విశాఖపట్టణం: ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ షిప్‌యార్డ్ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 755 కోట్ల విలువైన ఉత్పత్తిని సాధించింది. కోవిడ్–19 రెండు, మూడు దశలు, పాక్షిక లాక్‌డౌన్‌లు, ఆంక్షలు తదితర వివిధ సవాళ్లలోనూ ప్రోత్సాహక పనితీరును చూపగలిగినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ హేమంత్ ఖత్రి పేర్కొన్నారు. కంపెనీకి గల మూడు విభాగాలూ ఇందుకు సహకరించినట్లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మరింత అధికంగా రూ. 1,000 కోట్ల విలువైన ఉత్పాదకతను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు. నౌకా నిర్మాణ విభాగం నుంచి రూ. 613 కోట్ల విలువైన ప్రొడక్షన్ సాధించడం ద్వారా కొత్త రికార్డ్‌కు తెరతీసినట్లు పేర్కొన్నారు. గతేడాది రూ. 50.78 కోట్ల నికర లాభం ఆర్జించగా.. రూ. 10.69 కోట్ల నిర్వహణ లాభాన్ని సాధించినట్లు తెలియజేశారు. అయితే అంతక్రితం ఏడాది(2020–21) రూ. 14 కోట్ల నికర నష్టంతోపాటు.. రూ. 73 కోట్లమేర నిర్వహణ నష్టాలు నమోదైన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment