షిప్‌యార్డ్‌ అంటే నేషనల్‌ అనుకుంటివా.. ఇంటర్నేషనల్‌.! | Shipyard attracts international business with foreign ship repairs: Andhra pradesh | Sakshi
Sakshi News home page

షిప్‌యార్డ్‌ అంటే నేషనల్‌ అనుకుంటివా.. ఇంటర్నేషనల్‌.!

Published Tue, Feb 4 2025 2:50 AM | Last Updated on Tue, Feb 4 2025 2:50 AM

Shipyard attracts international business with foreign ship repairs: Andhra pradesh

దేశంలోనే సుప్రీం షిప్‌యార్డుగా ఎదిగిన హెచ్‌ఎస్‌ఎల్‌

నౌకా నిర్మాణం, మరమ్మతుల్లో అంతర్జాతీయ ఖ్యాతి 

అంతర్జాతీయ మార్కెట్‌పైనా దృష్టి.. తొలుత ఆగ్నేయాసియా దేశాలపై ఫోకస్‌ 

సబ్‌మెరైన్‌ పునర్నిర్మాణ ప్రాజెక్టు కోసం వియత్నాంతో చర్చలు 

ఫిలిప్పీన్స్‌తోనూ ఒప్పందం కోసం యత్నాలు 

ఇప్పటికే విదేశీ నౌకల మరమ్మతులతో అంతర్జాతీయ వ్యాపారాన్ని ఆకర్షించిన షిప్‌యార్డ్‌

హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌.. విశాఖపట్నంలోని మేటి నౌకా నిర్మాణ కేంద్రమిది. వాణిజ్యపరంగా ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్న ఈ షిప్‌యార్డు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. 200కు పైగా భారీ నౌకల నిర్మాణం తోపాటు 2000కు పైగా నౌకలు, పలు నావికాదళ జలాంతర్గాములకు మరమ్మతులు చేసిన ఘనత ఈ షిప్‌యార్డుది. ఇండస్ట్రీ విభాగంలో దూసుకెళ్లేలా.. సాంకేతిక సంస్కరణలు చేసుకుంటూ రూ.20 వేల కోట్ల పనుల్ని సొంతం చేసుకొని.. దేశంలోనే సుప్రీం షిప్‌యార్డుగా రూపొందింది. నౌకా నిర్మాణమైనా, మరమ్మతులైనా సకాలంలో పూర్తిచేయడం ఈ సంస్థ విశిష్టత. దేశీయ నౌకల తయారీలో మేటిగా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు అంతర్జాతీయంగా ఆర్డర్లు పొందేందుకు కృషి చేస్తోంది. ముందుగా ఆగ్నేయాసియా దేశాలకు రక్షణ ఉత్పత్తుల ప్రధాన ఎగుమతిదారుగా నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది.          – సాక్షి, విశాఖపట్నం

రూ.20 వేల కోట్ల విలువైన ఆర్డర్లు
ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకా నిర్మాణానికి హిందుస్థాన్‌ షిప్‌యార్డు అడుగులు వేస్తోంది. భారత నౌకా దళం, కోస్ట్‌గార్డ్‌ కోసం ఐదు ఫ్లీట్‌ సపోర్ట్‌ షిప్స్‌ (ఎఫ్‌ఎస్‌ఎస్‌)ని తయారు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖతో ఒప్పం­దం కుదుర్చుకుంది. అత్యున్నత ప్రమాణాలతో ఈ నౌకలను నిర్మించనుంది. 45 మిలియన్‌ టన్నుల డిస్‌ప్లేస్‌మెంట్‌ సామర్థ్యమున్న నౌకల తయారీ ప్రక్రియను కూడా ప్రారంభించింది. దీంతో వార్షిక టర్నోవర్‌ కూడా గణనీయంగా పెరిగింది. గత ఆరి్థక సంవత్సరంలో హెచ్‌ఎస్‌ఎల్‌ చరిత్రలోనే తొలిసారిగా రూ.1,413 కోట్ల టర్నోవర్‌తో రూ.119 కోట్ల లాభాలు ఆర్జించింది.

ఈ ఏడాది ఏకంగా రూ.20 వేల కోట్ల విలువైన ఆర్డర్లు కూడా దక్కించుకుంది. ఇదే ఊపుతో అంతర్జాతీయ మార్కె­ట్‌పై దృష్టి సారించింది. ఇప్పటికే వివిధ దేశాల యుద్ధ నౌకల మరమ్మతుల్ని విజయవంతంగా నిర్వహిస్తున్న హెచ్‌ఎస్‌ఎల్‌... ఇప్పుడు విదేశీ జలాంతర్గాముల పునర్నిర్మాణ పనులకూ సిద్ధమవుతోంది. తొలి ప్రయత్నంగా ఆగ్నేయాసియాలోని దేశా­లపై దృష్టి సారించింది. వియత్నాం దేశ జలాంతర్గాముల పునర్నిర్మాణం  కోసం వియత్నాం పీపుల్స్‌ నేవీ (వీపీఎన్‌)తో ఒప్పందానికి చర్చలు జరుపుతోంది. అదేవిధంగా ఫిలిప్పీన్స్‌తోనూ చర్చలు జరుపుతోంది.  

విశాఖ కేంద్రంగా అంతర్జాతీయ వాణిజ్యం దిశగా..
విదేశీ నౌకల మరమ్మతులతో అంతర్జాతీయ వ్యా­పా­రాన్ని ఆకర్షించిన ఈ షిప్‌యార్డు.. ఇప్పుడు విశా­ఖపట్నం కేంద్రంగా అంతర్జాతీయ వాణిజ్యాని­కీ సిద్ధమవుతోంది. 2021లో 17,000 టన్నుల విదే­శీ నౌకని డాక్‌ చేసి విజయవంతంగా మరమ్మతులు పూర్తిచేసింది. భారత్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో తొలిసారిగా నిర్మించిన ఓషన్‌ సరై్వలెన్స్‌ షిప్‌ (ఓఎస్‌ఎస్‌) ఐఎన్‌ఎస్‌ ధృవ్‌ని నిర్మించిన హెచ్‌ఎస్‌ఎల్‌.. 2022లో 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో డైవింగ్‌ సపోర్ట్‌ వెసల్స్‌ ఐఎన్‌ఎస్‌ నిస్తార్, ఐఎన్‌ఎస్‌ నిపుణ్‌ యుద్ధ నౌకల్ని నిర్మించి సత్తా చాటింది. ఇప్పుడు మరిన్ని అంతర్జాతీయ నౌకల నిర్మాణానికి వివిధ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది.

షిప్‌ బిల్డింగ్‌ హబ్‌గా వైజాగ్‌
దేశంలోనే కాకుండా.. విదేశాల్లోనూ హెచ్‌ఎస్‌ఎల్‌ సత్తా చాటేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాం. పెరుగుతున్న ఒప్పందాలకు అనుగుణంగా షిప్‌యార్డుని ఆధునికీకరిస్తున్నాం. రానున్న మూడేళ్లలో రూ.1,000 కోట్లతో షిప్‌యార్డు ఆధునికీకరణకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఫ్లీట్‌ షిప్స్‌ తయారీకి రక్షణ మంత్రిత్వ శాఖతో కుదర్చుకున్న ఒప్పందం షిప్‌యార్డు భవిష్యత్తుని మార్చబోతోంది. ఈ నౌకల తయారీ ద్వారా అనుబంధ పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈలకు కూడా అవకాశం లభిస్తుంది. నౌకల తయారీలో దాదాపు 90 శాతం వరకూ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన పరికరాలు, సామగ్రిని వినియోగిస్తాం.

దేశీయ నౌకల నిర్మాణంపైనే కాకుండా అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాలపైనా దృష్టి సారించాం. సబ్‌మెరైన్ల నిర్మాణం, మరమ్మతుల సామర్థ్యాన్ని మరింతగా పెంచుకొనేందుకు, అత్యాధునిక సదుపాయాల కోసం రష్యాతోనూ సమగ్ర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. కేవలం షిప్‌ రిపేర్‌ హబ్‌గా కాకుండా.. షిప్‌ బిల్డింగ్‌ హబ్‌గా విశాఖపట్నంని తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నాం. – కమొడర్‌ హేమంత్‌ ఖత్రి, సీఎండీ, హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement