YS Rajareddy Cricket Stadium
-
2 నుంచి విశాఖలో భారత్, ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్
విశాఖ స్పోర్ట్స్: విశాఖపట్నంలోని వైఎస్సార్ స్టేడియంలో ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన మ్యాచ్ నిర్వాహక కమిటీ గురువారం స్టేడియంలో సమావేశమైంది. ఈ వివరాలను కమిటీ చైర్మన్, కలెక్టర్ ఎ.మల్లికార్జున మీడియాకు వెల్లడించారు. మ్యాచ్ వీక్షించేందుకు వచ్చే దేశ, విదేశీ అభిమానులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పటిష్ట భద్రతతో పాటు తాగునీరు, మెడికల్ సదుపాయాలు, ఆహారం కోసం స్టాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. అభిమానుల కోసం రవాణా సదుపాయాలను అందుబాటులో ఉంచుతామన్నారు. ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి ఎస్ఆర్ గోపినాథరెడ్డి మాట్లాడుతూ.. టెస్ట్ మ్యాచ్ టికెట్లను ఈనెల 15 నుంచి పేటీఎం యాప్ ద్వారా ఆన్లైన్లో విక్రయిస్తామని చెప్పారు. ఈసారి పూర్తిగా డిజిటల్ టికెట్లను అందించనున్నట్లు తెలిపారు. 100, 200, 300, 500 రూపాయల టికెట్లను ప్రతి రోజుకు విడివిడిగా విక్రయిస్తామని.. అలాగే ఐదు రోజులకు కలిపి తీసుకునే వారి కోసం టికెట్ ధరలను రూ.400, 800, 1,000, 1,500గా నిర్ణయించామన్నారు. వైఎస్సార్, స్వర్ణభారతి స్టేడియాల్లో 26 కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. -
నేటినుంచి విశాఖలో లెజెండ్స్ క్రికెట్
విశాఖ స్పోర్ట్స్: వైఎస్సార్ స్టేడియంలో ముగిసే లీగ్‌దశ చివరి ఫేజ్‌లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు ఎల్ఎల్సీ నాకవుట్‌కు చేరుకుంటాయని ఏసీఏ అపెక్స్ కౌ న్సిల్ కార్యదర్శి ఎస్ఆర్ గోపినాథరెడ్డి తెలి పారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ)లో చివరి దశ పోటీల్లో భాగంగా శనివారం తలపడనున్న జట్ల ఆటగాళ్లు శుక్రవారం విశాఖ చేరుకున్నారని చెప్పారు. నాకవుట్ పోటీలు సూరత్‌లో జరుగనున్నాయన్నారు. ఇండియా కాపిటల్స్, మణిపాల్ టైగర్స్, గుజరాత్ జెయింట్స్‌తో పాటు సదరన్ సూపర్‌స్టార్స్ జట్ల సభ్యులు విశాఖ చేరుకోగా ఎయిర్‌పోర్టులో ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ ఘనంగా స్వాగతం పలికిందని తెలిపారు. అర్బన్‌రైజర్స్ జట్టు శనివారం విశాఖ చేరుకోనుందని చెప్పారు. విశాఖలో మ్యాచ్‌లు.. శనివారం రాత్రి ఏడుగంటలకు ఇండియా కాపిటల్స్ జట్టుతో మణిపాల్ టైగర్స్ తలపడనుండగా, ఆదివారం మధ్యాహ్నం మూడుగంటలకు గుజరాత్ జెయింట్స్‌తో సదరన్ సూపర్‌స్టార్స్ జట్టు తలపడనుంది. 4వ తేదీ రాత్రి ఏడుగంటలకు లీగ్ దశలో చివరి మ్యాచ్ రాత్రి ఏడుగంటలకు మణిపాల్ టైగర్స్‌తో అర్బన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. -
ఏసీఏ వల్లే ఆటగాళ్ల అద్భుత రాణింపు
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ప్రోత్సాహంతోనే ఏపీ ఆటగాళ్లు రాణించి.. జాతీయ స్థాయిలో అవకాశాలు పొందుతున్నారని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ అన్నారు. ఏసీఏ 70 వసంతాల వేడుకలు సోమవారం విశాఖపట్నంలోని వైఎస్సార్ స్టేడియంలోని ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఆవిష్కరించారు. అనంతరం రోజర్ బిన్నీ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఏపీలో క్రికెటర్లకు అవసరమైన మౌలిక వసతులు, గ్రౌండ్లు, అకాడమీలు పెరుగుతున్నాయి. మరో పదేళ్లలో ఢిల్లీ, ముంబైతో పోటీపడే స్థాయికి రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి చెందుతోంది. తొలిసారిగా 1975లో రంజీ మ్యాచ్ ఆడేందుకు విశాఖ వచ్చాను. ఇప్పుడు విశాఖపట్నం ఎంతో అభివృద్ధి చెందింది. ఏపీలో మాదిరిగా అన్ని రాష్ట్రాల్లోనూ క్రీడలకు తగిన మౌలిక వసతులు కల్పించి.. క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరముంది. అప్పుడే భారత్‌లో క్రీడాభివృద్ధి సాధ్యపడుతుంది. బీసీసీఐ తరఫున స్కూల్ స్థాయి నుంచే ప్రొఫెషనల్ క్రికెటర్లను తయారు చేసేందుకు కృషి చేస్తున్నాం. ఈ ప్రక్రియ ఐదు రాష్ట్రాల్లో ముందంజలో ఉండగా.. ఇప్పుడు ఆంధ్ర చేరింది’ అని అన్నారు. ఐపీఎల్‌తో అద్భుత అవకాశాలు.. క్రికెట్ ఆడే దేశాల్లో నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్స్ అన్నింటిలో.. ఐపీఎల్‌కున్న క్రేజ్ ప్రత్యేకమైనదని రోజర్ బిన్నీ చెప్పారు. ఆ స్టాండర్డ్స్‌ను కాపాడాలంటే.. ఐపీఎల్లో పాల్గొనే ప్రాంచైజీల నియంత్రణ చాలా అవసరమన్నారు. అందుకే ఐపీఎల్లో మరో కొత్త ఫ్రాంచైజీకి అవకాశం ఇవ్వడం లేదని చెప్పారు. ఆ రోజుల్లో మూడు దశల్లో రాణించిన వారికి జాతీయ జట్టులో అవకాశం వచ్చేదని.. కానీ ఇప్పుడు ఐపీఎల్ తరహా ప్లాట్‌ఫాంలతో మెరుగైన ప్రొఫెషనల్ క్రికెటర్‌గా మారేందుకు అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు.మహిళల క్రికెట్‌ను బాగా ప్రోత్సహిస్తున్నామని.. వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరడమే ఇందుకు నిదర్శనమన్నారు. టీమిండియా మాజీ క్రికెటర్, కోచ్ మదన్‌లాల్ మాట్లాడుతూ.. మహిళా క్రికెట్ అభివృద్ధికి ఏసీఏ ఎంతో కృషి చేస్తోందని ప్రశంసించారు. ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారికి ప్రీమియర్ లీగ్ నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి ఎస్ఆర్ గోపినాథరెడ్డి, ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు పి.రోహిత్‌రెడ్డి, ఏసీఏ పూర్వ కార్యదర్శి చాముండేశ్వర్‌నాథ్, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు, సీఈఓ శివారెడ్డి, వీడీసీఏ వర్కింగ్ ప్రెసిడెంట్ విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌కు వేళాయె...
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్ సమరానికి నేడు తెరలేవనుంది. మొత్తం ఆరు ఫ్రాంచైజీ జట్లు కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్, రాయలసీమ కింగ్స్, గోదావరి టైటాన్స్, వైజాగ్ వారియర్స్, ఉత్తరాంధ్ర లయన్స్ మెరుపులతో టి20లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. డిఫెండింగ్ చాంపియన్ కోస్టల్ రైడర్స్, రన్నరప్ బెజవాడ టైగర్స్ల మధ్య బుధవారం జరిగే పోరుతో రెండో సీజన్ మొదలవుతుంది. ప్రతి రోజు రెండేసి మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ నెల 27న టైటిల్ పోరు నిర్వహిస్తారు. పోటీలన్నీ విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలోనే జరుగుతాయి. తొలి సీజన్లో ఆఖరి మెట్టుపై తడబడి టైటిల్ కోల్పోయిన బెజవాడ టైగర్స్ ఈ సారి టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. హిట్టర్ రికీ భుయ్పై గంపెడాశలు పెట్టుకున్న ఈ ఫ్రాంచైజీ రూ.8.10 లక్షలతో అతన్ని రిటెయిన్ చేసుకుంది. ఏపీఎల్‌లో ఇదే అత్యధిక మొత్తం కాగా, ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో నిరూపించుకున్న ఆంధ్ర క్రికెటర్లు హనుమ విహారి, కోన శ్రీకర్ భరత్‌లు కూడా ఈ లీగ్‌లో ఆడుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. విహారి రాయలసీమ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రూ. 6.60 లక్షలతో కింగ్స్ అతన్ని సొంతం చేసుకుంది. ఈ జట్టులో అతనిదే అత్యధిక పారితోషికం. భారత టెస్టు జట్టు వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ ఉత్తరాంధ్ర లయన్స్ తరఫున స్టార్‌గా బరిలో ఉన్నాడు. అతన్ని రూ. 6 లక్షలకు లయన్స్ కొనుగోలు చేసింది. వీళ్లతో పాటు ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) అకాడమీలలో రాణించిన కుర్రాళ్లు ఈ లీగ్‌తో ఏసీఏ సెలక్టర్ల కంట పడాలని ఆశిస్తున్నారు. ‘మన ఆంధ్ర–మన ఏపీఎల్’ అనే నినాదంతో పూర్తిగా స్థానిక కుర్రాళ్లకే అవకాశమిచ్చిన ఈ లీగ్‌ను చూసే ప్రేక్షకులకు కూడా నిర్వాహకులు బంపరాఫర్ ప్రకటించారు. ఏపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకించేందుకు వచ్చే ప్రేక్షకులకు లక్కీ డ్రాను ఏర్పాటు చేశారు. విజేతగా నిలిచిన క్రికెట్ అభిమానులకు ఈ స్టేడియంలో భారత్, ఆ్రస్టేలియాల మధ్య నవంబర్ 23న జరిగే టి20 మ్యాచ్ టికెట్లను ఉచితంగా బహుకరించనున్నారు. -
విండీస్‌కు అది వండర్ఫుల్ విజయం
వన్డే క్రికెట్ ఇప్పటికీ ఓ వండర్.. టీ20 వంటి ఫాస్ట్ ఫార్మాట్రంగ ప్రవేశం చేసిన తర్వాత కూడా స్పీడ్ తరగని థండర్.వన్డే ఎక్కడ జరిగినా స్టేడియంలో పోటెత్తే అభిమానులసాక్షిగా తరగని థ్రిల్‌కు ఈ మ్యాచ్ ఆలవాలం. నేటికీటీవీలకు కళ్లప్పగించి మ్యాచ్‌లో మమేకమయ్యే జనమేఅందుకు నిదర్శనం. అనుకోని ఫలితాలే ఈ థ్రిల్కుఆలంబన అని ఏ అభిమానిని అడిగినా చెబుతాడు. అటువంటి మ్యాచ్‌ల జాబితా కూడా వల్లె వేస్తాడు. అలాటిఅనుకోని ఫలితమే విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలోఅయిదేళ్ల కిందట చోటుచేసుకుంది. అప్పటికే గతి తప్పినవెస్టిండీస్ జట్టు జోరుమీద ఉన్న టీమిండియాను ఆమ్యాచ్‌లో చిత్తు చేసింది. ఇప్పుడు మరింతగాతడబడుతున్న విండీస్ జట్టు తలపుల్లో ఆ గెలుపుకచ్చితంగా కదులుతుంది. విశాఖ స్పోర్ట్స్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వన్డే సమరం కోసం భారత, వెస్టిండీస్ జట్లు విశాఖ చేరుకున్నాయి. మరో రోజు వ్యవధిలో సిరీస్‌లో రెండో వన్డేలో గెలుపు కోసం రెండు జట్లు వైఎస్సార్ స్టేడియం వేదికగా డేనైట్ మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలో గతంలో రెండు జట్లు తలపడ్డ మ్యాచ్‌లు అభిమానుల స్మృతులలో మెదలడం సహజమే. విశాఖ పాతనగరంలో ఉన్న ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో వెస్టిండీస్ భారత్‌తో ఒక మ్యాచ్ ఆడి ఓటమి చవిచూడగా.. వైఎస్సార్ స్టేడియంలో రెండు మ్యాచ్‌లలో తలపడి ఒకదానిలో ఓడి ఒకదానిని దక్కించుకుంది. హుద్‌హుద్ తర్వాత రెండు రోజులకు జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. విజయాల జోరుకు బ్రేక్ వైఎస్ఆర్ స్టేడియం ప్రారంభమైన తర్వాత వరుసగా నాలుగు వన్డేలలో విజయం సాధించి జోరుమీద ఉన్న టీమిండియాకు వెస్టిండీస్ ద్వారానే ఎదురుదెబ్బ తగిలింది. 2013లో మాత్రం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ను విండీస్ రెండు వికెట్ల తేడాతో ఓడించింది. స్టేడియంలో భారత్ ఓడిన తొలి మ్యాచ్ అదే. అంతకు ముందే విండీస్‌తో జరిగిన మరో వన్డేలో భారత్ గెలుపొందడంతో ఇప్పుడు రెండు జట్లూ విశాఖలో సమ ఉజ్జీలుగా ఉన్నట్టయింది. బుధవారం జరగనున్న మ్యాచ్‌లో గెలిచే జట్టు విశాఖలో పైచేయి సాధించినట్టవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ జోరుకు అనుభవలేమితో సతమతమవుతున్న విండీస్ బృందం అడ్డుకట్ట వేయడం కష్టమే అనుకున్నా.. వన్డేల్లో ఫలితం ఎలా ఉంటుందో ఊహించడం కష్టం కనుక ఉత్కంఠ చివరివరకు కొనసాగే అవకాశం ఉంది. మందకొడి బ్యాటింగ్ 2013 నవంబర్ 24న జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ వెస్టిండీస్ కోరిక మేరకు బ్యాటింగ్‌కు దిగింది. తొలి పది ఓవర్ల పవర్‌ప్లేలో 48 పరుగులే చేసింది. వంద పరుగుల మార్కు చేరేప్పటికి ఇరవై ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది. కోహ్లీ ఈ మ్యాచ్‌లో (వైజాగ్‌లో) సెంచరీల హ్యాట్రిక్ సాధిస్తాడనుకున్న అభిమానులకు గట్టి షాక్ తగిలింది. వందో బంతి ఆడుతున్న ఈ స్టార్ బ్యాట్స్‌మన్, రామ్‌పాల్ బౌలింగ్‌లో హోల్డర్ క్యాచ్ పట్టడంతో 99 పరుగుల వద్ద సెంచరీని కోల్పోయాడు. యువరాజ్ 28 పరుగులే చేయగా, ధోనీ 40 బంతుల్లో 51పరుగులతో అజేయంగా నిలిచి కెరీర్లో ఏభయ్యో అర్థసెంచరీని అందుకున్నాడు. భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. విండీస్ బ్యాట్స్‌మెన్ జోరు తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ తొలి రెండు వికెట్లను 23 పరుగులకే కోల్పోయినా తొలి పవర్ ప్లేలో 60 పరుగులు రాబట్టేసింది. పావెల్ 59 పరుగులు చేశాడు. సిమ్మన్స్(62)తో కలిసిన కెప్టెన్ బ్రావో (50) మిడిలార్డర్‌ను చక్కదిద్దాడు. ఈ దశలో ఏడో ఆటగానిగా 41వ ఓవర్లో బ్యాటింగ్‌కు దిగిన సామీ భారత్‌కు చుక్కలు చూపించాడు. 22 బంతుల్లో 19 పరుగులు చేస్తే గెలుపొందే స్థితికి జట్టును చేర్చాడు. అతడు అజేయంగా 63 పరుగులతో నిలవడమే కాక.. విండీస్‌కు రెండు వికెట్ల ఆధిక్యంతో చిరస్మరణీయ విజయం దక్కేలా చేశాడు. విండీస్‌కు అది వండర్ఫుల్ విజయం 2005లో వైఎస్సార్ స్టేడియం ప్రారంభమైనప్పటి నుంచి విశాఖలో గెలుపు జోరు మీద ఉన్న భారత జట్టుకు ఎనిమిదేళ్ల తర్వాత గానీ బ్రేక్ పడలేదు. వరుసగా నాలుగు వన్డేల్లో విజయం సాధించి మంచి ఊపుమీద ఉన్న టీమిండియాకు వెస్టిండీస్ ద్వారా తగిలిన షాక్ ఓ చేదు అనుభవంగా మిగిలిపోవడంతో ఆశ్చర్యం లేదు. -
కొనసాగుతున్న ఉద్యోగుల క్రికెట్ పోటీలు
కడప స్పోర్ట్స్: కడప నగరంలో నిర్వహిస్తున్న విద్యుత్ ఉద్యోగుల ఇంటర్ సర్కిల్ క్రికెట్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. నగరంలోని వైఎస్ రాజారెడ్డిృఏసీఏ క్రికెట్ మైదానం, వైఎస్ రాజారెడ్డిృఏసీఏ మైదానం, కేఎస్ఆర్ఎం, కేఓఆర్ఎం క్రీడా మైదానంలో మ్యాచ్‌లు నిర్వహించారు. వైఎస్ రాజారెడ్డి-ఏసీఏ క్రికెట్ మైదానంలో.. నగరంలోని వైఎస్ రాజారెడ్డి-ఏసీఏ క్రికెట్ మైదానంలో కడప జోన్, ఒంగోలు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కడప జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఒంగోలు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కడప జట్టు 17.5 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టులోని ప్రసాద్ 64 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. కేఎస్ఆర్ఎం క్రీడా మైదానంలో.. నగరంలోని కేఎస్ఆర్ఎం క్రీడామైదానంలో నిర్వహించిన తొలిమ్యాచ్‌లో అనంతపురం, వైజాగ్ జట్లు తలపడ్డాయి. టాస్‌గెలిచి బ్యాటింగ్‌కు దిగిన వైజాగ నిర్ణీత 20 ఓవర్లలో 111 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అనంత జట్టు 19.3 ఓవర్లలో 6 వికెట్లకు 115 పరుగులు చేసింది. దీంతో అనంత జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అనంతరం నిర్వహించిన రెండో మ్యాచ్‌లో గుంటూరు, తిరుపతి జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన తిరుపతి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గుంటూరు జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో తిరుపతి జట్టు 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. కేఓఆర్ఎం క్రీడామైదానంలో.. కేఓఆర్ఎం క్రీడామైదానంలో నిర్వహించిన తొలిమ్యాచ్‌లో విజయనగరం, కడప జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన విజయనగరం జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కడప జట్టు 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. దీంతో కడప జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో రాజమండ్రి, శ్రీకాకుళం జట్లు తలపడగా టాస్ గెలిచిన రాజమండ్రి జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీకాకుళం జట్టు 19.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. దీంతో రాజమండ్రి జట్టు శ్రీకాకుళంపై 62 పరుగుల తేడాతో విజయం సాధించింది.