
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ చేయూత’ పథకం కింద వచ్చిన సొమ్ముతో చిన్నపాటి వ్యాపారాలు ప్రారంభించిన మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. సర్కారు లక్ష్యానికి అనుగుణంగా వివిధ కంపెనీలు, ఆయా శాఖల కార్పొరేషన్ల ఎండీలు, లబ్ధిదారులతో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్‌కుమార్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ముందుకొచ్చిన కంపెనీలు
► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుటుంబాలకు చెందిన మహిళలు వైఎస్సార్ చేయూత పథకం లబ్ధిదారులుగా ఉన్నారు. ఒక్కొక్కరికీ ప్రభుత్వం నాలుగేళ్ల పాటు రూ.75 వేలు ఆర్థిక సాయం చేస్తుంది.
► వారికి ఇప్పటికే మొదటి విడత సాయం అందించింది. ఆ సొమ్ముతో అత్యధికులు కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.
► వారికి వివిధ కంపెనీలు తమ ఔట్‌లెట్స్ ద్వారా సరుకులు సరఫరా చేసేందుకు అంగీకరించాయి.
► హిందుస్థాన్ లీవర్ కంపెనీ ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ సరుకులు సరఫరాకు అయ్యే రవాణా ఖర్చులు తామే భరిస్తామని చెప్పారు.
► 3 నెలల వరకు సరుకు అమ్ముడుకాకపోతే రిటర్న్ తీసుకునేందుకు కూడా పలు కంపెనీలు అంగీకరించాయి.
► హిందుస్థాన్ యూనివర్సల్ లిమిటెడ్, ఐటీసీ, పీఅండ్‌జీ కంపెనీలు సంబంధిత మహిళలకు అవసరమైతే రుణ సాయం చేస్తామని, సరుకులు సరఫరా చేసి వ్యాపారాభివృద్ధికి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్టు తెలిపాయి.
► లబ్ధిదారుల సందేహాలకు ఆయా కంపెనీల ప్రతినిధులు సమాధానాలు ఇచ్చారు.