సాక్షి, అమరావతి: పీఆర్సీపై చర్చించడానికి స్టీరింగ్ కమిటీ సభ్యులందరూ కలిసి 27వ తేదీన చర్చలకు రావాలని కోరినట్లు ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. ఏ ఒక్కరికీ ఒక్క రూపాయి కూడా జీతం తగ్గకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పీఆర్సీపై ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ సచివాలయంలో వరుసగా రెండో రోజు మంగళవారమూ సమావేశమైంది. అంతకు ముందే సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ మధ్యాహ్నం 12 గంటలకు పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీని చర్చలకు ఆహ్వానించారు. స్టీరింగ్ కమిటీ విజయవాడలో సమావేశమై.. నాలుగు జేఏసీల నుంచి తొమ్మిది మందితో కూడిన ప్రతినిధుల బృందాన్ని పంపింది. ఆలస్యంగా వచ్చిన ప్రతినిధుల బృందం మంత్రుల కమిటీతో గంటన్నరకు పైగా భేటీ అయింది. తాము చర్చలకు రాలేదని, ప్రభుత్వం ప్రధానమైన మూడు డిమాండ్లపై స్పష్టత ఇస్తేనే చర్చలకొస్తామని చెప్పింది. 24న సీఎస్‌కు ఇచ్చిన సమ్మె నోటీసులోని అంశాలనే మరోసారి పేర్కొంది. అశుతోష్ మిశ్రా కమిషన్ నివేదికను బయటపెట్టాలని, కొత్త పీఆర్సీ జీవోలను అబయన్స్‌లో ఉంచాలని, పాత పీఆర్సీ ప్రకారం జనవరి నెల జీతాలు చెల్లించాలంటూ లిఖితపూర్వక వినతిని సమర్పించింది.
సమస్యల పరిష్కారం కోసమే మంత్రుల కమిటీ
అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీ పని చేస్తోందన్నారు. తమ పరిధిలో లేని అంశాలపై ఉన్నత స్థాయిలో చర్చించి సానుకూలంగా పరిస్థితి చక్కబెడతామని చెప్పారు. ఒకసారి జారీ చేసిన జీవోలను ఆపమనడం సరికాదని హితవు పలికారు. ‘ఇది మీ ప్రభుత్వం. ఫ్రెండ్లీ ప్రభుత్వం. అడిగినా, అడక్కపోయినా చేయగలిగినంత చేస్తోంది. ఇప్పుడు కూడా అపోహలు తొలగించడానికి, నష్టం జరుగుతుంటే సరిదిద్దడానికి ప్రయత్నిస్తోంది. ఇంత కాలం జరిగిన దానిని తిరగదోడమనడం సమంజసం కాదు. సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడకపోతే బాధపడాలి. ప్రజా సంక్షేమంతో పాటుగానే ఉద్యోగుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి బాధ్యతతో వ్యవహరిస్తున్నారు. అడగకుండానే 27 శాతం ఐఆర్ ఇచ్చారు. అతి తక్కువ వేతనాలున్న అంగన్‌వాడీలకు జీతాలు పెంచారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. వారికి ప్రొబేషన్ ఖరారు చేయాలని ఆదేశించారు. ఇలా ఎన్నో అంశాలపై సుదీర్ఘంగా కసరత్తు చేసి నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు వాటిని వద్దంటే ఎలా? ఉద్యోగులు విశాల దృక్పథంతో ఆలోచించాలని ప్రతినిధుల బృందానికి చెప్పాం. ఇదే విధంగా అన్ని స్థాయిల్లోని ఉద్యోగులను కోరుతున్నాం. ఉద్యోగ సంఘాలతో అంతుకు ముందు చర్చించిన అంశాలపై ఇప్పుడు ఆందోళన జరుగుతోంది. వీటిల్లో కొన్ని విషయాలు వారికి తెలియదంటున్నారు. వాటిని నివృత్తి చేసేందుకు మళ్లీ పిలిచాము’ అని రామకృష్ణారెడ్డి తెలిపారు.
ఫిట్‌మెంట్ సమస్య కాదు
పీఆర్సీ ఎప్పటికైనా ఇవ్వక తప్పదని, కొత్త పీఆర్సీ వచ్చిన తర్వాత పాత వేతనం ఇవ్వాలని ఉద్యోగులు అడగడానికి లేదన్నారు. ఈ విషయం అందరికీ తెలుసునని విలేకరుల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. ఇప్పడు ఫిట్‌మెంట్ సమస్య కాదని, ఇతర అంశాలుంటే కూలంకషంగా చర్చించి సానుకూలంగా పరిష్కరిస్తామని తెలిపారు. మంత్రుల కమిటీ ఉదయం 11.30 గంటలకే సచివాలయానికి చేరుకుని ఉద్యోగ సంఘాల ప్రతినిధుల కోసం వేచిచూసిందన్నారు. కమిటీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), జీఏడీ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ ఉన్నారు.
చర్చలకు వ్యతిరేకం కాదు : స్టీరింగ్ కమిటీ
సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చర్చలకు కమిటీ వేయడం శుభ పరిణామమని పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యుడు జి.ఆస్కార్ రావు అన్నారు. మంగళవారం సచివాలయంలో మంత్రుల కమిటీతో భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. స్ట్రగుల్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను అనుసరించి ప్రభుత్వంతో చర్చలకు మూడు ప్రధాన డిమాండ్లను నివేదించామన్నారు. వీటిని అంగీకరిస్తేనే చర్చల్లో పాల్గొంటామని చెప్పడానికే వచ్చామన్నారు. షరతులకు అంగీకరిస్తే జేఏసీల చైర్మన్ల స్థాయిలో స్టీరింగ్ కమిటీ సభ్యులు అందరం కలిసి చర్చలకు వస్తామని చెప్పారు. తాము చర్చలకు వ్యతిరేకం కాదన్నారు. మరో సభ్యుడు వైవీ రావు మాట్లాడుతూ.. పీఆర్సీ విషయంలో తాము ఒకే స్టాండ్‌పై ఉన్నామన్నారు. ప్రభుత్వం స్టీరింగ్ కమిటీ డిమాండ్లను అంగీకరించాల్సిందేనన్నారు. కేవీ శివారెడ్డి, కె.రాజేష్, జె.హృదయరాజ్, అరవపాల్, వీవీ మరళీకృష్ణ నాయుడు, ఎం.కృష్ణయ్య, సీహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు కూడా ప్రతినిధుల బృందంలో ఉన్నారు.
27న చర్చిద్దాం.. అందరూ కలిసి రండి
Published Tue, Jan 25 2022 3:48 PM | Last Updated on Wed, Jan 26 2022 5:18 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment