
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం విద్యుత్ సంస్థలను దారుణంగా దెబ్బతీసింది. ఆ ప్రభుత్వ విధానాలు, నిర్వాకాలతో ఇప్పటికీ నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. అవసరం లేకున్నా ప్రాజెక్టులు, కమీషన్ల కోసం కాంట్రాక్టులు, ఎక్కడా లేని రేట్లతో ఎడాపెడా ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లు నిండా ముంచేశాయి. రాష్ట్ర విభజన నాటికి విద్యుత్ సంస్థలకు రూ.7,069.25 కోట్ల అప్పులుంటే... 2019 మే చివరి నాటికి అవి రూ.35,700.97 కోట్లకు పెరిగాయి. కాగా ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం వీటిని గట్టెక్కించే దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఏడాది కాలంలోనే రూ.38,288 కోట్ల ఆర్థిక సాయం అందేలా చేసింది.
డిస్కమ్‌లపై పెను భారం
- గత ప్రభుత్వ ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లు (పీపీఏలు) డిస్కమ్‌లపై పెను భారం మోపాయి. మిగులు విద్యుత్ పేరుతో స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్ళు చేశారు. రూ.4కు లభించే యూనిట్ విద్యుత్‌కు రూ.6పైనే వెచ్చించడం, మార్కెట్లో అప్పటికప్పుడు యూనిట్‌ను రూ.9 కూడా పెట్టి కొనడం సంస్థలను అప్పుల్లోకి నెట్టాయి. 2014–2019 మార్చి నాటికి డిస్కమ్‌లు ఏకంగా రూ.28 వేల కోట్ల నష్టాల్లోకెళ్ళాయి.
- రాష్ట్రంలో పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిని అవసరం లేకున్నా (రెన్యూవబుల్ ఆబ్లిగేషన్ కింద) ఎక్కువ మొత్తంలో ప్రోత్సహించారు. 11 శాతం ఉండాల్సిన ఈ విద్యుత్‌ను 23 శాతంకు అనుమతించడంపై అనేక విమర్శలు వచ్చాయి. ప్రైవేటు ఉత్పత్తిదారుల నుంచి ముడుపులు తీసుకుని ఈ విధంగా అనుమతించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
- పవన, సౌర విద్యుత్‌ను లెక్కకు మించి కొనడం వల్ల డిస్కమ్‌లపై 2014–19 మధ్య దాదాపు రూ.6 వేల కోట్ల అదనపు భారం పడింది. మరోవైపు ఈ విద్యుత్ కోసం థర్మల్ విద్యుత్‌ను తగ్గించారు. అయినా ఈ ప్లాంట్లకు ఐదేళ్ళల్లో రూ.7 వేల కోట్ల వరకు ఫిక్స్‌డ్ ఛార్జీలు చెల్లించడంతో నష్టాలు మరింత పెరిగాయి.
- తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల్లో థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం మెగావాట్‌కు రూ.4.5 కోట్ల చొప్పున చేపడితే.. ఏపీలో మాత్రం కొత్త ప్లాంట్ల నిర్మాణ కాంట్రాక్టు మెగావాట్‌కు రూ.6 కోట్ల వరకు ఇచ్చారు. కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం ప్లాంట్ల నిర్మాణంలో ఏకంగా రూ.2 వేల కోట్ల అదనపు వ్యయం చేశారు. ఇందులో అప్పటి ప్రభుత్వ పెద్దలకు భారీగా ముడుపులు అందాయనే ఆరోపణలొచ్చాయి.
- విదేశీ బొగ్గు ధరలు తగ్గినా పాత రేట్లకే కొనుగోలు చేశారు. దీంతో థర్మల్ ప్లాంట్లు భారీగా నష్టపోయాయి. స్వదేశీ బొగ్గు కాంట్రాక్టు రవాణాలో పెద్ద ఎత్తున జరిగిన అవినీతి వల్ల జెన్‌కో అప్పులపాలైంది. సౌర విద్యుత్ కోసం వేసిన ట్రాన్స్‌కో లైన్లలో అవినీతి జరిగిందని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ గుర్తించింది.
జగన్ సర్కారు దిద్దుబాటు చర్యలు
వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విద్యుత్ సంస్థలను ఆదుకునేందుకు ఏడాది కాలంలోనే పెద్ద ఎత్తున సహకరించింది. 2019–20లో డిస్కమ్‌లకు సబ్సిడీ కింద రూ.17,904 కోట్లు విడుదల చేసింది. బిల్లుల చెల్లింపునకు రూ.20,384 కోట్లు ఇచ్చింది. 2020–21 ఆర్థిక వ్యయాన్ని దాదాపు రూ.5 వేల కోట్లకు తగ్గించింది. రివర్స్ టెండరింగ్ చేపట్టి ప్రతి కాంట్రాక్టును తక్కువ రేటుకే ఇచ్చేలా చేస్తోంది. తక్కువ ధరకే విద్యుత్ కొనుగోళ్ళు చేయడం వల్ల ఏడాది కాలంలోనే రూ.500 కోట్ల వరకు మిగిల్చింది.
Comments
Please login to add a commentAdd a comment