విశాఖ స్పోర్ట్స్: విశాఖపట్నంలోని వైఎస్సార్ స్టేడియంలో ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన మ్యాచ్ నిర్వాహక కమిటీ గురువారం స్టేడియంలో సమావేశమైంది. ఈ వివరాలను కమిటీ చైర్మన్, కలెక్టర్ ఎ.మల్లికార్జున మీడియాకు వెల్లడించారు. మ్యాచ్ వీక్షించేందుకు వచ్చే దేశ, విదేశీ అభిమానులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పటిష్ట భద్రతతో పాటు తాగునీరు, మెడికల్ సదుపాయాలు, ఆహారం కోసం స్టాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు.
అభిమానుల కోసం రవాణా సదుపాయాలను అందుబాటులో ఉంచుతామన్నారు. ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి ఎస్‌ఆర్ గోపినాథరెడ్డి మాట్లాడుతూ.. టెస్ట్ మ్యాచ్ టికెట్లను ఈనెల 15 నుంచి పేటీఎం యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయిస్తామని చెప్పారు. ఈసారి పూర్తిగా డిజిటల్ టికెట్లను అందించనున్నట్లు తెలిపారు. 100, 200, 300, 500 రూపాయల టికెట్లను ప్రతి రోజుకు విడివిడిగా విక్రయిస్తామని.. అలాగే ఐదు రోజులకు కలిపి తీసుకునే వారి కోసం టికెట్ ధరలను రూ.400, 800, 1,000, 1,500గా నిర్ణయించామన్నారు. వైఎస్సార్, స్వర్ణభారతి స్టేడియాల్లో 26 కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment