
వీఎంఆర్‌ఆర్ స్కూల్‌ను పరిశీలిస్తున్న అధికారులు
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఇప్పటికే నాడు–నేడు ద్వారా స్కూళ్ల రూపు రేఖలు మార్చింది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, ఢిల్లీలోని సర్వోదయ స్కూల్ తరహా బోధన పద్ధతులతో పాఠశాలలను తీర్చి దిద్దే దిశగా అడుగులేస్తున్నారు. దీనికి విజయవాడ కార్పొరేషన్ పరిధి కృష్ణలంకలోని అమరజీవి పొట్టి శ్రీరాములు మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్, వీఎంఆర్‌ఆర్ హైస్కూల్ పాఠశాలలను ఎంపిక చేశారు. స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, విద్యాశాఖ సురేష్‌కుమార్, నాడు–నేడు ఇన్‌ఫ్రా జాయింట్ డైరెక్టర్ మురళి, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డీఈవో రేణుకలు ఇప్పటికే ఆ పాఠశాలలను సర్వోదయ స్కూళ్లుగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి, కార్పొరేషన్ అధికారులకు పలు సూచనలు చేశారు.
‘ఢిల్లీ’ తరహా బోధన..
ఒకే స్కూల్ కాంప్లెక్స్‌లో పీపీ1, పీపీ2 నుంచి 10+2 వరకు బోధన సాగించేందుకు వీలుగా అన్ని సదుపాయాలూ కల్పిస్తారు. అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్ క్రీడా వికాస కేంద్రాన్ని స్పోర్ట్స్ స్కూల్‌గా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఢిల్లీలోని విద్యార్థులకు ఏ విధంగా బోధన అందిస్తున్నారు.. ఇందుకోసం ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ ఇచ్చారు.. తదితర అంశాలను పరిశీలించి తదనుగుణంగా విజయవాడ స్కూళ్లలో బోధనను మెరుగుపరుస్తారు. ఇందుకోసం ఓ బృందాన్ని ఢిల్లీకి పంపనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే విజయవాడలో ప్రయోగాత్మకంగా ఇలాంటి స్కూళ్లను ఏర్పాటు చేసే దిశగా అధికారులు వడివడిగా అడుగులేస్తున్నారు. అనంతరం ఈ విధానాన్ని దశలవారీగా రాష్ట్రంలోని అనువైన పాఠశాలలకు విస్తరిస్తారు.
అన్ని సదుపాయాలతో విద్య
నగరంలో మునిసిపల్ సూళ్లలో మెరుగైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా 10+2 వరకూ ఒకే చోట అన్ని సదుపాయాలతో విద్య అందిస్తాం. ఢిల్లీలోని సర్వోదయ విద్యా తరహా బోధనను ప్రయోగాత్మకంగా విజయవాడలో చేపడతాం.
– స్వప్నిల్ దినకర్ పుండ్కర్, నగర కమిషనర్, విజయవాడ.
Comments
Please login to add a commentAdd a comment