ప్రవీణ్‌ కుటుంబానికి రూ.50 లక్షలు ఆర్థిక సాయం | AP Govt Financial Assistance Of Rs 50 lakhs To Praveen Kumar Family | Sakshi
Sakshi News home page

ప్రవీణ్‌ కుటుంబానికి రూ.50 లక్షలు ఆర్థిక సాయం

Published Tue, Nov 10 2020 4:10 AM | Last Updated on Tue, Nov 10 2020 7:47 AM

AP Govt Financial Assistance Of Rs 50 lakhs To Praveen Kumar Family - Sakshi

భార్య, పిల్లలతో ప్రవీణ్‌ (ఫైల్‌), ప్రవీణ్‌ కుటుంబీకులను పరామర్శిస్తున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు

సాక్షి, అమరావతి: ఉగ్రవాదుల కాల్పుల్లో వీర మరణం పొందిన చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్‌ సీహెచ్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. దేశం కోసం ప్రవీణ్‌కుమార్‌ చేసిన ప్రాణ త్యాగం వెలకట్టలేనిదని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఆయన త్యాగానికి దేశం మొత్తం గర్విస్తోందన్నారు. వీర జవాన్‌ మరణం ఆ కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, వారికి కొంతైనా ఆసరాగా ఉండేలా సీఎం సహాయ నిధి నుంచి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఈ మేరకు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి భార్య రజితకు సీఎం సోమవారం ఒక లేఖను రాస్తూ ఈ సహాయం స్వీకరించాలని కోరారు. ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు సోమవారం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి, ముఖ్యమంత్రి రాసిన లేఖను వారికి అందజేశారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్‌ 18 ఏళ్లుగా భారత సైన్యంలోని మద్రాస్‌ రెజిమెంట్‌లో పని చేస్తున్నారు. ప్రస్తుతం జమ్మూ–కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన మాచిల్‌ సెక్టార్, నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడంతో వీర మరణం పొందారు. 

దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి
గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌
దేశ రక్షణ కోసం సిపాయి ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి బలిదానం చేశారని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ కొనియాడారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపాలెంకు చెందిన చీకాల ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి మృతిపట్ల గవర్నర్‌ సోమవారం ఓ ప్రకటనలో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement