
సాక్షి, అమరావతి: థర్డ్ వేవ్‌లో కరోనాను ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆక్సిజన్ పడకలకు ఎలాంటి కొరత తలెత్తకుండా ఉండేందుకు వీలుగా అధికారులు అటు ప్రైవేట్, ఇటు ప్రభుత్వాస్పత్రుల్లో వాటి సంఖ్యను గణనీయంగా పెంచుతున్నారు. ఇందులో భాగంగా.. గడిచిన రెండు నెలలుగా సాధారణ పడకలకు మూడు రెట్లు ఎక్కువగా ఆక్సిజన్ పడకలు ఏర్పాటుచేస్తున్నారు. అదే సమయంలో ఐసీయూ పడకలను పెంచేందుకూ చర్యలు తీసుకుంటున్నారు.
25 వేల నుంచి 37 వేలకు..
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 25,198 ఆక్సిజన్ పడకలున్నాయి. వీటిని 37,136కు పెంచనున్నారు. థర్డ్ వేవ్ సన్నాహాల్లో భాగంగా సాధారణ పడకల్లో ఎక్కువ భాగం ఆక్సిజన్ పడకలుగా మారుస్తున్నారు. విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో భారీగా ఏర్పాట్లుచేస్తున్నారు. ప్రస్తుతం 17,178 సాధారణ పడకలుండగా, అవి 10,186కి తగ్గుతాయి. అంటే 6,992 పడకలను సాధారణ పడకల నుంచి ఆక్సిజన్ పడకలుగా మార్చనున్నారు.
అదనంగా మరో 877 మంది పీడియాట్రిక్ వైద్యులు
అలాగే, రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 722 మంది చిన్నపిల్లల వైద్యులున్నారు. వీరుకాకుండా మరో 877 మంది పీడియాట్రిక్ వైద్యులను కోవిడ్ సేవలకు వినియోగించుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో ఇప్పటివరకూ 246 మందిని నియమించారు. ఇక స్టాఫ్ నర్సులు 8,053 మంది ఉండగా అదనంగా మరో 1,434 మందిని నియమిస్తారు. సహాయక సిబ్బంది కూడా ఇప్పుడున్నది 5,328 కాగా.. మరో 1,382 మందిని నియమిస్తారు. దీంతో బాధితులకు మెరుగైన సేవలందించే అవకాశం ఉంటుంది.
ఈ ఏడాది భారీగా నియామకాలు
ఇక రాష్ట్రంలో కోవిడ్ సేవల కోసం 2021లో ఇప్పటివరకు భారీగా నియామకాలు జరిగాయి. కేవలం జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లే 3,997 మంది నియమితులయ్యారు. స్టాఫ్ నర్సులు 6,306 మంది, స్పెషలిస్టు డాక్టర్లు 127, నర్సింగ్ ఆర్డర్లీ 5,668, నాల్గవ తరగతి ఉద్యోగులు 3,049, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 1,131 మందిని నియమించారు. ఇవికాకుండా జాతీయ హెల్త్ మిషన్ పరిధిలో 2,964 పోస్టులను నిర్ధారించగా, ఇప్పటివరకూ 2,671 మందిని నియమించారు.
పనులు ముమ్మరంగా..
థర్డ్‌వేవ్‌కు ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్ ప్లాంట్లు, పడకల ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సెప్టెంబర్ నాటికి ఆక్సిజన్ ప్లాంట్లు పూర్తవుతాయి. పీహెచ్‌సీ, సీహెచ్‌సీ స్థాయిలో పడకల ఏర్పాటూ కొనసాగుతోంది. ఏర్పాట్లలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనం ముందంజలో ఉన్నాం.
– మురళీధర్‌రెడ్డి, ఎండీ, ఏపీఎంఎస్‌ఐడీసీ (రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ)
Comments
Please login to add a commentAdd a comment