పరిహారంపై చర్చిస్తున్న మంత్రి ముత్తంశెట్టి, షిప్‌యార్డు సీఎండీ శరత్‌బాబు తదితరులు
సాక్షి, విశాఖపట్నం: హిందుస్థాన్ షిప్‌యార్డులో శనివారం క్రేన్ కూలిన దుర్ఘటనలో మృతిచెందిన ఉద్యోగులు, కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఎస్‌ఎల్ యాజమాన్యంతో ఆదివారం జరిపిన చర్చలు ఫలించాయి. షిప్‌యార్డు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్కొక్కరికి రూ.50 లక్షలు పరిహారం ప్రకటించేలా చేసింది. అంతకుముందు.. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు షిప్‌యార్డు సీఎండీ శరత్‌బాబుని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వం తరఫున మంత్రి కార్మికులతో మాట్లాడారు. అక్కడికి చేరుకున్న మృతుల కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. అనంతరం షిప్‌యార్డు యాజమాన్యం, కార్మిక సంఘాల నాయకులు, బాధిత కుటుంబాలతో కలిసి చర్చలు జరిపారు. (కుటుంబాలను కకావికలం చేసింది..)
షిప్‌యార్డు చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనంతగా..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పరిశ్రమల్లో ప్రమాదాలు సంభవించకుండా ముందుగానే పసిగట్టే సాంకేతికతని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు. ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన సహాయక చర్యలు, బాధిత కుటుంబాలు కోరిన విధంగా మరింత నష్టపరిహారాన్ని వారికి అందించాలని సీఎం వైఎస్ జగన్ సూచించారని మంత్రి చెప్పారు. అనంతరం పరిహారంపై సుదీర్ఘంగా చర్చించారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా.. రూ.50 లక్షలు పరిహారం ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. పరిహారంతో పాటు మృతుల్లో పర్మినెంట్ ఉద్యోగుల కుటుంబాలకు పర్మినెంట్ ఉద్యోగం, కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలకు కాంట్రాక్టు ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో వారంతా హర్షం వ్యక్తంచేశారు. దీనిపై ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వం సూచించిన మేరకు పరిహారం : సీఎండీ
షిప్‌యార్డు సీఎండీ మాట్లాడుతూ.. సంస్థ ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉన్నప్పటికీ కార్మికుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం సూచించిన పరిహారాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. బాధితులకు సంస్థ పరంగా రావాల్సిన లాంఛనాలు అందిస్తామన్నారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కూడా పాల్గొన్నారు. కాగా, శిథిలాల తొలగింపు ప్రక్రియ సోమవారం ఉదయానికి పూర్తవుతుందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment