సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా మారబోతున్న విశాఖ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజారవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. నగరంలో మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం ప్రతిబింబించేలా మెట్రో పిల్లర్లు నిర్మాణం చేపట్టే దిశగా ఆలోచన చేస్తోంది. మరోవైపు తొలి విడతలో 76.90 కి.మీ. మేర లైట్ మెట్రో నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈలోగా నిధుల సమీకరణను వేగవంతం చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి మెట్రో రైల్ కార్పొరేషన్‌కు మార్గదర్శకాలు జారీ చేశారు.
ప్రజారవాణా వ్యవస్థ మెరుగుదలపై దృష్టి
2021 అంచనాల ప్రకారం విశాఖ మహా నగరంలో 25 లక్షలకు పైగా జనాభా ఉంది. మెట్రో నిర్మాణ ప్రతిపాదనలు ఉన్న శివారు ప్రాంతాలతో కలిపితే మొత్తం జనాభా 41 లక్షలు. అందుకే తప్పనిసరిగా మెట్రో రైలు అవసరం. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. లాభనష్టాలతో సంబంధం లేకుండా కేవలం ప్రజలకు రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు మెట్రోపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దసరా తర్వాత విశాఖ కేంద్రంగా పరిపాలన సాగించేందుకు అడుగులు పడుతున్న తరుణంలో నగరంలో ప్రజారవాణా వ్యవస్థ మరింత మెరుగు పరచాల్సిన అవసరం ఉంది. మెట్రో రైలు రాకతో ట్రాఫిక్ సమస్య తీరడంతోపాటు సమయం కూడా ఆదా అవుతుంది.
జనవరి 15న పునాది రాయి
వచ్చే ఏడాది జనవరి 15న మెట్రో రైలు పనులకు పునాది రాయి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల విశాఖలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి నిర్వహించిన అభివృద్ధి పనుల సమీక్షలో మెట్రో రైలు నిర్మాణ అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. పునాది రాయి వేసేలోగా నిధులు సమీకరించేందుకు ఉన్న మార్గాల్ని అన్వేషించాలని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ యూజేఎం రావుకు సూచించారు.
42 మెట్రో స్టేషన్లతో కూడిన మూడు కారిడార్లను మొదటి దశలో నిర్మించాలని భావిస్తున్నారు. కారిడార్–1లో స్టీల్‌ప్లాంట్ గేట్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకు 34.40 కి.మీ., కారిడార్–2లో గురుద్వార నుంచి పాత పోస్టాఫీస్ వరకు 5.07 కి.మీ., కారిడార్–3లో భాగంగా తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకూ 6.75 కి.మీ. మేర లైట్ మెట్రో కారిడార్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఆ తరువాత రెండో విడత కింద కారిడార్–4లో కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు 30.67 కి.మీ. మేర నిర్మించనున్నారు. ఈ నాలుగు కారిడార్లలో మొత్తం 54 స్టేషన్లు, రెండు డిపోలు ఏర్పాటు చేయనున్నారు.
బీచ్ రోడ్డులో ట్రామ్ కారిడార్
బీచ్ రోడ్డులో ట్రామ్ కారిడార్ ఒక మణిహారంగా రాబోతోంది. ప్రధాన జంక్షన్ల నుంచి అభివృద్ధి చెందే ప్రాంతాలకు కూడా ట్రామ్ నడిపే యోచనలో ప్రభుత్వం ఉంది. మొత్తం 60.05 కి.మీ. మేర మోడ్రన్ ట్రామ్‌ని నడిపేందుకు 4 కారిడార్లు గుర్తించారు. కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకూ ట్రామ్ కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా స్టీల్‌ప్లాంట్ నుంచి అనకాపల్లి, ఎన్‌ఏడీ జంక్షన్ నుంచి పెందుర్తి వరకు కూడా ట్రామ్ కారిడార్ రాబోతోంది.
శివారుకు మెట్రో.. సీఎం ఆకాంక్ష
ఏపీ ఎగ్జిక్యూటివ్, ఫైనాన్షియల్ క్యాపిటల్‌గా, ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో శివారు ప్రాంతాలు కూడా కోర్ సిటీకి సమానంగా అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు అవసరం. అందుకే ఆయా ప్రాంతాలకు మెట్రో సౌకర్యం కూడా కల్పించాలన్నది సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష. అందుకు అనుగుణంగా డీపీఆర్‌లో మార్పులు, చేర్పులు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment