సాక్షి, అమరావతి: నెల్లూరు, శ్రీకాకుళం నగరపాలక సంస్థలతో పాటు ఇంతకుముందు ఎన్నికలు ఆగిపోయిన 11 మునిసిపాలిటీలకు త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఇందుకు సంబంధించి రెండు రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని మునిసిపల్ శాఖ అధికారులతో ప్రాథమిక సమావేశం నిర్వహించారు. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఎంఎం నాయక్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి కె.కన్నబాబు ఆ సమావేశంలో పాల్గొన్నారు. గత ఏడాది మార్చి నెలలో రాష్ట్రమంతటా మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పట్లో 75 మునిసిపాలిటీలు, 12 నగరపాలక సంస్థలకు మాత్రమే ఎన్నికలు జరగ్గా.. వివిధ కారణాలతో 32 మునిసిపాలిటీలతో పాటు 4 నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిలిచిపోయాయి. వాటిలో అకివీడు (పశ్చిమ గోదావరి), జగ్గయ్యపేట, కొండపల్లి (కృష్ణా), దాచేపల్లి, గురజాల (గుంటూరు), దర్శి (ప్రకాశం), బుచ్చిరెడ్డిపాలెం (నెల్లూరు), కుప్పం (చిత్తూరు), బేతంచర్ల (కర్నూలు), కమలాపురం (వైఎస్సార్), పెనుకొండ (అనంతపురం) మునిసిపాలిటీలతో పాటు నెల్లూరు, శ్రీకాకుళం నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు కోర్టు ఆటంకాలు ఏవీ లేవని మునిసిపల్ అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు.
ఈ నేపథ్యంలో ఆయా మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అధికారికంగా నివేదిక ఇవ్వాలని ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని మునిసిపల్ అధికారులకు సూచించినట్టు తెలిసింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఓటర్ల జాబితాల తయారీ, వార్డులు, డివిజన్ల వారీగా రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలను నివేదికలో పేర్కొనాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను అంచనా వేసుకుని, ఆయా మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తగిన కార్యాచరణను సిద్ధం చేసుకోనున్నట్టు కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
గ్రామీణ ఎన్నికలకూ సన్నద్ధం
గ్రామాల్లో నిలిచిపోయిన సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల గురించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆరా తీశారు. శనివారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్, ఇతర అధికారులతో సాహ్ని భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ ముగిసినప్పటికీ.. కోర్టు ఆదేశాల మేరకు కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయిన అంశం సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది. మరోవైపు అప్పట్లో గ్రామ పంచాయతీల విలీనం, వర్గీకరణ వంటి కారణాలతో ఎన్నికలు ఆగిపోయిన 259 చోట్ల సర్పంచ్, వాటి పరిధిలోని వార్డు పదవులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని పంచాయతీరాజ్ అధికారులు వివరించారు. నామినేషన్లు దాఖలు కాకపోవడం వల్ల నిలిచిపోయిన వివిధ గ్రామ పంచాయతీల పరిధిలో దాదాపు 223 వార్డుల్లో కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని తెలియజేసినట్టు సమాచారం. దాదాపు 452 ఎంపీటీసీ స్థానాలు, 22 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉందని కూడా ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే ఎన్నికలు జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో కౌంటింగ్ నిర్వహించే అంశంపై బుధవారం హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో.. మిగిలిన గ్రామీణ సంస్థల ఎన్నికలపై కోర్టు తీర్పు ఆధారంగా తదుపరి కార్యాచరణ చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment