hindustan shipyard
-
గ్రీన్‌టగ్స్ నిర్మాణంలో నంబర్ వన్ దిశగా..
సాక్షి, విశాఖపట్నం: గ్రీన్ ఇండస్ట్రీ విభాగంలో దూసుకెళ్లేలా.. హిందూస్థాన్ షిప్‌యార్డు (హెచ్ఎస్ఎల్) వడివడిగా అడుగులు వేస్తోంది. 2030 నాటికి గ్రీన్ షిప్ బిల్డింగ్‌కు భారత్ గ్లోబల్ హబ్‌గా మారాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న తరుణంలో.. హెచ్ఎస్ఎల్ కూడా అదే దారిలో పయనిస్తోంది. ఇంధన వనరుల ఆదా, కాలుష్య నియంత్రణకు అనుగుణంగా గ్రీన్‌టగ్స్ నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఒక్కో టగ్‌ను ఏడాదిలోపే పూర్తి చేసేందుకు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ.. దేశంలో నంబర్ వన్‌గా ఎదిగేలా అవకాశాల్ని అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. షిప్ బిల్డింగ్ హబ్‌గా విశాఖ విశాఖపట్టణాన్ని షిప్ బిల్డింగ్ హబ్‌గా తీర్చిదిద్దేలా రూ.19,048 కోట్లతో ఐదు భారీ యుద్ధ నౌకల నిర్మాణ పనుల్ని దక్కించుకున్న షిప్‌యార్డు, త్వరలోనే గ్రీన్టగ్ హబ్‌గా మారేందుకు ప్రణాళికలు రచిస్తోంది. 2030 నాటికి అన్ని పోర్టుల్లో గ్రీన్టగ్ల వినియోగం సంఖ్య 50 శాతానికి చేరుకోవాలని కేంద్ర జలవనరులు, పోర్టులు, జలరవాణా మంత్రిత్వ శాఖ ఆదేశించింది. టగ్‌ల ఆర్డర్లు అత్యధికంగా వచ్చే అవకాశం ఉండడంతో షిప్‌యార్డు ఆ దిశగా సన్నద్ధమవుతోంది. రెండు రకాల గ్రీన్‌టగ్స్ ఎలక్ట్రికల్ టగ్స్ నిర్మాణంలో 2026నాటికి స్వయం ప్రతిపత్తి సాధించాలని హెచ్ఎస్ఎల్ నిర్దేశించుకుంది. ఇందుకోసం ఆర్ అండ్ డీ సంస్థలు, ఎంఎస్ఎంఈలతో సమన్వయం చేసుకుంటూ రెండు రకాలైన గ్రీన్టగ్స్ను నిర్మించనుంది. 40, 80 టన్నుల టగ్స్‌ను అందించనుంది. ఎనర్జీ మేనేజ్మెంట్, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, స్టోరేజీ సిస్టమ్, హై పవర్ ఎల ్రక్టానిక్స్, హై ఎఫిషియన్సీ.. ఇలా.. భిన్నమైన టెక్నాలజీలతో వీటి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. నిర్మాణ సమయాన్ని కూడా కుదించేలా కొత్త టెక్నాలజీని వినియోగించనుంది. దీనివల్ల కేవలం 8 నుంచి 12 నెలల్లోనే గ్రీన్టగ్స్ను నౌకాయాన సంస్థలకు డెలివరీ చేయగలమని హిందుస్థాన్ షిప్‌యార్డు ధీమా వ్యక్తం చేస్తోంది. టగ్స్తో ఇవీ ఉపయోగాలు పెద్ద కార్గో షిప్‌లను లాగడానికి, బెర్త్ నుంచి సముద్రం లోపలికి నెట్టడానికి, భారీ షిప్స్‌కు భద్రత కల్పించేందుకు, అత్యవసర సమయంలో స్టాండ్‌బై నౌకగా వినియోగించడానికి టగ్‌బోట్స్‌ను ఉపయోగిస్తారు. భారీ షిప్స్‌ను లాగినప్పుడు, లేదా నెట్టినప్పుడు మాత్ర మే టగ్స్కు అధిక శక్తి అవసరమవుతుంటుంది. ఇందుకోసం డీజిల్ ఇంజిన్‌ను వినియోగిస్తారు. వీటి స్థానంలో ఎలక్ట్రిక్, సోలార్‌తో నడిచే గ్రీన్ట గ్స్ నిర్మాణానికి షిప్‌యార్డు సిద్ధమవుతోంది. నంబర్ వన్‌గా నిలవాలని... గ్రీన్టగ్స్కు క్రమేణా డిమాండ్ పెరుగుతోంది. దీంతో వాటి నిర్మాణంపై దృష్టి పెట్టాం. భారీ బ్యాటరీలు, సోలార్ ఎనర్జీ, సీఎన్జీతో నడిచే హైబ్రిడ్ టగ్స్ నిర్మించనున్నాం. ఈ టగ్స్ అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. కేవలం పోర్టులు, తీర ప్రాంతాల్లో మాత్రమే పనిచేస్తాయి. ఇప్పటికే దేశంలోని వివిధ పోర్టులు, టగ్ ఆపరేటర్లు, షిప్పింగ్ కంపెనీలతో ఆర్డర్ల కోసం సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలోనే గ్రీన్‌టగ్స్ నిర్మాణంలో నంబర్ వన్‌గా నిలుస్తాం. – కమొడర్ హేమంత్ ఖత్రి, సీఎండీ, హిందుస్థాన్ షిప్‌యార్డు -
షిప్ రిపేర్ హబ్‌గా విశాఖ.. అదానీ పోర్ట్స్ నుంచి అమెరికా షిప్స్ వరకూ..
సాక్షి, విశాఖపట్నం : ప్రపంచ దేశాలకు చెందిన సంస్థలు హిందూస్థాన్ షిప్‌యార్డుతో జతకడుతున్న నేపథ్యంలో విశాఖపట్నం షిప్‌రిపేర్ హబ్‌గా అడుగులు వేస్తోంది. అదానీ పోర్టుల నుంచి అమెరికాకు చెందిన నౌకల వరకూ.. రక్షణ దళాల నుంచి.. ఆయిల్ కార్పొరేషన్ల వరకూ.. అన్ని సంస్థలూ హెచ్ఎస్ఎల్ వైపే చూస్తున్నాయి. నిర్లక్ష్యంగా పనులు చేస్తారన్న అపప్రద నుంచి నిర్ణీత సమయానికంటే ముందుగానే మరమ్మతులు పూర్తి చేస్తారన్న స్థాయికి ఎదిగిన షిప్‌యార్డు.. ఈ ఏడాది రూ.1000 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా దూసుకెళ్తోంది. తాజాగా రూ.620 కోట్లతో సింధుఘోష్ సబ్‌మెరైన్ పనులను దక్కించుకున్న హెచ్‌ఎస్‌ఎల్‌కు మరో 3 నౌకల పనులను అప్పగించేందుకు షిప్పింగ్ కార్పొరేషన్ కూడా ఆసక్తి చూపిస్తోంది. ఎలాంటి నౌకలు, సబ్మెరైన్ల మరమ్మతులైనా రికార్డు సమయంలో పూర్తి చేస్తూ ఆయా సంస్థలకు అప్పగిస్తున్న హిందూస్థాన్ షిప్‌యార్డు దేశంలోనే అతి పెద్ద ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ 200 నౌకలు తయారు చేసిన షిప్‌యార్డు తాజాగా 2000 షిప్స్ మరమ్మతుల పనులను కూడా పూర్తి చేసింది. ఈ ఏడాది ఏకంగా రూ.20 వేల కోట్ల పనులకు సంబంధించిన కాంట్రాక్టుపై సంతకం చేయనుంది. ఐదు ఫ్లీట్ సపోర్ట్ షిప్స్(ఎఫ్ఎస్ఎస్)ని భారత నౌకాదళం, కోస్ట్‌గార్డు కోసం తయారు చేసేందుకు డిసెంబర్లో రక్షణ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకల తయారీకి సన్నద్ధమవుతోంది. సాంకేతిక సంస్కరణలు చేసుకుంటూ.. నౌకా నిర్మాణం, మరమ్మతుల విషయంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటోంది. అందుకే దేశ విదేశీ సంస్థలు షిప్‌యార్డుకు పనులు అప్పగించేందుకు ముందుకు వస్తున్నాయి. ఇండియన్ నేవీ, కోస్ట్‌గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ), డ్రెడ్జింగ్ కార్పొరేషన్(డీసీఐ), ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఐ), సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ నాటికల్ అండ్ ఇంజినీరింగ్ అండ్ ట్రైనింగ్ (సిఫ్నెట్)తో పాటు అమెరికాకు చెందిన మెక్ డెర్మాట్, సింగపూర్‌కు చెందిన అబాన్ ఆఫ్‌షోర్, అదానీ పోర్టులు, సెజ్‌లు.. ఇలా ప్రతి సంస్థా హెచ్‌ఎస్‌ఎల్‌కు పనులు అప్పగించేందుకు సుముఖత చూపుతుండటం విశేషం. పదేళ్ల తర్వాత ఓఎన్జీసీ సింధుకీర్తి సబ్‌మెరైన్ మరమ్మతుల సమయంలో షిప్యార్డుపై పడిన నిర్లక్ష్యపు మరక దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. అదే సమయంలో ఓ నౌకను మరమ్మతు కోసం ఇచ్చిన ఓఎన్జీసీ.. ఆ తర్వాత హెచ్ఎస్ఎల్ వైపు చూడలేదు. దాదాపు పదేళ్ల తర్వాత షిప్‌యార్డుకు పనులు అప్పగించేందుకు ఓఎన్జీసీ రావడం విశేషం. ఓఎన్జీసీకి చెందిన డ్రిల్ షిప్, షిప్పింగ్ కార్పొరేషన్‌కు చెందిన సాగర్ భూషణ్ పనులు చేపడుతోంది. దీంతో పాటుగా ఓఎన్జీసీ ప్లాట్‌ఫామ్ మరమ్మతుల బాధ్యతను షిప్‌యార్డుకు అప్పగించింది. అదేవిధంగా మరో మూడు షిప్పింగ్ కార్పొరేషన్ నౌకల పనులు కూడా షిప్‌యార్డుకు దక్కనున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే టెండర్లు ఖరారు కానున్నాయి. ఇలా గత మూడేళ్ల వ్యవధిలో 31 భారీ నౌకల మరమ్మతులను పూర్తి చేసింది. తాజాగా రూ.620 కోట్లతో సింధుఘోష్ సబ్‌మెరైన్ పనులను కూడా హెచ్ఎస్ఎల్ దక్కించుకుంది. 25 ఎకరాల్లో విస్తరణ పనులు షిప్‌యార్డుకు సమీపంలో ఉన్న 25 ఎకరాల్లో విస్తరణకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించి పరిశ్రమల శాఖ నుంచి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఇప్పటికే క్షేత్రస్థాయి పనులను కూడా మొదలు పెట్టింది. ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ తయారీకి అవసరమయ్యేలా 300 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పుతో స్లిప్వేని 2024 ఆగస్టు నాటికి పూర్తిచేయాలన్న లక్ష్యంతో నిర్మాణ పనులు ప్రారంభించింది. ఒకేసారి 3 నుంచి 4 నౌకలు తయారు చేసేలా మరో స్లిప్‌వే నిర్మాణానికి అడుగులు వేస్తోంది. రూ.1000 కోట్ల టర్నోవర్ లక్ష్యం దేశంలోని 14 షిప్‌యార్డులతో పోల్చి చూస్తే హెచ్ఎస్ఎల్ నాలుగో స్థానంలో ఉంది. రానున్న రెండేళ్లలో కోల్‌కతా షిప్‌యార్డ్‌ను అధిగమించి మూడుకి చేరుకోవాలనే టార్గెట్‌ను నిర్దేశించుకున్నాం. రాబోయే నాలుగేళ్లలో నంబర్ వన్‌గా నిలిచేందుకు అవసరమైన ప్రణాళికలు అమలు చేస్తున్నాం. ఎందుకంటే షిప్ బిల్డింగ్‌లో అనేక పురోగతి సాధించాం. షిప్‌యార్డు చరిత్రలో తొలిసారిగా గత ఆర్థిక సంవత్సరంలో రూ.755 కోట్లు టర్నోవర్ సాధించాం. ఈ ఏడాది రూ.1000 కోట్లు మార్కు చేరుకుంటాం. హైవాల్యూస్‌తో చేపట్టనున్న నేవీ నౌకల నిర్మాణాలతో హెచ్ఎస్ఎల్ వార్షిక టర్నోవర్ కూడా గణనీయంగా పెరగనుంది. ఇదే ఊపుతో స్వదేశీ పరిజ్ఞానాన్ని దేశీయ పరిశ్రమలను మరింతగా ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నాం. మరోవైపు ఫ్లీట్ సపోర్ట్ షిప్స్‌ను తయారు చేసేందుకు సన్నద్ధమవుతున్నాం. మూడేళ్లుగా దీనిపై కసరత్తు చేస్తున్నాం. రక్షణ మంత్రిత్వ శాఖ దీనిపై ఇటీవలే చర్చించింది. త్వరలోనే అనుమతులు వస్తాయని భావిస్తున్నాం. ఇది వస్తే విశాఖపట్నం బూమ్ ఒక్కసారిగా పెరుగుతుంది. – కమాండర్ హేమంత్ ఖత్రీ, హిందూస్థాన్ షిప్‌యార్డ్ సీఎండీ -
హిందుస్తాన్ షిప్‌యార్డ్ రికార్డ్
విశాఖపట్టణం: ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ షిప్‌యార్డ్ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 755 కోట్ల విలువైన ఉత్పత్తిని సాధించింది. కోవిడ్–19 రెండు, మూడు దశలు, పాక్షిక లాక్డౌన్లు, ఆంక్షలు తదితర వివిధ సవాళ్లలోనూ ప్రోత్సాహక పనితీరును చూపగలిగినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ హేమంత్ ఖత్రి పేర్కొన్నారు. కంపెనీకి గల మూడు విభాగాలూ ఇందుకు సహకరించినట్లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మరింత అధికంగా రూ. 1,000 కోట్ల విలువైన ఉత్పాదకతను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు. నౌకా నిర్మాణ విభాగం నుంచి రూ. 613 కోట్ల విలువైన ప్రొడక్షన్ సాధించడం ద్వారా కొత్త రికార్డ్‌కు తెరతీసినట్లు పేర్కొన్నారు. గతేడాది రూ. 50.78 కోట్ల నికర లాభం ఆర్జించగా.. రూ. 10.69 కోట్ల నిర్వహణ లాభాన్ని సాధించినట్లు తెలియజేశారు. అయితే అంతక్రితం ఏడాది(2020–21) రూ. 14 కోట్ల నికర నష్టంతోపాటు.. రూ. 73 కోట్లమేర నిర్వహణ నష్టాలు నమోదైన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. -
వైజాగ్ షిప్‌యార్డ్‌లో మేనేజర్ ఉద్యోగాలు
విశాఖపట్నంలోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హిందూస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(హెచ్ఎస్ఎల్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 53 ► పోస్టుల వివరాలు: పర్మనెంట్ ప్రాతిపదికన–18, ఒప్పంద ప్రాతిపదికన–31, ఫిక్స్డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన–04. ► పర్మనెంట్ ప్రాతిపదికన: పోస్టులు: జనరల్ మేనేజర్, అడిషనల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్. –విభాగాలు: హెచ్ఆర్, టెక్నికల్, ఫైనాన్స్. అర్హత: ఫుల్‌టైం గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► ఒప్పంద ప్రాతిపదికన: పోస్టులు: డిప్యూటీ చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ మేనేజర్, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్. –విభాగాలు: ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆగుమెంటేషన్, ఎస్ఏపీ, ఏబీఏపీ డెవలపర్, సబ్‌మెరైన్ టెక్నికల్ తదితరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌టైం ఇంజనీరింగ్ డిప్లొమా/ఇంజనీరింగ్ డిగ్రీ(బీఈ/బీటెక్)/ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. ► ఫిక్స్డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన: పోస్టులు: సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్. విభాగాలు: టెక్నికల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆగుమెంటేషన్, ఈకేఎం ప్లానింగ్ అండ్ సబ్‌మెరైన్ మేనేజ్మెంట్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్ టైం ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి. ► ఎంపిక విధానం: గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ(ఆన్లైన్) ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.08.2021 ► వెబ్సైట్: www.hslvizag.in -
50 లక్షల పరిహారం, ఒకరికి ఉద్యోగం
సాక్షి, విశాఖపట్నం: హిందుస్థాన్ షిప్‌యార్డులో శనివారం క్రేన్ కూలిన దుర్ఘటనలో మృతిచెందిన ఉద్యోగులు, కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎస్ఎల్ యాజమాన్యంతో ఆదివారం జరిపిన చర్చలు ఫలించాయి. షిప్‌యార్డు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్కొక్కరికి రూ.50 లక్షలు పరిహారం ప్రకటించేలా చేసింది. అంతకుముందు.. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు షిప్‌యార్డు సీఎండీ శరత్‌బాబుని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వం తరఫున మంత్రి కార్మికులతో మాట్లాడారు. అక్కడికి చేరుకున్న మృతుల కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. అనంతరం షిప్‌యార్డు యాజమాన్యం, కార్మిక సంఘాల నాయకులు, బాధిత కుటుంబాలతో కలిసి చర్చలు జరిపారు. (కుటుంబాలను కకావికలం చేసింది..) షిప్‌యార్డు చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనంతగా.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పరిశ్రమల్లో ప్రమాదాలు సంభవించకుండా ముందుగానే పసిగట్టే సాంకేతికతని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు. ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన సహాయక చర్యలు, బాధిత కుటుంబాలు కోరిన విధంగా మరింత నష్టపరిహారాన్ని వారికి అందించాలని సీఎం వైఎస్ జగన్ సూచించారని మంత్రి చెప్పారు. అనంతరం పరిహారంపై సుదీర్ఘంగా చర్చించారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా.. రూ.50 లక్షలు పరిహారం ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. పరిహారంతో పాటు మృతుల్లో పర్మినెంట్ ఉద్యోగుల కుటుంబాలకు పర్మినెంట్ ఉద్యోగం, కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలకు కాంట్రాక్టు ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో వారంతా హర్షం వ్యక్తంచేశారు. దీనిపై ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం సూచించిన మేరకు పరిహారం : సీఎండీ షిప్‌యార్డు సీఎండీ మాట్లాడుతూ.. సంస్థ ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉన్నప్పటికీ కార్మికుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం సూచించిన పరిహారాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. బాధితులకు సంస్థ పరంగా రావాల్సిన లాంఛనాలు అందిస్తామన్నారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కూడా పాల్గొన్నారు. కాగా, శిథిలాల తొలగింపు ప్రక్రియ సోమవారం ఉదయానికి పూర్తవుతుందని అధికారులు తెలిపారు. -
హిందూస్థాన్ షిప్‌యార్డ్ మృతుల కుటుంబాలకు భారీ పరిహారం
-
మృతుల కుటుంబాలకు భారీ పరిహారం
సాక్షి, విశాఖపట్నం : హిందూస్థాన్ షిప్‌యార్డ్ ప్రమాదంపై యాజమాన్యంతో మంత్రి అవంతి శ్రీనివాస్, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి యాభై లక్షల రూపాయల సహాయం ఇవ్వడానికి యాజమాన్యం ఒప్పుకుంది. అలాగే మృతుల కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకరించింది. (చదవండి : కుప్పకూలిన భారీ క్రేన్) కాగా, షిప్ యార్డ్ మృతులకు రూ.50లక్షల పరిహార ప్రకటనపై కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. పెద్దమొత్తంలో ఎక్స్‌గ్రేషియా ప్రకటించినందుకుగాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కార్మిక సంఘం నాయకులు మంత్రి రాజశేఖర్, బద్రీనాథ్, రఘు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, భారత రక్షణ రంగ సంస్థ ఆధీనంలో ఉన్న హిందూస్థాన్ నౌకా నిర్మాణ కేంద్రంలో శనివారం ట్రయల్ రన్ జరుగుతుండగా ఈ భారీ క్రేన్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. -
ఆ కుటుంబాలను కకావికలం చేసింది..
పాతపోస్టాఫీసు/మునగపాక/ గోపాలపట్నం/తుమ్మపాల: హిందూస్థాన్ షిప్‌యార్డ్‌లో భారీ క్రేన్ కూలిన ఘటన.. 10 మంది కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. అందమైన జీవితాలు.. ఆనందంగా సాగుతున్న వేళ.. పిడుగులాంటి ఈ వార్త.. ఆ కుటుంబాలను కకావికలం చేసింది. ఎదిగిన పిల్లలను తల్లిదండ్రులకు కాకుండా చేసింది. ముక్కు పచ్చలారని చిన్నారులకు తండ్రి ప్రేమను దూరం చేసింది. అన్యోన్యంగా సాగుతున్న దాంపత్య జీవితంలో పెను తుపాను సృష్టించింది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వారు ఇలా అర్ధాంతరంగా దుర్మరణం చెందడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ ఘటనలో మరణించిన వారి మృతదేహాలను కేజీహెచ్ మార్చురీలో భద్రపరిచారు. మృతుల బంధువులు, స్నేహితులు, కుటుంబసభ్యుల రోదనలతో ఆ ప్రాంతం నిండిపోయింది. వారిని చూసిన వారు కూడా కన్నీరుమున్నీరయ్యారు. షిప్‌యార్డ్ దుర్ఘటనపై కేసు నమోదు మల్కాపురం (విశాఖ పశ్చిమ): షిప్‌యార్డ్‌లో శనివారం జరిగిన ఘోర ప్రమాదంపై సెక్యూరిటీ ఆఫీసర్ సుశీల్‌కుమార్ మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుజరాత్ రాష్ట్రానికి చెందిన అనుపమ క్రేన్ కంపెనీ యజమానిపై, గ్రీన్ ఫీల్డ్ కంపెనీ యజమానిపై సెక్షన్ 304ఏ కేసు నమోదు చేశారు. ఈ కేసు సౌత్ ఏసీపీ టేకు రామ్మోహన్రావు నేతృత్వంలో మల్కాపురం సీఐ కూన దుర్గాప్రసాద్ దర్యప్తు చేస్తున్నారు. చిన్నాన్న వద్దే పెరిగాడు కంచరపాలెం ఊరశ్వి థియేటర్ సమీపంలో నివాసం ఉంటున్న బహదూర్ షా చైతన్య తల్లిదండ్రులు చిన్నతనంలోనే కోల్పోయారు. చైతన్యకు ఇద్దరు అక్కలు ఉన్నారు. వీరందరినీ చైతన్య చిన్నాన్న జగన్మోహనరావు తన ఇద్దరు కూతుళ్లతో పాటు పెంచి పెద్ద చేశారు. ఇంటిలో ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో అతని రోదనకు అంతులేకుండా పోయింది.గ్రీన్ఫీల్డ్లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. బహదూర్షా చైతన్య (25) మృతుడు ఎవరూ సమాచారం ఇవ్వలేదు చిన్న తనం నుంచి చైతన్యను నేనే పెంచి పెద్ద చేశాను. నా కొడుకు మరణించిన విషయాన్ని టీవీలో చూసి తెలుసుకుని ఇక్కడకు వచ్చాను. షిప్‌యార్డ్ కంపెనీ సిబ్బంది గానీ, నా కొడుకు పనిచేస్తున్న కాంట్రాక్ట్ కంపెనీ సిబ్బంది గానీ సమాచారం ఇవ్వలేదు. ఎదిగిన కొడుకు మరణించడంతో నా కుటుంబం విషాదంలో మునిగిపోయింది. –జగన్మోహనరావు, చైతన్య చిన్నాన్న ఆరోగ్యం బాగాలేదు.. సెలవు పెడతానన్నారు మృతుడు పీలా శివకుమార్ (35) కాంట్రాక్ట్ లేబర్. ఆయనకు భార్య సుమ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమెతో పాటు శివకుమార్ సోదరి శ్రీదేవి కేజీహెచ్ మార్చురీ వద్దకు చేరుకున్నారు. భర్త మరణంతో ఇద్దరు పిల్లలతో తాను రోడ్డున పడ్డానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 16 ఏళ్లుగా కాంట్రాక్టు లేబర్‌గా పనిచేస్తున్నారని చెప్పారు. ఈ రోజు ఆరోగ్యం బాగాలేదు.. ఉద్యోగానికి సెలవు పెడతానని చెప్పారు. కానీ తోటి స్నేహితులు ఉద్యోగానికి వెళ్లిపోతున్నారని చెప్పి వెళ్లారని.. ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని రోదించారు. గోపాలపట్నంలోని జయప్రకాష్ నగర్లో పిల్లా శివకుమార్ కుటుంబం నివసిస్తోంది. ఆయన మృతి చెందడంతో ఆ కాలనీలో విషాదచాయలు అలముకున్నాయి. మంచివాడిగా పేరు ఐబీసీ వెంకటరమణ (42) 13 ఏళ్లుగా షిప్‌యార్డ్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నారు. మంచివాడన్న పేరు సంపాదించుకున్నారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరంతా గాజువాకలో నివాసం ఉంటున్నారు. టీవీలో చూసి షాక్ అయ్యాను ఎప్పటిలా ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లిపోయారు. మధ్యాహ్నం టీవీలో విషయం చూసి సంఘటనా స్థలంలో నా భర్త ఉన్నాడో లేడో తెలుసుకోడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నా బంధువులు మార్చురీ వద్దకు వచ్చి విషయం తెలుసుకుని చెబితే వచ్చాను. – సత్యశ్రీ నాగలక్ష్మి, మృతుడు వెంకటరమణ భార్య విషాదంలో ఉమ్మలాడ ఉమ్మలాడ గ్రామానికి చెందిన మొల్లేటి వెంకట సూర్యనారాయణ, కాంతమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు సత్యనారాయణ డాక్‌యార్డులో పనిచేస్తున్నాడు. రెండో కుమారుడు ఎం.ఎన్.వెంకటరావు (35). నాగేశ్వరరావు కూడా అని పిలుస్తుంటారు. ఆరేళ్ల పాటు దుబాయ్‌లో వెల్డర్‌గా పనిచేసి కుటుంబానికి చేదోడువాదోడుగా ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చాక డాక్‌యార్డులో రెండేళ్ల కిందట వెల్డర్‌గా చేరాడు. ఇటీవలే డాక్‌యార్డులో పని మానేసి.. షిప్‌యార్డ్‌కు కాంట్రాక్ట్ పనులు చేపట్టే గ్రీన్‌ఫీల్డ్ కంపెనీలో చేరాడు. శనివారం జరిగిన ప్రమాదంలో నాగేశ్వరరావు ప్రాణాలు విడిచాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలు ముకున్నాయి. అందరితో సఖ్యతగా ఉండే నాగేశ్వరరావు మృతి చెందడం పట్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచిన నాగేశ్వరరావు మృతి చెందడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అతని కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడు నాగేశ్వరరావుకు భార్య లలిత, అయిదేళ్ల దమరుకేష్, మూడేళ్ల శ్రీజలు ఉన్నారు. అభం శుభం తెలియని చిన్నారులను చూసిన వారంతా కంటతడి పెడుతున్నారు. వైఎస్సార్సీపీ ఉమ్మలాడ సర్పంచ్ అభ్యర్థి సూరిశెట్టి రామకృష్ణ విషయం తెలిసిన వెంటనే కేజీహెచ్‌కు వెళ్లారు. విషాదవదనంలో కుటుంబసభ్యులు (ఇన్సెట్) క్రేన్ ప్రమాదంలో మృతి చెందిన నాగేశ్వరరావు కుటుంబం రోడ్డున పడింది షిప్‌యార్డ్ కాలనీలో భార్య, ఇద్దరు పిల్లలతో పొదినాను భాస్కరరావు(35) నివాసం ఉంటున్నాడు. లీడ్ ఇంజినీరింగ్ సంస్థలో మూడేళ్లుగా కాంట్రాక్ట్ పద్దతిపై పనిచేస్తున్నాడు. భాస్కరరావు మరణంతో ఆ కుంటుంబం రోడ్డున పడింది. – వెంకటేశ్వరరావు, భాస్కరరావు సోదరుడు మిన్నంటిన రోదనలు షిప్‌యార్డ్‌లో జరిగిన ప్రమాదంలో అనకాపల్లి మండలం కూండ్రం గ్రామానికి చెందిన పల్లా నాగదేముళ్లు (35) దుర్మరణం చెందాడు. అందరితో సరదాగా ఉండే నాగు షిప్‌యార్డు ఫిట్టర్‌గా విధులు నిర్వహిస్తూ.. మృతి చెందాడన్న వార్తతో గ్రామస్తులు శోకసంద్రంలో మునిగారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నాగుకు ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. ప్రస్తుతం భార్య, ఇద్దరు పిల్లలతో విశాఖలోనే నివాసం ఉంటున్నాడు. తల్లిదండ్రులు పల్లా సుబ్రహ్మణ్యం, దేముడమ్మతో పాటు సోదరుడు, సోదరి కూండ్రంలోనే ఉంటున్నారు. కుటంబానికి పెద్ద దిక్కుగా ఉండే కుమారుడు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కూండ్రం తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహిస్తామని గ్రామస్తులు తెలిపారు. ఎలా బతుకుతారో.. కంటుముచ్చు సత్తిరాజు (51) గతంలో పని చేసిన ఎండీ సొసైటీ నుంచి ఎల్ సిరీస్ కంపెనీలోకి మారాడు. అతని తండ్రి ప్రమాదవశాత్తూ గతంలో చనిపోతే ఆ ఉద్యోగాన్ని సత్తిరాజుకు ఇచ్చారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలతో మల్కాపురంలో కాపురం ఉంటున్నాడు. 30 ఏళ్లుగా కంపెనీలో పనిచేసినా ఏమాత్రం వెనకేయలేదని, రేపటి నుంచి భార్యా బిడ్డలు ఎలా బతుకుతారో అర్థం కావడం లేదని అతని తమ్ముడు లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. షిప్‌యార్డ్ ప్రమాద బాధితులను ఆదుకోండి: ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మద్దిలపాలెం(విశాఖ తూర్పు): హిందూస్థాన్ షిప్‌యార్డ్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలియగానే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ.. సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. త్వరగా బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. మృతి చెందిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. -
షిప్ యార్డు ప్రమాద ఘటనపై రెండు కమిటీలు
విశాఖపట్నం: హిందూస్తాన్ షిప్ యార్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుని పదిమంది మృత్యువాత పడ్డారు. శనివారం భారీ క్రేన్ ట్రయల్ నిర్వహిస్తుండగా అది కుప్పకూలడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ముందుగా పదకొండు మంది మృతి చెందినట్టు భావించిన సహాయ సిబ్బంది పూర్తిగా శిధిలాలు తొలగించడంతో 10 మృతదేహాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తులు వెంకట్రావు, చైతన్య, రమణ, పి.వి. రత్నం, పి నాగ దేవుళ్ళు, సత్తిరాజు, శివ కుమార్, కాకర్ల ప్రసాద్, జగన్, పి భాస్కర్ లుగా గుర్తించారు. (హిందుస్తాన్ షిప్ యార్డ్‌లో ఘోర ప్రమాదం) మృతుల్లో నలుగురు హిందుస్తాన్ షిప్ యార్డ్ ఉద్యోగులు, ముగ్గురు ఎం ఎస్ గ్రీన్ ఫీల్డ్ ఉద్యోగులు,ఇద్దరు లీడ్ ఇంజినీరింగ్ కంపెనీ ఉద్యోగులు, మరొకరు ఎమ్మెస్ స్క్వాడ్ సెవెన్ కంపెనీ ఉద్యోగి ఉన్నారు. షిప్ యార్డు ప్రమాదంపై మల్కాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యాయి. ఈ ప్రమాద ఘటనపై విచారణకు రెండు కమిటీలు ఏర్పాటు చేశారు. షిప్ యార్డ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఓ కమిటీ, ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మరో కమిటీని ఏర్పాటు చేశారు. ప్రమాదంపై ఏర్పాటు చేసిన రెండు కమిటీలు వారం రోజుల్లోగా నివేదికకు ఇవ్వాలని గడువు నిర్దేశించారు. (హిందుస్తాన్ షిప్ యార్డు ప్రమాదంపై సీఎం జగన్ ఆరా) -
విశాఖ ఘటన బాధాకరం: సోము వీర్రాజు
సాక్షి, అమరావతి: విశాఖ క్రేన్ కూలిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందుస్థాన్ పిప్యార్డ్ లిమిటెడ్‌లో జరిగిన క్రేన్ ప్రమాద ఘటన తనను తీవ్రంగా బాధించిందన్నారు. ఈ ఘటనలో సహయక చర్యల్లో పాల్గొనాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆయన పిలుపు నిచ్చారు. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: హిందుస్తాన్ షిప్ యార్డ్‌లో ఘోర ప్రమాదం) సిబ్బంది, సందర్శకులు కూడా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. తమ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్, ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యల్లో పాల్గొనాలని సూచించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని కోరతామని ఆయన తెలిపారు. -
విశాఖ: హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో ప్రమాదం
-
హిందుస్తాన్ షిప్ యార్డ్‌లో ఘోర ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: హిందూస్తాన్ షిప్ యార్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. క్రేన్ ద్వారా లోడింగ్ పనులు పరిశీలిస్తుండగా క్రేన్ కుప్పకూలిపోవడంతో పదిమంది కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై విచారిస్తున్నారు. ప్రమాద ఘటనపై మంత్రి అవంతి ఆరా.. షిప్‌యార్డులో ప్రమాదంపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరా తీశారు. క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని ఆర్డీవోకు ఫోన్ ద్వారా సూచించారు. హిందుస్తాన్ షిప్ యార్డ్ వద్దరక్షణ శాఖ ఉద్యోగులు సహాయ చర్యలు చేపట్టారు -
షిప్‌యార్డుకు 15 వేల కోట్ల ఆర్డర్లు
2016–17లో లాభం రూ.53.77 కోట్లు రికార్డు స్థాయిలో 629 కోట్ల టర్నోవర్ షిప్‌యార్డు అమ్మకం వార్తలు అవాస్తవం హెచ్ఎస్ఎల్ సీఎండీ శరత్‌బాబు సాక్షి, విశాఖపట్నం: రక్షణరంగంలో ఉన్న విశాఖ హిందుస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్) ఆర్థిక ప్రతికూలతలను అధిగమించి లాభాల బాట పడుతోంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.53.77 కోట్ల లాభాన్ని ఆర్జించింది. హెచ్ఎస్ఎల్ ఏర్పాటై 65 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దాని ప్రగతి, ఒప్పందాలు, ఆర్డర్లు తదితర వివరాలను సీఎండీ రియర్ అడ్మిరల్ ఎల్.వి.శరత్‌బాబు బుధవారమిక్కడ విలేకరులకు తెలియజేశారు. 75 ఏళ్ల షిప్‌యార్డు చరిత్రలో తొలిసారిగా 2016–17లో రికార్డు స్థాయిలో రూ.629 కోట్ల టర్నోవర్‌ను సాధించినట్టు వెల్లడించారు. షిప్‌యార్డుకు ఇటీవల రెండు భారీ ఆర్డర్లు వచ్చాయని, వీటిలో ఒకటి రూ.10 వేల కోట్లు, మరొకటి రూ.5 వేల కోట్ల విలువ చేస్తాయని తెలియజేశారు. ‘‘ఇవి నేవీ, కోస్టుగార్డు నౌకల నిర్మాణానికి సంబంధించినవి. మరోవంక భారత నావికాదళానికి రూ.2500 కోట్ల విలువైన రెండు మినీ సబ్‌మెరైన్ వంటి స్పెషల్ ఆపరేషన్ వెస్సల్స్‌ను (ఎస్ఓవీ) నిర్మించి ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకారం కూడా కుదిరింది. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ఒప్పందాలు జరుగుతాయి’’ అని శరత్‌బాబు వివరించారు. హ్యుందాయ్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఐదు నౌకలను నిర్మించాల్సి ఉందన్నారు. వీటిలో ఒకటి కొరియాలోనూ, మిగిలిన నాలుగు ఇక్కడ షిప్యార్డులోనూ నిర్మిస్తామని, ఈ ప్రాజెక్టు విలువ రూ.9,800 కోట్లని తెలిపారు. అమ్మకం వార్తలు అబద్ధం.. హిందుస్తాన్ షిప్‌యార్డును రిలయన్స్‌కో, మరొకరికో విక్రయిస్తున్నారని వస్తున్న వార్తలు పచ్చి అబద్ధమని సీఎండీ స్పష్టం చేశారు. ఈ ప్రచారం వల్ల షిప్‌యార్డు ప్రతిష్టకు భంగం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సార్ కేసులో షిప్‌యార్డు ఆస్తుల అటాచ్ చేస్తూ జిల్లా కోర్టు ఆదేశాలివ్వడం నిజమేనన్నారు. ‘‘దీనిపై హైకోర్టుకెళ్లాం. 8 వారాలపాటు స్టే ఇచ్చింది. రూ.200 కోట్ల విలువైన ఈ వ్యవహారంలో ఓఎన్జీసీ, ఎస్సార్ ఆయిల్లతో చాన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. త్వరలోనే పరిష్కారమవుతుందన్న నమ్మకం ఉంది’’ అని చెప్పారు. విలేకరుల సమావేశంలో డైరెక్టర్లు హేమంత్ ఖత్రి, ఏఎస్ మిత్ర, పీఎస్ఎన్ శాలిహ, హెచ్ఆర్ జీఎం చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
యుద్ధ నౌక జలప్రవేశం
మల్కాపురం(విశాఖ): హిందుస్థాన్ షిప్‌యార్డ్ నిర్మించిన యుద్ధనౌక(వీసీ11184) సోమవారం జలప్రవేశం చేసింది. భారత రక్షణ శాఖ కోసం నిర్మించిన ఈ నౌకను సముద్ర అంతర్భాగంలో పరిశోధనల నిమిత్తం వినియోగించనున్నారు. శత్రువుల సమాచారం అతి సులువుగా తెలుసుకొనే విధంగా ఈ నౌకను రూపొందించినట్లు సమాచారం. 2014లో దీని నిర్మాణానికి ఆర్డర్ తీసుకున్న షిప్‌యార్డ్ నిర్ణీత సమయానికంటే ముందుగానే నౌకను సిద్ధం చేసింది. రూ.1,500 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ నౌకను స్థానిక షిప్‌యార్డ్ అధికారులు జలప్రవేశం చేయించారు. అయితే ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచారు. -
గన్ మెటల్ దొంగలు అరెస్టు
గాజువాక: విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్‌లో గన్ మెటల్ చోరీ చేసిన ఏడుగురు దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 28 లక్షలు విలువ చేసే గన్ మెటల్‌తో పాటు బ్రాంజ్పైప్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు విశాఖ రెండవ జోన్ డీసీపీ రాంగోపాల్ నాయక్ శుక్రవారం విలెకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. అరెస్ట్ అయిన ఏడుగురిలో ఇద్దరిపై గతంలో జరిగిన ఓ హత్య కేసుతో సంబంధం ఉందని.. మరో ఇద్దరి పేర రౌడీషీట్ ఉందని ఆయన తెలిపారు. కాగా వీరికి షిప్ యార్డు సిబ్బంది కూడా సహకరించారని అనుమానిస్తున్న పోలీసులు ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ మెటల్ సబ్ మెరైన్ల నిర్మాణంలో వాడతారని ఆయన తెలిపారు.