 నిమిషాల పాటు పీఎం ప్రసంగం!
రాష్ట్రంలో రూ.10,742 కోట్లతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులతో పాటు ఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేసేందుకు ఆంధ్రా యూనివర్శిటీ (ఏయూ) గ్రౌండ్స్ ఇప్పటికే సిద్ధమైంది. శనివారం (12వ తేదీ) ఇక్కడ జరిగే బహిరంగ సభలో ప్రధానితో కలిసి గవర్నర్, ముఖ్యమంత్రిలు పాల్గొననున్నారు. ప్రధాని ఐఎన్‌ఎస్ చోళ నుంచి ఉదయం 10.10 గంటలకు బయలుదేరి 10.30 గంటలకు ఏయూ గ్రౌండ్‌కు రోడ్డు మార్గంలో చేరుకుంటారు. గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కలిసి ప్రధాని రూ.10,742 కోట్ల విలువైన 5 ప్రాజెక్టులకు శంకుస్థాపన, రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. ఈ బహిరంగ సభలో ప్రధాని 40 నిమిషాల పాటు ప్రసంగించనున్నట్లు తెలిసింది. ఇదే సభలో సీఎం వైఎస్ జగన్ కూడా మాట్లాడనున్నారు. 11.45 గంటలకు సభ ముగిసిన అనంతరం ప్రధాని మోదీ.. విశాఖ విమానాశ్రయానికి చేరుకుని 12.05 గంటలకు హైదరాబాద్ బయలుదేరనున్నారు.
బీజేపీ శోభాయమాన స్వాగతం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. శోభాయాత్ర పేరిట నిర్వహించిన రోడ్డు షోలో దారి పొడవునా మోదీ.. మోదీ.. అంటూ నినాదాలు చేశారు. ఎయిర్‌పోర్టు వెనక ఉన్న రోడ్డు మార్గంలోని మారుతి జంక్షన్ నుంచి నేవల్ డాక్ యార్డు వరకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర ఈ రోడ్డుషో సాగింది. రోడ్డు పక్కన బీజేపీ జెండాలు, బ్యానర్లు కట్టారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు దారి పొడవునా పెద్ద సంఖ్యలో మోదీ ముఖచిత్రం ఉన్న ప్ల కార్డులను చేతబట్టి నిలుచున్నారు. మోదీ వాహనంపై దారి వెంబడి బీజేపీ కార్యకర్తలు పూల వర్షం కురిపించారు. మోదీ.. మోదీ.. భారత మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ప్రధాని మోదీ వాహనంలోపలి నుంచి వారికి అభివాదం చేస్తూ చిరునవ్వుతో ముందుకు సాగారు.
తొలుత ఈ రోడ్డు షోలో ప్రధాని ఓపెన్ టాప్ వాహనంలో పయనిస్తారని భావించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ ఆలోచన విరమించుకున్నారు. ప్రధాని రోడ్డు షో కాన్వాయ్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు అవకాశం కల్పించారు. ఆయనతో పాటు ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ మాధవ్ పాల్గొన్నారు. ఈ రోడ్డు షో వెనుక బీజేపీ నాయకులు సీఎం రమేష్, పురందేశ్వరి, సుజనా చౌదరి, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులున్నారు.
చదవండి: మూడేళ్లుగా ఏపీ నంబర్ వన్.. ఇదీ మన ఘనత
Comments
Please login to add a commentAdd a comment