సాక్షి, విశాఖపట్నం: గ్రీన్ ఇండస్ట్రీ విభాగంలో దూసుకెళ్లేలా.. హిందూస్థాన్ షిప్‌యార్డు (హెచ్‌ఎస్‌ఎల్) వడివడిగా అడుగులు వేస్తోంది. 2030 నాటికి గ్రీన్ షిప్ బిల్డింగ్‌కు భారత్ గ్లోబల్ హబ్‌గా మారాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న తరుణంలో.. హెచ్‌ఎస్‌ఎల్ కూడా అదే దారిలో పయనిస్తోంది. ఇంధన వనరుల ఆదా, కాలుష్య నియంత్రణకు అనుగుణంగా గ్రీన్‌టగ్స్ నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఒక్కో టగ్‌ను ఏడాదిలోపే పూర్తి చేసేందుకు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ.. దేశంలో నంబర్ వన్‌గా ఎదిగేలా అవకాశాల్ని అందిపుచ్చుకోవాలని భావిస్తోంది.
షిప్ బిల్డింగ్ హబ్‌గా విశాఖ
విశాఖపట్టణాన్ని షిప్ బిల్డింగ్ హబ్‌గా తీర్చిదిద్దేలా రూ.19,048 కోట్లతో ఐదు భారీ యుద్ధ నౌకల నిర్మాణ పనుల్ని దక్కించుకున్న షిప్‌యార్డు, త్వరలోనే గ్రీన్‌టగ్ హబ్‌గా మారేందుకు ప్రణాళికలు రచిస్తోంది. 2030 నాటికి అన్ని పోర్టుల్లో గ్రీన్‌టగ్‌ల వినియోగం సంఖ్య 50 శాతానికి చేరుకోవాలని కేంద్ర జలవనరులు, పోర్టులు, జలరవాణా మంత్రిత్వ శాఖ ఆదేశించింది. టగ్‌ల ఆర్డర్లు అత్యధికంగా వచ్చే అవకాశం ఉండడంతో షిప్‌యార్డు ఆ దిశగా సన్నద్ధమవుతోంది.
రెండు రకాల గ్రీన్‌టగ్స్
ఎలక్ట్రికల్ టగ్స్ నిర్మాణంలో 2026నాటికి స్వయం ప్రతిపత్తి సాధించాలని హెచ్‌ఎస్‌ఎల్ నిర్దేశించుకుంది. ఇందుకోసం ఆర్ అండ్ డీ సంస్థలు, ఎంఎస్‌ఎంఈలతో సమన్వయం చేసుకుంటూ రెండు రకాలైన గ్రీన్‌టగ్స్‌ను నిర్మించనుంది. 40, 80 టన్నుల టగ్స్‌ను అందించనుంది. ఎనర్జీ మేనేజ్‌మెంట్, బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, స్టోరేజీ సిస్టమ్, హై పవర్ ఎల ్రక్టానిక్స్, హై ఎఫిషియన్సీ.. ఇలా.. భిన్నమైన టెక్నాలజీలతో వీటి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. నిర్మాణ సమయాన్ని కూడా కుదించేలా కొత్త టెక్నాలజీని వినియోగించనుంది. దీనివల్ల కేవలం 8 నుంచి 12 నెలల్లోనే గ్రీన్‌టగ్స్‌ను నౌకాయాన సంస్థలకు డెలివరీ చేయగలమని హిందుస్థాన్ షిప్‌యార్డు ధీమా వ్యక్తం చేస్తోంది.
టగ్స్‌తో ఇవీ ఉపయోగాలు
పెద్ద కార్గో షిప్‌లను లాగడానికి, బెర్త్ నుంచి సముద్రం లోపలికి నెట్టడానికి, భారీ షిప్స్‌కు భద్రత కల్పించేందుకు, అత్యవసర సమయంలో స్టాండ్‌బై నౌకగా వినియోగించడానికి టగ్‌బోట్స్‌ను ఉపయోగిస్తారు. భారీ షిప్స్‌ను లాగినప్పుడు, లేదా నెట్టినప్పుడు మాత్ర మే టగ్స్‌కు అధిక శక్తి అవసరమవుతుంటుంది. ఇందుకోసం డీజిల్ ఇంజిన్‌ను వినియోగిస్తారు. వీటి స్థానంలో ఎలక్ట్రిక్, సోలార్‌తో నడిచే గ్రీన్‌ట గ్స్ నిర్మాణానికి షిప్‌యార్డు సిద్ధమవుతోంది.
నంబర్ వన్‌గా నిలవాలని...
గ్రీన్‌టగ్స్‌కు క్రమేణా డిమాండ్ పెరుగుతోంది. దీంతో వాటి నిర్మాణంపై దృష్టి పెట్టాం. భారీ బ్యాటరీలు, సోలార్ ఎనర్జీ, సీఎన్‌జీతో నడిచే హైబ్రిడ్ టగ్స్ నిర్మించనున్నాం. ఈ టగ్స్ అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. కేవలం పోర్టులు, తీర ప్రాంతాల్లో మాత్రమే పనిచేస్తాయి. ఇప్పటికే దేశంలోని వివిధ పోర్టులు, టగ్ ఆపరేటర్లు, షిప్పింగ్ కంపెనీలతో ఆర్డర్ల కోసం సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలోనే గ్రీన్‌టగ్స్ నిర్మాణంలో నంబర్ వన్‌గా నిలుస్తాం. – కమొడర్ హేమంత్ ఖత్రి, సీఎండీ, హిందుస్థాన్ షిప్‌యార్డు
Comments
Please login to add a commentAdd a comment