రసపట్టులో రెండో టెస్టు.. గెలుపు తలుపు తట్టేదెవరు! | India 255 all out in the second innings | Sakshi
Sakshi News home page

రసపట్టులో రెండో టెస్టు.. గెలుపు తలుపు తట్టేదెవరు!

Published Mon, Feb 5 2024 4:03 AM | Last Updated on Mon, Feb 5 2024 8:52 AM

India 255 all out in the second innings - Sakshi

విశాఖ స్పోర్ట్స్‌: నేడో రేపో ఫలితం గ్యారంటీ! ఎలాంటి ‘డ్రా’ మలుపులు లేకుండా ఈ టెస్టును బౌలర్లు నడిపిస్తున్నారు. నాలుగో రోజు కూడా బౌలింగ్‌ కుదిరితే భారత్‌ గెలుపు తలుపు తట్టడం ఖాయమవుతుంది. అలాగని టెస్టుల్లో ఇంగ్లండ్‌ ‘బజ్‌బాల్‌’ ఆటతీరును తక్కువ అంచనా వేస్తే మాత్రం హైదరాబాద్‌లో ఎదురైన చేదు ఫలితం తప్పదు. ఈ ప్రమాదం నుంచి బయట పడాలంటే ఇంగ్లండ్‌ స్పిన్‌ మ్యాజిక్‌తో ఎలాగైతే భారత రెండో ఇన్నింగ్స్‌ను బోల్తా కొట్టించిందో... మన స్పిన్నర్లు అదే మాయాజాలంతో దెబ్బకుదెబ్బ తీయాల్సిందే! వికెట్ల వేట భారత్‌ను గెలిపిస్తుందా... లేదంటే ఇంగ్లండ్‌ పరుగుల బాట లక్ష్యానికి చేరుస్తుందా అనేది నాలుగో రోజే తేలుతుంది. 

రెండు రోజుల ఆతిథ్య జట్టు ఆధిపత్యానికి ఎట్టకేలకు మూడో రోజు బ్రేక్‌ పడింది. భారత రెండో ఇన్నింగ్స్‌ను ఇంగ్లండ్‌ బౌలర్లు సమష్టిగా దెబ్బ తీశారు. చేతిలో 10 వికెట్లున్న టీమిండియా మరో భారీ స్కోరు చేస్తుందనుకుంటే పర్యాటక బౌలర్లు సమర్థంగా కట్టడి చేశారు. ఇంగ్లండ్‌ స్పిన్‌ సవాలుకు ఎదురు నిలిచిన ఒకే ఒక్కడు శుబ్‌మన్‌ గిల్‌ (147 బంతుల్లో 104; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకం సాధించడంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 78.3 ఓవర్లలో 255 పరుగుల వద్ద ఆలౌటైంది.

మిగతా వారిలో అక్షర్‌ పటేల్‌ (84 బంతుల్లో 45; 6 ఫోర్లు) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఏమాత్రం అనుభవం లేని స్పిన్‌త్రయం టామ్‌ హార్ట్‌లీ (4/77), రేహన్‌ అహ్మద్‌ (3/88), షోయబ్‌ బషీర్‌ (1/58) భారత్‌ను ఇబ్బందుల్లో పడేయడం ఇక్కడ పెద్ద విశేషం. వెటరన్‌ సీమర్‌ అండర్సన్‌ 2 వికెట్లు తీశాడు. అయితే తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 143 కలుపుకొని ప్రత్యర్థి ముందు టీమిండియా 399 పరుగుల కఠిన లక్ష్యాన్ని నిర్దేశించింది.

తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ ఆట నిలిచే సమయానికి 14 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి 67 పరుగులు చేసింది. అశ్విన్‌ బౌలింగ్‌లో ‘లోకల్‌ బాయ్‌’ కేఎస్‌ భరత్‌ అద్భుతమైన డైవింగ్‌ క్యాచ్‌తో డకెట్‌ (28; 6 ఫోర్లు) పెవిలియన్‌ చేరగా... క్రాలీ (29 బ్యాటింగ్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), రేహన్‌ (9 బ్యాటింగ్‌; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్‌ విజయానికి 332 పరుగుల దూరంలో ఉంది. 

శుబ్‌మన్‌ పోరాటం 
ఓవర్‌నైట్‌ స్కోరు 28/0తో ఆదివారం ఉదయం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన టీమిండియా రెండు పరుగుల వ్యవధిలోనే ఓపెనర్లిద్దరినీ కోల్పోయింది. పేసర్‌ అండర్సన్‌ ఈ రెండు వికెట్లు తీశాడు. అండర్సన్‌ వేసిన అద్భుత బంతికి రోహిత్‌ శర్మ (13; 3 ఫోర్లు) బౌల్డ్‌ అవ్వగా... యశస్వి (17; 3 ఫోర్లు) రూట్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కష్టాలతో మొదలైన రెండో ఇన్నింగ్స్‌ను శుబ్‌మన్‌ గిల్, శ్రేయస్‌ అయ్యర్‌ (29; 2 ఫోర్లు ) కాసేపు ఆదుకున్నారు.

జట్టు స్కోరు వంద దాటాక అయ్యర్, రజత్‌ పటిదార్‌ (9) స్పిన్‌ ఉచ్చులో పడ్డారు. కుదురుగా ఆడుతున్న గిల్‌ అర్ధసెంచరీ పూర్తిచేసుకోగా 130/4 స్కోరు వద్ద తొలి సెషన్‌ ముగిసింది. రెండో సెషన్‌లో శుబ్‌మన్, అక్షర్‌ పటేల్‌ భాగస్వామ్యం ఊరటనిచ్చింది. ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు 89 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 200 దాటగా... శుబ్‌మన్‌ శతకాన్ని సాధించాడు. చక్కగా సాగిపోతున్న ఈ జోడీని బషీర్‌... గిల్‌ వికెట్‌ తీసి విడగొట్టాడు.

కాసేపటికే అక్షర్‌ను హార్ట్‌లీ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. టీ విరామానికి 227/6 స్కోరుతో ఉన్న భారత్‌ ఆఖరి సెషన్‌లో స్పిన్‌కు దాసోహమైంది. అనూహ్యంగా 14.3 ఓవర్లలోనే మిగిలున్న 4 వికెట్లను కోల్పోయి కష్టంగా 28 పరుగులు మాత్రమే చేసింది. సొంతగడ్డపై రెండో ఇన్నింగ్స్‌లోనూ భరత్‌ (6) నిరాశపరిచాడు. కుల్దీప్‌ (0), బుమ్రా (0) ఖాతా తెరువకపోయినా... అశ్విన్‌ (29; 2 ఫోర్లు, 1 సిక్స్‌) వల్లే భారత్‌ 250 పైచిలుకు స్కోరు చేయగలిగింది.  

వైజాగ్‌లో మంచి శకునములే 
గతంలో వైజాగ్‌లో ఆడిన రెండు టెస్టుల్లోనూ భారత జట్టే గెలిచింది. ఈ రెండు సందర్భాల్లోనూ లక్ష్యాన్ని నిర్దేశించిన టీమిండియా ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసి భారీ విజయాలు నమోదు చేసింది. 2016లో ఇంగ్లండ్‌పై 246 పరుగుల తేడాతో... 2019లో దక్షిణాఫ్రికాపై 203 పరుగుల తేడాతో భారత్‌ ఘనవిజయం సాధించింది.

స్కోరు వివరాలు 
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 396; ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 253; భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: యశస్వి (సి) రూట్‌ (బి) అండర్సన్‌ 17; రోహిత్‌ (బి) అండర్సన్‌ 13; గిల్‌ (సి) ఫోక్స్‌ (బి) బషీర్‌ 104; అయ్యర్‌ (సి) స్టోక్స్‌ (బి) హార్ట్‌లీ 29; పటిదార్‌ (సి) ఫోక్స్‌ (బి) రేహన్‌ 9; అక్షర్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) హార్ట్‌లీ 45; భరత్‌ (సి) స్టోక్స్‌ (బి) రేహన్‌ 6; అశ్విన్‌ (సి) ఫోక్స్‌ (బి) రేహన్‌ 29; కుల్దీప్‌ (సి) డకెట్‌ (బి) హార్ట్‌లీ 0; బుమ్రా (సి) బెయిర్‌స్టో (బి) హార్ట్‌లీ 0; ముకేశ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (78.3 ఓవర్లలో ఆలౌట్‌) 255. వికెట్ల పతనం: 1–29, 2–30, 3–111, 4–122, 5–211, 6–220, 7–228, 8–229, 9–255, 10–255. బౌలింగ్‌: అండర్సన్‌ 10–1–29–2, బషీర్‌ 15–0–58–1, రేహన్‌ 24.3–5–88–3, రూట్‌ 2–1–1–0, హార్ట్‌లీ 27–3–77–4.
ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: క్రాలీ (బ్యాటింగ్‌) 29; డకెట్‌ (సి) భరత్‌ (బి) అశ్విన్‌ 28; రేహన్‌ (బ్యాటింగ్‌) 9; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (14 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 67. వికెట్ల పతనం: 1–50. బౌలింగ్‌: బుమ్రా 5–1–9–0, ముకేశ్‌ 2–0– 19–0, కుల్దీప్‌ 4–0–21–0, అశ్విన్‌ 2–0–8–1, అక్షర్‌ 1–0–10–0.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement