సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: వరద ముంపులో చిక్కుకుని.. పీకల్లోతు కష్టాల్లో మునిగిన కోనసీమ లంక గ్రామాల్లోని బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆపన్నహస్తం అందిస్తోంది. కష్టాల్లో ఉన్నామనే బాధ వారికి తెలియకుండా యంత్రాంగం ద్వారా అన్నివిధాలా ఆదుకుంటోంది. ముంపులో చిక్కుకున్న ప్రతి ఇంటికీ నేరుగా పడవలపై వెళ్లి మరీ సాయాన్ని అందిస్తున్నారు. వరద బాధితులుగా మారిన ప్రతి కుటుంబాన్ని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించటంతో ఉన్నతాధికారుల నుంచి వలంటీర్ వరకు ప్రభుత్వ యంత్రాంగం అంతా ముంపు గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అనునిత్యం లంక గ్రామాల వెంట తిరుగుతూ బాధితులకు ధైర్యం చెబుతున్నారు.
మొక్కవోని దీక్షతో..
వరదలు మొదలయ్యాక రెండు, మూడు రోజులు నీటి ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇంజన్ బోట్లను సైతం సరంగులు నడపలేని పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా సహాయ సామగ్రిని లంక గ్రామాలకు త్వరితంగా తరలించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆదివారం నుంచి వరద ఉధృతి నెమ్మదించడంతో ప్రభుత్వ సాయాన్ని అందించడంలో అధికార యంత్రాంగం వేగాన్ని పెంచింది. బాధితులకు తక్షణమే నిత్యావసర సరుకులు అందించాలన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. అటు కోనసీమ, ఇటు తూర్పు గోదావరి జిల్లాల యంత్రాంగాలు బియ్యం, కందిపప్పు, టమాటాలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పామాయిల్, పాల ప్యాకెట్లను యుద్ధ ప్రాతిపదికన సరఫరా చేస్తున్నారు.
నిలువెత్తు లోతు నీటిలో ఉన్న లంక గ్రామాలకు సైతం ప్రాణాలకు తెగించి పడవలపై వెళ్లి మీ వెంటే మేమున్నామంటూ బాధితులకు సహాయ, సహకారాలు అందిస్తున్నారు. ఉదయాన్నే అల్పాహారం.. 11 గంటల కల్లా వేడివేడి భోజనం ప్యాకెట్లు అందుతున్నాయని బాధితులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముంపు ప్రాంతాల్లోని గర్భిణులు, చిన్నారులకు పాలు సైతం అందిస్తున్నారు. కోనసీమ జిల్లాలోని ముంపు గ్రామాల్లోని 45 వేల కుటుంబాలకు 10 కేజీల చొప్పున బియ్యం, కిలో కందిపప్పు, 21,200 లీటర్ల పామాయిల్, 54,108 లీటర్ల పాలు, 30 టన్నుల టమాటాలు, 30 టన్నుల ఉల్లిపాయలు, 30 టన్నుల బంగాళా దుంపలను ఇప్పటికే పంపిణీ చేశారు.
ఏటిగట్లపైనా కిచెన్లు
ముంపు గ్రామాలకు అత్యంత సమీపంలో ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకుని ఎక్కడికక్కడ వంటావార్పు చేయించి బాధితులకు అల్పాహారం, భోజనం వంటివి పంపిస్తున్నారు. ముమ్మిడివరం మండలంలో ముంపులో ఉన్న తీర గ్రామాలైన చింతావానిరేవు, చింతపల్లిలంకల్లో ఉన్న సుమారు 300 మంది బాధితులకు ఏటిగట్లపైనే వంటావార్పు చేస్తున్నారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది కలిసి బొబ్బర్లంక–పల్లంకుర్రు ఏటిగట్టుపై వంట చేశారు. ఈ గ్రామాల్లో బాధితులకు ఆషాఢ మాసం స్పెషల్‌గా మునగాకు, తెలగపిండి, కందిపప్పుతో ఘుమఘుమలాడే కూరలను వండి వేడివేడిగా పెట్టారు. లంక ఆఫ్ ఠానేల్లంక, గురజాపు లంక, కూనాలంక గ్రామాల్లోని ముంపు బాధితుల కోసం ఠానేల్లంక పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో వంటలు చేసి భోజనాలు పెడుతున్నారు.
పి.గన్నవరం మండలం కె.ఏనుగుపల్లి, ఊడుమూడిలంక, జి.పెదపూడిలంక, బూరుగులంక, అరిగెలవారిలంక గ్రామాల్లో ముంపు బాధితులకు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో సాయాన్ని అందిస్తున్నారు. వలంటీర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల ప్యాకెట్లు, భోజనం ప్యాకెట్లను బాధితులకు అందజేస్తున్నారు. బాధిత కుటుంబాలకు రెండు విడతల్లో బియ్యం సరఫరా చేశారు. బాధితుల కోసం 74 పునరావాస కేంద్రాలను సిద్ధం చేయగా.. ఇప్పటివరకు 53 కేంద్రాలను తెరిచారు. 24,074 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో 7 వేల మందికి పునరావాస కేంద్రాల్లో వసతి కల్పించారు. ముంపు బాధితులకు 82,279 ఆహార పొట్లాలు, 4.50 లక్షల వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. 79 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. 18 మండలాల్లోని 70 గ్రామాలలో వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నారు. పశువులకు మేత కొరత ఏర్పడటంతో ప్రభుత్వం ఇప్పటికే 150 మెట్రిక్ టన్నుల మేతను రైతులకు అందజేసింది. రెండవ విడతగా 324 మెట్రిక్ టన్నుల మేతను రప్పించి ఇప్పటివరకు 264 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశారు. వరద బారిన పడిన 10,737 పశువులకు 475 టన్నుల దాణా సమకూర్చారు. 299 పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. 450 బోట్లను సహాయక చర్యలకు వినియోగిస్తున్నారు. 261 మంది ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, 699 మంది గజ ఈతగాళ్లు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.
ఇంటికొచ్చి సాయం అందించారు
వరద ఉధృతి ఎక్కువగా ఉన్నా పడవలపై వచ్చి మరీ సాయం అందించారు. మాకెలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు. వేడివేడి భోజనం పెడుతున్నారు. బియ్యం, కందిపప్పు, పామాయిల్, పాలు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు అందించారు. లంకల నుంచి బయటకు రావడానికి పడవలు ఏర్పాటు చేశారు. అనారోగ్యం పాలవకుండా ముందుగానే వైద్య శిబిరం పెట్టి మందులు ఇస్తున్నారు.
– ఎల్లమిల్లి నాగేశ్వరరావు, కె.ఏనుగుపల్లి, కోనసీమ
ప్రభుత్వం వెంటనే ఆదుకుంది
వరదలు వచ్చిన వెంటనే ప్రభుత్వం ఆదుకుంది. వరదలు మునుపెన్నడూ చూడని రీతిలో వచ్చి ఇళ్లన్నీ మునిగిపోయాయి. తినడానికి తిండి లేక నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో అధికారులు వచ్చి రుచికరమైన ఆహారాన్ని అందించారు. సమయానికి భోజనం ప్యాకెట్లతో పాటు నిత్యావసర సరుకులు కూడా అందించి ఆదుకున్నారు.
– పుచ్చకాయల చిన్నబ్బాయి, పి గన్నవరం, కోనసీమ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment