సాక్షి, అమరావతి: తీవ్ర వర్షాలు, వరదలతో ప్రభావితమైన గోదావరి జిల్లాలకు అత్యవసర సహాయక చర్యల కోసం రూ. 12 కోట్లు నిధులు మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
అల్లూరి జిల్లా, కోనసీమ, ఏలూరు జిల్లాలకు 3 కోట్ల చొప్పున.. పశ్చిమ గోదావరికి రూ.2 కోట్లు.. తూర్పుగోదావరి కోటి.. మొత్తం 12 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు రెవెన్యూ (డిజాస్టర్ మేనేజ్మెంట్) స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ పేరిట జీవో విడుదలయ్యింది.
అత్యవసర సహాయక కేంద్రాల ఏర్పాటుకు, ముంపు గ్రామాల నుంచి ప్రజలను తరలించేందుకు, వరద బాధితులకు ఆహారం, నీరు, పాలు అందించేందుకు.. అలాగే హెల్త్ క్యాంపు నిర్వాహణతో పాటు శానిటేషన్ కోసం ఈ నిధులు మంజూరు చేసినట్లు ప్రభుత్వం తరపున ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
అంతా సిద్ధం
తాడేపల్లి: గోదావరి వరద ఉధృతి మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నివారణ సంస్ధ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వెల్లడించారు. ‘‘ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఇంకా రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజ్ నుంచి 13.63 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నాం. గోదావరి వరద ప్రభావం తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎఎస్ఆర్ , కోనసీమ, ఏలూరు జిల్లాలలో ఎక్కువగా ఉంది.
అల్లూరి జిల్లాలో ఐదు మండలాలలో 155 గ్రామాలు, ఏలూరు జిల్లాలోని మూడు మండలాలలో 49 గ్రామాలు, కోనసీమలో 20 మండలాలలో 141 గ్రామాలు, తూర్పుగోదావరి జిల్లాలో ఎనిమిది మండలాలలో 47 గ్రామాలు, పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగు మండలాలు, 17 గ్రామాలపై గోదావరి వరద ప్రభావం ఉంది. వరద ప్రభావిత సహాయ చర్యలకోసం సీఎం జగన్ రూ. 12 కోట్లు మంజూరు చేశారు. గోదావరి వరద ప్రభావిత మండలాలలో, జిల్లాలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. ఈ రోజు సాయంత్రానికి భద్రాచలంలో గోదావర వరద పెరిగే అవకాశాలున్నాయి. ఈనెల 30 నుంచి గోదావరి వరద తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నాం. వరద సహాయక చర్యలలో జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉంది. వరద సహాయక చర్యల కోసం మూడు NDRF, నాలుగు SDRF బృందాలు పనిచేస్తున్నాయి అని వెల్లడించారాయన.
Comments
Please login to add a commentAdd a comment