సాక్షి, అమరావతి: ఎటువంటి తనఖా అవసరం లేకుండా సూక్ష్మ, చిన్న వ్యాపారులకు ఇచ్చే ‘ముద్ర’ రుణాల మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం మంచి పనితీరు కనబర్చింది. 2021–22 సంవత్సరానికి బ్యాంకులు లక్ష్యానికి మించి ముద్ర రుణాలు మంజూరు చేశాయి. 2021–22లో రూ.10,838 కోట్ల ముద్ర రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఆరుశాతం అధికంగా రూ.11,445.42 కోట్ల రుణాలిచ్చాయి. మొత్తం 11,17,922 మంది ఖాతాదారులకు ఈ రుణాలను మంజూరు చేసినట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సంఘం తాజా నివేదికలో పేర్కొంది.
చదవండి: ఏపీ సీఐడీ అదుపులో మాజీ మంత్రి నారాయణ
రాష్ట్రంలో లీడ్ బ్యాంక్‌గా ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధికంగా రుణాలను మంజూరు చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో కెనరా బ్యాంక్, ఎస్‌బీఐ, ఏపీజీబీ, ఏపీజీవీబీ ఉన్నాయి. రూ.2,075 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న యూనియన్ బ్యాంక్ రూ.2,251 కోట్ల రుణాలు మంజూరు చేసింది. ప్రైవేటు రంగ బ్యాంకుల్లో హెచ్‌డీఎఫ్‌సీ అత్యధికంగా రుణాలిచ్చింది.
ఈ బ్యాంకు రూ.317 కోట్ల రుణాలను ఇవ్వాలని నిర్దేశించగా రూ.302 కోట్ల రుణాలను మంజూరు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు బ్యాంకర్ల కమిటీ సమావేశంలో రైతులు, ఎంఎస్‌ఎంఈ రంగానికి ఇచ్చే రుణాలపై ప్రత్యేకశ్రద్ధ చూపించడంతో లక్ష్యాన్ని మించి ముద్ర రుణాలను మంజూరు చేసినట్లు బ్యాంకింగ్ అధికారులు పేర్కొన్నారు. ముద్ర రుణం కింద రూ.10 లక్షల వరకు రుణం మంజూరు చేస్తారు. ఈ రుణాన్ని ఐదేళ్లలోపు చెల్లించాలి. దేశం మొత్తం మీద బ్యాంకులు 2021–22లో 5.37 కోట్ల ఖాతాలకు రూ.3,39,110.35 కోట్ల రుణాలను మంజూరు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment